
దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేందుకు… 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేరుకునేందుకు నిర్మలా సీతారామన్ బడ్జెట్2020లో పలు ప్రకటనలు చేశారు. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా పన్నులను సరళీకరణ చేయడమే కాకుండా… ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు ప్రకటించారు. ఇటు యువతరానికి ఊపునిచ్చేలా స్టార్టప్‌లకు పన్ను హాలిడేను పెంచారు. నిర్మలా చేసిన ప్రకటనల్లో ముఖ్యమైనవి…
న్యూఢిల్లీ : యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు పన్ను పేమెంట్లను సులభతరం చేశారు నిర్మలా సీతారామన్. ఉద్యోగులకు పన్ను భారాన్ని తగ్గించడం కోసం ఐదేళ్ల వరకు హాలిడేను ఇస్తున్నట్టు తెలిపారు. ఇది స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు బూస్టప్ ఇచ్చినట్టని కేంద్ర బడ్జెట్ 2020–21 స్పీచ్‌లో తెలిపారు. ఈసాప్(ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్) అనేది ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాల్లో ఒకటని నిర్మలా పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.25 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న అర్హతున్న స్టార్టప్‌లకు ఏడేళ్లలో వరుసగా మూడేళ్ల పాటు తమ ప్రాఫిట్స్‌పై 100 శాతం డిడక్షన్స్‌కు అనుమతిచ్చేవారు. స్టార్టప్‌లకు మరింత జోష్ ఇచ్చేందుకు.. పెద్ద స్టార్టప్‌లకు కూడా ఈ ప్రయోజనాలను అందిస్తున్నామని నిర్మలా తెలిపారు. ప్రస్తుతమున్న ఈ టర్నోవర్ లిమిట్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు. డిడక్షన్ క్లయిమ్ అర్హతను 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నట్టు కూడా నిర్మలా తెలిపారు.
కంపెనీలపై నో డివిడెండ్ ట్యాక్స్
ఫారిన్ సంస్థలకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి నిర్మలమ్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను సంస్థలకు తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ట్యాక్స్ ఇప్పుడు కేవలం ఇండివిడ్యువల్స్‌కు మాత్రమే ఉంటుంది. ఇన్ని రోజులు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ఇటు సంస్థలు, అటు డివిడెండ్ పొందే వారు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతమున్న రూల్స్ ప్రకారం, కంపెనీలు షేర్‌హోల్డర్స్‌కు చెల్లించే డివిడెండ్‌పై 15 శాతం, అప్లికబుల్ అయ్యే సర్‌ఛార్జ్, సెస్‌లు కలుపుకుని డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌డీడీటీ)ను చెల్లించాల్సి వచ్చేది. కంపెనీ ప్రాఫిట్స్‌పై చెల్లించే పన్నులకు ఇవి అదనం. ఈ సిస్టమ్.. ఇన్వెస్టర్లకు పన్ను భారాన్ని పెంచుతుందని ఎప్పడి నుంచో విశ్లేషకులంటున్నారు. డివిడెండ్‌పై ట్యాక్స్‌ను కేవలం ఇండివిడ్యువల్సే చెల్లించాలని ప్రతిపాదించారు.
స్మార్ట్‌మీటర్‌తో భర్తీ..
పవర్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్‌కు బడ్జెట్‌లో రూ. 22,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం పవర్ డిస్కమ్‌లు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ఆర్థికమంత్రి అన్నారు. డిస్కమ్‌లు పాతకాలపు మీటర్లను స్మార్ట్ మీటర్లతో భర్తీ చేయాలని, కస్టమర్లకు తమ ఎలక్ట్రిసిటీ సప్లయిర్లను ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న పాత కాలపు ఎలక్ట్రి సిటీ మీటర్లను, ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్లతో భర్తీ చేయాలన్నారు. దీంతో పాటు నేషనల్ గ్యాస్ పైప్‌లైన్ గ్రిడ్‌ను 27,000 కి.మీ వరకు విస్తరించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ పైప్‌లైన్ గ్రిడ్ 16,000 కి.మీగా ఉంది. నేచురల్ గ్యాస్ ప్రైస్‌ను నిర్ణయించడంలో పారదర్శకమైన సంస్కరణలను తీసుకొస్తామన్నారు.
ఎఫ్‌డీఐలు పెరిగాయ్
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) గత ఐదేళ్లలో రూ. 20, 16,400 కోట్లకు చేరుకున్నాయని బడ్జెట్ స్పీచ్‌లో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2014 లో రూ. 13,49,000 కోట్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు, 2019 నాటికి రూ. 20,16,400 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఫస్ట్‌హాఫ్‌లో ఎఫ్‌డీఐలు 15 శాతం పెరిగి రూ. 1,84,600 కోట్లకు చేరుకుందన్నారు.
ఎగుమతిదారులకు బడ్జెట్ అండ
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులకు బూస్ట్ ఇచ్చేందుకు తొందరలో కొత్త స్కీమ్‌ను లాంచ్ చేస్తామని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కీమ్ ప్రకారం ఎగుమతి దారులు కేంద్రస్థాయి, రాష్ట్రస్థాయిలలో చెల్లించిన ట్యాక్స్‌లు, డ్యూటీలను రియంబర్స్ చేసుకోవడానికి వీలుంటుందని బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి అన్నారు. వాల్యు యాడెడ్ ట్యాక్స్(వ్యాట్), ఎలక్ట్రిసిటీ డ్యూటీ, రవాణా కోసం వినియోగించిన ఫ్యుయల్ కాస్ట్‌ను ఇతర ప్రభుత్వ స్కీమ్‌ల నుంచి మినహాయింపు లేదా రిఫండ్ పొందలేకపోతే, ఈ కొత్త స్కీమ్ ద్వారా రియంబర్స్‌మెంట్ పొందొచ్చు.
ఐపీఓకి ఎల్‌ఐసీ….
ప్రభుత్వ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఎల్‌ఐసీను మార్కెట్‌లో లిస్ట్ చేయనున్నామని నిర్మలా ప్రకటించారు. ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి ఉన్న వాటాను అమ్మనున్నట్టు తెలిపారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపు
డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను ప్రభుత్వం ఐదింతలు పెంచింది. ఒక్కో డిపాజిటర్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ.5 లక్షలకు పెంచేలా డీఐసీజీసీకి అనుమతిస్తున్నట్టు నిర్మలా బడ్జెట్ స్పీచ్‌లో చెప్పారు.
బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న గిఫ్ట్ సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీ(ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సెంటర్) వద్ద ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది.