బడ్జెట్​ స్పెషల్​ : పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రక్రియ

బడ్జెట్​ స్పెషల్​ : పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రక్రియ

భారత రాజ్యాంగంలో ఆర్టికల్​ 112 బడ్జెట్​ గురించి తెలుపుతుంది. బడ్జెట్​ ఒక ఆర్థిక బిల్లు. ఆర్టికల్​ 112 ప్రకారం వార్షిక ఆదాయ, వ్యయ అంచనాల విత్త పట్టిక. ఒక ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆదాయ వ్యయాల అంచనాల పట్టికే బడ్జెట్​. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ విధానం 1863 నుంచి అమలులో ఉంది. 1860–1863 వరకు ఆర్థిక సంవత్సరం మే 1 నుంచి ఏప్రిల్​ 30 వరకు ఉండేది.

భారతదేశంలో మొదటి బడ్జెట్​ను జేమ్స్​ విల్సన 1860, ఏప్రిల్​ 7న ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్​ను 1947, నవంబర్​ 26న ఆర్​.కె.షణ్ముగంశెట్టి ప్రవేశపెట్టారు.  1921లో విలయం అక్వర్త్​ కమిటీ సూచనల ఆధారంగా 1924 సాధారణ బడ్జెట్​ నుంచి రైల్వే బడ్జెట్​ను వేరు చేశారు. తిరిగి 2017 నుంచి బిబేక్​ దెబ్రాయ్​ సూచనల మేరకు సాధారణ బడ్జెట్​లో రైల్వే బడ్జెట్​ను విలీనం చేశారు. 

బడ్జెట్​లో ఆదాయ అంచనాలను, వ్యయ అంచనాలను వేర్వేరుగా చూపించాలి. బడ్జెట్​లో వ్యయ​ అంచనాలను రెండు భాగాలుగా చూపించాలి. 1. భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయం. 2. భారత సంఘటిత నిధి నుంచి తీసుకొనే వ్యయం. 

ఆమోద దశలు

బడ్జెట్ ఆమోదంలో ఆరు దశలు ఉంటాయి. అవి.. 1. ప్రవేశదశ, 2. సాధారణ చర్చ 3. డిపార్ట్​మెంట్​ స్టాండింగ్​ కమిటీల ద్వారా పరిశీలన 4. గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్​ 5. ఉపకల్పన బిల్లు ఆమోదం 6. ద్రవ్యబిల్లు ఆమోదం.

ప్రవేశ దశ: బడ్జెట్​ను రాష్ట్రపతి తరఫున ఆర్థిక మంత్రి ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవారు. 2017 నుంచి ఫిబ్రవరి 1న ప్రవేశ పెడుతున్నారు. దీంతోపాటు ఆర్థిక మంత్రి బడ్జెట్​ ప్రసంగం ఉంటుంది. లోక్​సభలో బడ్జెట్​ ప్రసంగం ముగిసిన తర్వాత ఆర్థిక శాఖ స్టేట్​ మంత్రి బడ్జెట్​ను రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభ బడ్జెట్​ను చర్చించవచ్చు. కానీ ఓటింగ్​ వేయకూడదు. బడ్జెట్​ను ప్రవేశపెట్టిన రోజు ఎలాంటి చర్చ జరగదు. ​

సాధారణ చర్చ: బడ్జెట్​ ప్రవేశపెట్టిన తర్వాత సభ ఏడు రోజులు వాయిదా వేస్తారు. సభ తిరిగి సమావేశమయ్యాక బడ్జెట్​పై సాధారణ చర్చ జరుగుతుంది. ఎలాంటి కోత తీర్మానాలు ఉండవు. బడ్జెట్​పై ఓటింగ్​ కూడా ఉండదు. ఈ దశలో బడ్జెట్​లోని ప్రత్యేక అంశాలపై కాకుండా పాలనా వైఫల్యం, అవినీతి, శాంతిభద్రతలు, జాతీయ సమైక్యత, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చిస్తారు. 

స్టాండింగ్​ కమిటీల పరిశీలన: సాధారణ చర్చ ముగిసిన తర్వాత సభ మూడు నుంచి నాలుగు వారాలు వాయిదా పడుతుంది. ఈ సమయంలో పార్లమెంట్​లో ఉన్న 24 డిపార్ట్​మెంటల్ స్టాండింగ్​ కమిటీలు పలు శాఖలకు సంబంధించిన బడ్జెట్​ ప్రతిపాదనలను విస్తృతంగా అధ్యయనం చేసి పరిశీలనకు రెండు సభలకు నివేదికను అందజేస్తారు. 

నిధుల కోసం డిమాండ్లపై ఓటింగ్​: డిపార్ట్​మెంటల్ స్టాండింగ్​ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా నిధుల కోసం గల డిమాండ్లపై మంత్రిత్వశాఖల వారీగా డిమాండ్లు చర్చించబడి ఓటింగ్​ జరుగుతుంది. ఈ పద్దులపై ఓటు వేసే అధికారం కేవలం లోక్​సభకు మాత్రమే ఉంటుంది. రాజ్యసభకు ఉండదు. ఈ ఓటింగ్​ కూడా కేవలం భారత సంఘటిత నిధి నుంచి తీసుకొనే వ్యయం మీద మాత్రమే జరుగుతుంది.

ప్రతి డిమాండ్​కు సంబంధించి ప్రత్యేకంగా ఓటింగ్​ జరుగుతుంది. ఈ సందర్భంలో సభ్యులు బడ్జెట్​ గురించి కూలంకుషంగా చర్చించి కోత తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు.  26 రోజుల్లోగా డిమాండ్లు మొత్తం ఆమోదించకపోతే 26వ రోజున ఆమోదించబడకుండా మిగిలిపోయిన డిమాండ్లు అన్నింటినీ కలిపి చర్చించకుండానే గిలిటెన్​ తీర్మానం ద్వారా ఆమోదిస్తారు. మొత్తం ప్రక్రియ 26 రోజులపాటు జరుగుతుంది. బడ్జెట్​ మొత్తం ప్రక్రియలో అత్యధిక సమయం ఈ దశలోనే తీసుకుంటారు. 

ఉపకల్పనాల బిల్లు ఆమోదం: ఆర్టికల్​ 114 ప్రకారం పార్లమెంట్​ అనుమతి లేకుండా భారత సంఘటిత నిధి నుంచి ఎలాంటి ఖర్చులు చేయకూడదు. కాబట్టి బడ్జెట్​లో తాత్కాలిక ఖర్చులకు సంబంధించిన విభాగాన్ని ఉపకల్పనా బిల్లు ద్వారా ఆమోదిస్తారు. దీని ద్వారా భారత సంఘటిత నిధి నుంచి తీసుకొనే వ్యయం, చెల్లించే వ్యయం వేర్వేరుగా చూపుతారు. ఈ దశలో ఎలాంటి సవరణలు చేయకూడదు. ఉప కల్పనా బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో చట్టం అవుతుంది.

దీంతో ప్రభుత్వానికి భారత సంఘటిత నిధి నుంచి చెల్లింపులు చేయడానికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది. ఈ మొత్తం జరిగేటప్పటికి ఏప్రిల్​ మాసాంతం అవుతుంది. కాబట్టి తాత్కాలికంగా అప్పటివరకు సాధారణ కార్యకలాపాల కోసం ఖర్చులు చేయడానికి ప్రభుత్వానికి అనుమతిస్తూ పార్లమెంట్​ తాత్కాలిక బడ్జెట్​ను ఆమోదిస్తుంది. ఇది రెండు నెలల కాలపరిమితికి సరిపోయేలా బడ్జెట్​ మొత్తంలో 1/6 వంతు ఉంటుంది. ఓట్​ ఆన్ అకౌంట్​ను సాధారణ చర్చ ముగిసిన వెంటనే ఆమోదిస్తారు. 

కోత తీర్మానాలు 

విధాన కోత తీర్మానం: ప్రభుత్వం చేసే ఖర్చులో ఉన్న విధానం ఆమోదయోగ్యంగా లేకపోతే పార్లమెంట్​ విధాన కోత తీర్మానాన్ని ప్రతిపాదిస్తుంది. దీని ద్వారా డిమాండ్​ చేసిన సొమ్ము 1 రూపాయికి తగ్గించబడుతుంది. దీని ద్వారా సభ్యులు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించవచ్చు. 

మిత వ్యయ లేదా ఆర్థిక కోత తీర్మానం: ప్రభుత్వం మితిమీరి ఖర్చు పెడుతుందని భావించినప్పుడు ప్రభుత్వ వ్యయంలో పొదుపును పాటింపజేసే ఉద్దేశంతో ఈ తీర్మానం ప్రతిపాదిస్తారు. దీని ద్వారా డిమాండ్​ చేసిన మొత్తం నుంచి ఒక నిర్ణీత సొమ్మును తగ్గించమని గానీ లేదా ఒక అంశాన్ని తొలగించమని గానీ ప్రతిపాదిస్తారు. 

నామమాత్ర కోత తీర్మానం: ప్రభుత్వం పట్ల ఒక నిరసనను వ్యక్తం చేయడానికి టోకెన్​ కోత ప్రతిపాదించబడుతుంది. దీని ద్వారా డిమాండ్​ చేసిన సొమ్ములో నుంచి 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 రూపాయలు తగ్గిస్తారు. 
కోత తీర్మానాల స్వభావం

1. కోత తీర్మానాలు సాధారణంగా ప్రతిపక్షం ప్రవేశ పెడతాయి. కాబట్టి చర్చకు అనుమతించబడవు. 
2. స్పీకర్​ వీటిని చర్చకు అనుమతించినప్పటికీ ప్రభుత్వానికి ఉండే మెజార్టీలకు ఆమోదించబడవు. 
3. వీటిని ఆమోదిస్తే ప్రభుత్వంరాజీనామా చేయాలి.
4. వీటి ద్వారా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించబడుతుంది. కాబట్టి వీటిని కేవలం లోక్​సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.

ఆర్లిక బిల్లు ఆమోదం: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన నిధుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే పన్నుల ప్రతిపాదనే ఈ ఆర్థిక బిల్లు. బడ్జెట్​లో ఈ ఆదాయ విభాగాన్ని ద్రవ్య బిల్లు అంటారు. ద్రవ్య బిల్లును ఆమోదించే సందర్భంలో సవరణలు ప్రతిపాదించవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. ఆర్టికల్​ 265 ప్రకారం చట్ట సమ్మతి లేనిదే పన్నులు విధించరాదు.

కాబట్టి లోక్​సభ ఆమోదించనప్పుడు మాత్రమే ప్రభుత్వానికి పన్ను విధించి ఆదాయాన్ని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసే నాటికి జూన్​ నెల ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ లోపుగా పన్నులు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తూ 1931లో తాత్కాలిక పన్ను వసూలు చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ఆర్థిక బిల్లు 75 రోజుల్లోగా ఆమోదించబడాలి. ఈ విధంగా ద్రవ్య బిల్లును ఆమోదించడంతో బడ్జెట్​ ప్రక్రియ ముగుస్తుంది.