బీమార్‌ హారేగా.. దేశ్‌ జీతేగా

బీమార్‌  హారేగా..  దేశ్‌ జీతేగా

బడ్జెట్‌‌లో హెల్త్‌‌కు రూ. 69 వేల కోట్లు

ఆరోగ్య రంగానికి ఈసారి బడ్జెట్‌‌లో రూ. 69 వేల కోట్లు ప్రకటించారు. గతేడాది కన్నా 10 శాతం ఎక్కువ పైసలిచ్చారు. ఆయుష్మాన్‌‌ భారత్‌‌కు గతేడాది ఇచ్చినట్టే రూ. 6,400 కోట్లు కేటాయించారు. పథకాన్ని మరింత విస్తరించేందుకు టైర్‌‌ 2, టైర్‌‌ 3 నగరాల్లో మరిన్ని హాస్పిటళ్లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మల వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 20 వేల హాస్పిటళ్లు ఆయుష్మాన్‌‌కు సపోర్ట్‌‌ చేస్తున్నాయని తెలిపారు. పీఎంజేఏవైని ఇంకో వెయ్యి హాస్పిటళ్లలో స్టార్ట్‌‌ చేయడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం వయబిలిటీ గ్యాప్‌‌ ఫండింగ్‌‌ (వీజీఎఫ్‌‌)ను ఏర్పాటు చేస్తామని, ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో ఆయుష్మాన్‌‌ హాస్పిటళ్లు లేని 112 యాస్పిరేషనల్‌‌ జిల్లాల్లోనే ఈ పద్ధతిని స్టార్ట్‌‌ చేస్తామని, దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలూ వస్తాయని తెలిపారు.

దేశంలో మరిన్ని జన ఔషధి కేంద్రాలు

దేశంలోని అన్ని రాష్ట్రాలకు జన ఔషధి కేంద్ర పథకాన్ని విస్తరిస్తామని మంత్రి ప్రకటించారు. 2024 నాటికి వీటి ద్వారా 2 వేల మెడిసిన్స్‌‌, 300 సర్జికల్స్‌‌ అందిస్తామని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులను జనాలకు.. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలకు అందించి హాస్పిటల్‌‌ ఖర్చులు తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలో డాక్టర్ల కొరతను తగ్గించేందుకు ప్రతి జిల్లా ఆస్పత్రికి ఓ మెడికల్‌‌ కాలేజీని అటాచ్‌‌ చేస్తామని చెప్పారు. ఆయా కాలేజీలకు అవసరమైన స్థలాన్ని రాష్ట్రాలు తక్కువ ధరకే ఇవ్వొచ్చన్నారు. వీటి ఏర్పాటుకు వయబిలిటీ గ్యాప్‌‌ ఫండింగ్‌‌ ద్వారా నిధులు అందిస్తామన్నారు. పెద్ద హాస్పిటళ్లలో రెసిడెంట్‌‌ డాక్టర్‌‌ డిప్లొమా, ఫెలో ఆఫ్‌‌ నేషనల్‌‌ బోర్డ్‌‌ కోర్సులు చెప్పేందుకు తగిన ప్రోత్సాహం ఇస్తామన్నారు.

2025 కల్లా క్షయను తరిమేస్తం

దేశం నుంచి క్షయ రోగాన్ని తరిమేసేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి నిర్మల చెప్పారు. 2025 నాటికి క్షయ వ్యాధి నివారణే ధ్యేయమని.. ఇందుకు ‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడుతుంది.. దేశం గెలుస్తుంది) కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగిస్తామని వెల్లడించారు. దేశమంతా బహిరంగ మల విసర్జన రహితం చేసేందుకు వేగం పెంచుతామని ప్రకటించారు. త్వరలో ఓడీఎఫ్‌‌ ప్లస్‌‌ పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు కొత్త స్కీమ్‌‌లు స్టార్ట్‌‌ చేస్తామన్నారు. ఇక మిషన్‌‌ ఇంద్రధనుష్‌‌లో 12 రోగాలను కవర్‌‌ చేస్తున్నామని, 5 కొత్త వ్యాక్సిన్‌‌లను చేర్చామని చెప్పారు. 

విదేశీ మెడికల్‌‌ పరికరాలపై సెస్‌‌

విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మెడికల్‌‌ పరికరాలపై 5 శాతం నామినల్‌‌ హెల్త్‌‌ సెస్‌‌ను విధిస్తున్నట్టు మంత్రి నిర్మల వెల్లడించారు. దేశీయంగా మెడికల్‌‌ పరికరాల రంగానికి ఊతమిచ్చేందుకు, దేశీ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ సెస్‌‌ విధిస్తున్నట్టు తెలిపారు. ఈ సెస్‌‌ ద్వారా వచ్చిన సొమ్మును ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు వాడుతామని పేర్కొన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు మనం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మెడికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌పైనే ఆధారపడ్డామన్న మంత్రి.. ఇప్పుడు దేశంలోనే వాటిని రెడీ చేస్తున్నామని చెప్పారు. విదేశాలకు కూడా పరికరాలను ఎగుమతి చేస్తున్నామన్నారు.

స్వచ్ఛభారత్‌‌కు రూ.12,300 కోట్లు

నాన్‌‌ కమ్యూనికబుల్‌‌ రోగాలపై యుద్ధం ప్రకటిస్తామని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘ఫిట్‌‌ ఇండియా మిషన్‌‌’ ప్రచారం మొదలు పెడతామని మంత్రి చెప్పారు. దేశంలో రోగాలను తగ్గించేందుకు జల్‌‌ జీవన్‌‌ ప్రాజెక్టు, స్వచ్ఛ భారత్‌‌ మిషన్‌‌ను ఇంకా ఉధృతంగా అమలు చేస్తామన్నారు. దేశ ప్రజలందరికీ 2024 నాటికి నల్లా నీళ్లు అందించేందు జల్‌‌ జీవన్‌‌ ప్రాజెక్టుకు రూ. 3.6 లక్షల కోట్లు ప్రకటించామని చెప్పారు. ఈ పథకానికి ఈ ఏడాది రూ. 11,500 కోట్లు కేటాయించామన్నారు. పది లక్షల మంది కన్నా ఎక్కువ జనమున్న పట్టణాల్లో వర్షపు నీరు, ఇతర స్థానిక జలాలను ఒడిసి పట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛభారత్‌‌కు ఈ బడ్జెట్‌‌లో రూ.12,300 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. హెల్త్‌‌ రీసెర్చ్‌‌ విభాగానికి రూ. 2,100 కోట్లు, ఆయుష్​ శాఖకు రూ.2,122 కోట్లు ప్రకటించామన్నారు.

మరిన్ని వెలుగు వార్తలు కోసం క్లిక్ చేయండి