బడ్జెట్​ దృష్టి భవిష్యత్​ మీదే! : పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి

బడ్జెట్​ దృష్టి భవిష్యత్​ మీదే! : పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి

బతుకులు బాగుంటేనే బడ్జెట్‌‌‌‌ బాగున్నట్టు. ఇంకోలా చెప్పాలంటే, బడ్జెట్‌‌ బాగుంటే బతుకులు బాగుంటాయి. బడ్జెట్‌‌ అంటే... కేవలం అంకెలు, గణాంకాలు మాత్రమే కాదు. దాని అమలు, తద్వారా సాధించే ఫలితాలే ఒక బడ్జెట్‌‌ మంచిదో, కాదో చెబుతాయి. బడ్జెట్‌‌ అనేది దేశంలోని పౌరులందరి జీవితాల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసే దేశ ‘ఆర్థిక విధాన పత్రం’ కాబట్టి అందులో ప్రతిపాదనలు మనమంతా దృష్టి పెట్టాల్సిన అంశాలే! ఏయే రంగాలకు ఎంతేసి ప్రాధాన్యత ఇచ్చారు? వేటిని నిర్లక్ష్యం చేశారు? ఎక్కడి నుంచి డబ్బు రాబడుతున్నారు? మరెక్కడ ఖర్చు పెడుతున్నారు? తద్వారా ఏం సాధించదలచుకున్నారు? వంటి విషయాలు సర్కారు ముందే తన ప్రజలకు చెప్పడమే బడ్జెట్‌‌.  పౌరులెన్నుకున్న ప్రజాప్రతినిధులు అత్యున్నత చట్టసభలో వాటిపై చర్చించి, తగిన సవరణలు చేసి, ఆమోదిస్తారు. దాని ప్రకారం సర్కారు ఏడాది నడుచుకోవాలి. చూపించిందే ఆమోదించక, ఆమోదించినంత వెచ్చించక, వెచ్చించింది ఖర్చు చేయక... ఏడాది నడుమ, ఇష్టానుసారం సవరించిన గణాంకాలకు వెళుతున్నప్పుడు బడ్జెట్‌‌ పవిత్రత పలుచన అవుతుంది. కాబట్టి అన్ని దశల్లోనూ పౌరులు అప్రమత్తంగా ఉండి పరిణామాలను గమనించాలి. 2023-–24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ బుధవారం లోక్‌‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌ సమకాలీన సమస్యల్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి నిలపడమే కాకుండా భారీ ఆశలు కల్పించేదిగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి ధరల్ని నేలకు దించడం, నిరుద్యోగిత రేటును తగ్గించడం, తెలుగు రాష్ట్రాల విభజన హామీల్ని అమలుపరచడం వంటి విషయాలకు ప్రాధాన్యత, ఇంకొంత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించినట్టు, 2047లో నూరేళ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి ఆవిష్కరించబోయే ‘మహాన్‌‌ భారత్‌‌’కు ఇప్పటి నుంచే భూమిక సిద్ధం చేసే ప్రయత్నంగా ప్రస్తుత బడ్జెట్ స్వరూపం ఉంది.

ఆర్థిక వ్యవస్థకు ఊతం

అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ రూపకల్పన భారత్‌‌ కంటున్న కల! తద్వారా మనం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్లిపోతామనేది అంచనా. ఇందుకు ఆర్థిక వ్యవస్థను అత్యంత చలనశీలతతో ఉంచాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. మూలధన వ్యయాన్ని మూడోవంతు(33 శాతం) పెంచి, బడ్జెట్‌‌లో రూ.10 లక్షల కోట్లు(మొత్తం బడ్జెట్‌‌లో దాదాపు నాలుగో వంతు) ఇందుకోసం వెచ్చిస్తోంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం తరుముకొస్తున్న పరిస్థితుల్లో మౌలికరంగ సదుపాయాల కల్పనకు, స్థానిక తయారీ రంగ ప్రోత్సాహానికీ ఈ మొత్తాల్ని వెచ్చించడం ద్వారా ప్రైవేటు పెట్టుబడుల్నీ భారీగా రాబడతామనేది ఆశ! రాష్ట్రాలకు రుణ సదుపాయాన్ని పెంచడం కూడా ఇందులో ఉంది. నౌకాశ్రయాలు – పరిశ్రమల మధ్య రవాణాకే రూ.75 వేల కోట్ల వ్యయప్రతిపాదన ఒక అంశం. దేశంలో అధిక సంఖ్యాకులైన మధ్యతరగతికి చేయూతనిస్తున్న భావన కలిగించి వారి వ్యయశక్తిని, వ్యయం చేసే తత్వాన్ని పెంచేందుకు ఈ బడ్జెట్‌‌లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. సంపూర్ణ ఉపశమనం ఇవ్వకపోయినా, ఆదాయ పన్ను పాక్షిక సంస్కరణలు వారికి ఊరట అని భావించింది. పాత పన్ను విధానం కన్నా, రూ .7 లక్షల వరకు పన్ను లేని కొత్త పద్ధతికి మధ్యతరగతిని మళ్లించడం ద్వారా పొదుపు కన్నా వ్యయంపైనే వేతన జీవులు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది. ఇది ఎకానమీని ఎంత పరుగులు పెట్టించినా, ప్రభుత్వ వ్యవస్థీకృత సామాజిక భద్రత లేని మన సమాజంలో ఇదేపాటి ఆరోగ్యకరమైందో ఆర్థిక నిపుణులే చెప్పాలి! ఉన్నంతలో, కొత్త ‘మహిళా సమ్మాన్‌‌’ పొదుపు ఊరట! 2024 లోక్‌‌సభ సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌‌ అయ్యే ఆస్కారం ఉండటంతో... ఎవరినీ నొప్పించని బడ్జెట్‌‌గా రూపు దిద్దిన సంకేతాలున్నాయి.అమలు మొదలైతే గానీ, అసలు తత్వం బోధపడదు.

కర్బన ఉద్గారాల కట్టడికి చర్యలు

మిషన్‌‌ గ్రీన్‌‌ ఎనర్జీ కింద 2030 నాటికి 5 మిలియన్‌‌ టన్నుల గ్రీన్‌‌ హైడ్రోజన్‌‌ ఉత్పత్తి లక్ష్యంగా చెప్పింది. గ్రీన్‌‌ హైడ్రోజన్‌‌ మిషన్‌‌కు రూ. 19,744 కోట్లు కేంద్ర ప్రభుత్వం నెలకిందటే ఆమోదించింది. ‘జీరో కర్బన ఉద్గారాల’ సాధన దిశలో పలు ప్రత్యేక చర్యల కోసం ఈ బడ్జెట్‌‌లో రూ. 35000 కోట్లు ప్రతిపాదించింది. ముంచుకు వస్తున్న వాతావరణ మార్పు దుష్పరిణామాలు, భూతాపోన్నతి దృష్ట్యా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు గ్రీన్‌‌ ఎనర్జీ రంగంలో 2030 నాటికి 8 లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడుల్ని రాబట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ విషయంలో కాప్‌‌–26(యూకే), కాప్‌‌–27(ఈజిప్టు) సదస్సుల్లో భారత్‌‌ తన వంతు మాటగా గంభీరమైన ప్రకటనలు చేసింది. చర్యలు ఎలా ఉంటాయో ఈ బడ్జెట్‌‌ కేటాయింపులు, కార్యాచరణను బట్టి ఉంటుంది. కోటి మంది రైతులు ప్రకృతి – సహజ వ్యవసాయం వైపు మళ్లుతారని చెప్పిందే తప్ప ఎలాగో చెప్పలేదు. వ్యవసాయానికి, అనుబంద్ధ రంగాలకు కేటాయింపులు తగ్గించడమో, బొటాబొటీగా ఉంచడమో ఈ బడ్జెట్‌‌లో కొట్టొచ్చినట్టు కనిపించినా, బయోఫర్టిలైజర్‌‌కు కేటాయింపు హర్షించదగిందే! విద్య, వైద్యంలోనూ అంతంతే! రక్షణ, భద్రత, క్రీడలు, మిల్లెట్లు తదితరాల్లో కొంత పెంపు ఉంది.

నిరుద్యోగితను ప్రస్తావించాల్సింది..

కేంద్రం కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే, దేశంలో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న యువత బడ్జెట్‌‌ పత్రాల్లోకి వచ్చి ఉండేది. వారికొక ఆశావహ భారతం కనిపించేది. కోవిడ్‌‌ తదనంతర పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలు ఊడి, కిందకు నెట్టబడి, కొత్త ఉద్యోగాలు రాక కోట్ల కుటుంబాలు అల్లాడుతున్నాయి. పది లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయానికి సిద్ధపడి, మిషన్‌‌ గ్రీన్‌‌ ఎనర్జీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ఈ రెండు చర్యలతో ప్రైవేటు పెట్టుబడుల్ని స్వాగతిస్తూ – ప్రోత్సహిస్తున్న ప్పుడు నిరుద్యోగిత సమస్యను పరిష్కరించే దిశలో నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి ఉండాల్సింది. కార్పొరేట్‌‌ రంగానికి దిశా నిర్దేశం చేస్తూ, యువశక్తి వినియోగానికి వారిని బాధ్యుల్ని చేయాల్సింది. ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా, సత్తువ గల శ్రమ శక్తి(డెమోగ్రాఫికల్‌‌ డివిడెండ్‌‌) ఉన్న దేశంగా మనకున్న అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు. స్థిరాస్థిరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించట్లేదు. అక్కడ ఉండే అవకాశాల్ని క్రమబద్ధీకరించి, ట్యాప్‌‌ చేసేలా కార్యక్రమం రూపొందించి ఉంటే యువతకొక భరోసా కలిగేది! ఏకలవ్య మోడల్‌‌ రెసిడెన్షియల్‌‌ బడుల్లో విడతల వారీగా 38,800 టీచర్లను నియమిస్తామన్నదొకటి ఆశావహం!

ఇదే యేడు ఎన్నికలున్నా...

కర్నాటకలాగే, మొత్తం 9 రాష్ట్రాల్లో ఒకటిగా ఈ సంవత్సరమే ఎన్నికలు జరగాల్సిన తెలంగాణ ఎందుకో కేంద్రం దృష్టికి ఆనలేదు. విభజన హామీలేవీ తెరకెక్కలేదు. ఇదివరకే హామీ పడి ఉన్న ఖాజీపేట కోచ్‌‌ యూనిట్‌‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, నిమ్జ్‌‌, ఇతర సెజ్‌‌లు ఏవీ ప్రస్తావనకు నోచుకోలేదు. రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో నిధులు పెరగలేదు.15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులకూ కోత పడింది. రాష్ట్రానికి లభించే కేంద్ర పన్నుల వాటాలో స్వల్ప(2.1శాతం) పెరుగుదల మాత్రమే నమోదైంది. అధికారంలోకి వచ్చి రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందాలనుకుంటున్న తెలంగాణపై కేంద్రం ఈ సారైనా ఓ చూపు చూసి ఉండాల్సిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

- ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి
పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌, 
పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ