పేరు మారిన ఆ స్కీములకు డబుల్ ఫండ్స్!..భారీగా పెరగనున్న బడ్జెట్ అంచనాలు

పేరు మారిన ఆ స్కీములకు డబుల్ ఫండ్స్!..భారీగా పెరగనున్న బడ్జెట్ అంచనాలు
  • పింఛన్లు, రైతుభరోసాకు భారీగా పెరగనున్న బడ్జెట్ అంచనాలు
  • పింఛను రూ.4 వేలు.. దివ్యాంగులకు రూ.6 వేలు
  • బడ్జెట్​లో  పెన్షన్​లకే రూ.30 వేల కోట్లు అవసరం 
  • 2024-25కు బడ్జెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్, వెలుగు : కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మారిన కొన్ని స్కీములకు గతం కంటే డబుల్ నిధులు కేటాయించనుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు లబ్ధిదారులకు పథకాలు అందేలా బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీలపై ఫోకస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో స్కీములకు కేటాయింపులపై కసరత్తు మొదలుపెట్టింది. గత ప్రభుత్వం అమలు చేసిన స్కీములకు కొన్ని మార్పులు చేసి.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మార్పుల ప్రకారం కొత్త ప్రభుత్వం ఒక్కో స్కీముకు దాని అవసరాల మేర గతం కంటే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు చేయాల్సి ఉన్నది.

గత ప్రభుత్వంలో ఆసరా కింద ప్రతినెలా ఇచ్చిన పెన్షన్​లు కొత్త సర్కార్​ ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా చేయూత కింద  అందజేయునుంది. అయితే ఇప్పుడు దివ్యాంగులకు రూ.6 వేలు, మిగిలిన వారికి రూ.4 వేల చొప్పున ప్రతినెలా అందించాల్సి ఉన్నది. దీంతో ఈ పెన్షన్​లకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉన్నది. ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కింద రూ.5 లక్షల సాయం, రైతు భరోసా కింద ప్రతి సీజన్​కు ఎకరాకు రూ.7500లు ఇవ్వాల్సి ఉంటుంది.

గతంతో చూస్తే ఇవన్నీ భారీగా పెరగనున్నాయి. ఇక ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకం కింద కొత్త ప్రభుత్వం మహిళలకు వేరుగా రూ.2500 ఆర్థిక సాయం ప్రతినెలా ఇవ్వనుంది. దీనికి సపరేట్​గా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని పథకాలకు రెట్టింపు నిధులు కేటాయింపులు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 

పెన్షన్​లకే రూ.30 వేల కోట్లు !

కొత్త ప్రభుత్వం రానున్న బడ్జెట్​లో కేవలం పెన్షన్​లకే రూ.30 వేల కోట్ల పైన పెట్టనుంది. ప్రతినెలా వృద్ధ్యాప్య, గీత కార్మికులకు, డయాలిసిస్​, ఫైలేరియా బాధితులకు, బీడీ కార్మికులకు, బీడీ టేకేదారులకు, చేనేత కార్మికులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.4 వేల చొప్పున ప్రతినెలా ఇవ్వాల్సి ఉన్నది. వీటితో పాటు దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకోసం ఒక్కనెలకు దాదాపు రూ.2500 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. అదే గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.2 వేల ఆసరా పెన్షన్​కు దాదాపు రూ.1000 కోట్ల మేర ఖర్చు కేటాయింపులు చేశారు. అందులో భాగంగానే ఆసరా పెన్షన్​లకు గత ఆర్థిక సంవత్సరం రూ.12 వేల కోట్ల మేర కేటాయింపులు చేశారు.

అదే ఇప్పుడు కొత్త ప్రభుత్వం పెంచిన పెన్షన్​ల సాయం హామీకి అనుగుణంగా  కొత్త లబ్ధిదారులకు కూడా యాడ్​ చేసుకుంటే దాదాపు రూ.30 వేల కోట్లు అంటే ఏకంగా గతం కంటే రెట్టింపును మించి  అవసరం ఉండనుంది. పైగా మహాలక్ష్మి సాయం కింద రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తమని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఇందుకోసం కూడా రూ.10 వేల కోట్ల మేర అవసరం పడుతాయని అంటున్నారు. అయితే మార్గదర్శకాలు ఎలా ఉంటాయోనని చేయూత అందుతున్న ఇంట్లో మహలక్ష్మి ఇవ్వకపోతే ఈ మొత్తం కొంత తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇందిరమ్మ ఇండ్లదీ అదేదారి

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కొత్త ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. అయితే ఎంతమందికి ఎలా ఇస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ స్కీంకు నిధుల అంచనాలపై స్పష్టత రాలేదు. అయితే గత ప్రభుత్వం గృహలక్ష్మి కింద  రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈసారి కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ మొత్తాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్​ ను పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ మేరకే బడ్జెట్ అంచనాలు రూపొందించి పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి.

రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టి.. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తి బడ్జెట్​ను పెడుతుంది. దీంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కొంత అస్పష్టత ఉంటుంది. 2018లోనూ అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటాన్ బడ్జెట్​ను పెట్టింది. అయితే ఈ సారి ఫుల్​బడ్జెట్​కు కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

సీలింగ్ లేకుంటే రైతు భరోసాకు రూ.21 వేల కోట్లు

రైతుబంధు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తుంది. ఎకరాకు రూ.7500 చొప్పున రెండు సీజన్​లకు ఏడాదికి రూ.15వేలు రైతులకు చెల్లించాలి. ఇందుకు ఏకంగా రూ.21 వేల కోట్లు అవుతుంది. గత ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు సీజన్​లకు కలిపి ఏడాదికి రూ.10 వేలు లిమిట్ లేకుండా ఇచ్చింది. ఇందుకోసం రూ.15 వేల కోట్లు కేటాయించింది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసాకి సీలింగ్​ పెట్టేదానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఒకవేళ సీలింగ్ పెట్టినా రూ.2- వేల నుంచి రూ.3 వేల కోట్ల వరకు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది పట్టాదారులు ఐదు ఎకరాలు ఆ లోపే ఉండేలా మార్చుకున్నారని పేర్కొంటున్నారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​ ఉపాధి హామీ కూలీలు 61 లక్షల మంది ఉన్నారు. ఇందుకు దాదాపు రూ.7 వేల కోట్ల మేర అవసరం కానున్నాయి.