సదర్‌ సంబురాలకు దున్నరాజులు రెడీ

సదర్‌ సంబురాలకు దున్నరాజులు రెడీ

దీపావళి పండుగ తర్వాత ‘సదర్’ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. డప్పు చప్పుళ్లు, యువత నృత్యాల నడుమ అందంగా ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాయి. యాదవులు  ఘనంగా జరుపుకునే పండగ సదర్.. దీపావళి నుండి రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాలను చూడడానికి వేలాది మంది నగరానికి వస్తుంటారు. ‘సదర్’ ఉత్సవాలకు హర్యానా నుండి తీసుకొచ్చిన ‘గరుడ’ దున్నరాజు అట్రాక్షన్ గా నిలువనుందని ఎడ్ల హరిబాబు యాదవ్ వెల్లడించారు. ఈ ఏడాది  26, 27న విన్యాసాలు  జరగనున్నాయని తెలిపారు.

ఈసందర్భంగా ఎడ్ల హరిబాబు యాదవ్ తో V6 ముచ్చటించింది. శ్రీ కృష్ణ, కింగ్ ఇలా.. 9 పేర్లు కలిగిన దున్న రాజులను తీసుకొచ్చామన్నారు. చిన్న పిల్లలను ఎలా కేర్ తీసుకుంటామో అలాగే ఈ దున్నపోతులను చూసుకుంటామన్నారు. రబ్బర్ మ్యాట్ పై వాటిని పడుకోబెడుతామన్నారు. 27వ తేదీన సాయంత్రం ముషీరాబాద్ లో ప్రారంభమై నారాయణగూడ వరకు ప్రదర్శన ఉంటుందని, తెల్లవారుజాము వరకు కొనసాగుతుందన్నారు. 40 లక్షల యాదవుల జనాభా ఉన్నా..  ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదని..సదర్ ను అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు. శ్రీ కృష్ణ దున్నరాజు 7 ఫీట్ల ఎత్తు, 1800 కిలోల బరువు, 18 ఫీట్ల వెడల్పు ఉంటుందన్నారు. 



జబర్దస్త్  మేత..

ఉత్సవాల కోసం ఇతర రాష్టాల దున్నరాజులు కూడా వస్తుంటాయి. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ఆస్ట్రేలియా దున్నరాజు షేర్ఖాన్ ఉండనుంది. ప్రత్యేక ఆకర్షణగా 35 కోట్ల హర్యానా దున్నరాజు గరుడ ఉండనుంది. దీని మేత ఖర్చు రోజుకు రూ.8 వేల నుండి రూ.10 వేల దాకా ఉంటుంది. హర్యానా దున్నరాజు దాణాగా డ్రై ఫ్రూట్స్,యాపిల్స్ ,10 లీటర్ల పాలు అందిస్తారు. వారానికోసారి రమ్ము, విస్కీ కూడా తాగిస్తారు.