ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్​

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్​

అలంపూర్,వెలుగు: జనాభాలో 99 శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్నదే  బీఎస్పీ అంతిమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో మంగళవారం  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పీఠంపై బహుజనుడిని కూర్చోబెట్టే లక్ష్యంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా అసైన్డ్ భూములను కేసీఆర్ బహిరంగ వేలం వేస్తున్నారని విమర్శించారు.  30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుని బడా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. 

దళితుల అసైన్డ్ భూములను బహిరంగ వేలం వేస్తున్నా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు.  కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని, లేదంటే రాజకీయ సన్యాసం స్వీకరించాలని డిమాండ్ చేశారు.  బహుజన ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే తుమ్మిళ్ల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.