కొత్తిల్లు కట్టడం, ప్లాట్ కొనడం ఇక ముందు భారమే! 

కొత్తిల్లు కట్టడం, ప్లాట్ కొనడం ఇక ముందు భారమే! 
  • భూముల విలువ, రిజిస్ట్రేషన్​చార్జీల పెంపుతో అదనపు ఖర్చు 
  • సాధారణ, మధ్యతరగతి వర్గాలపై  తీవ్ర ఎఫెక్ట్​ 
  • బహిరంగ మార్కెట్ లో క్రమంగా పెరగనున్న ధరలు

హైదరాబాద్, వెలుగు : కొత్తగా ఇల్లు కట్టాలన్నా.. ఓపెన్ ప్లాట్, అపార్ట్​మెంట్ ​లో ఫ్లాట్ ​కొనాలన్నా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు ఇకముందు భారం కానున్నాయి. లోన్లపై ఇండ్లు కొనేవారు అదనంగా పైసలు కూడ బెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.  ప్రభుత్వం భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో అంచనాలకు మించి బడ్జెట్ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా రూ. లక్ష నుంచి మూడున్నర లక్షల వరకు అదనపు భారం పడనుంది.  ప్రస్తుతం రేట్లను సవరించడంతో మార్కెట్ వాల్యూ రెండున్నర శాతం పెరగడంతో  చిన్న ఖర్చులే తడిసి మోపెడవుతాయి.  ప్రధానంగా రియల్ మార్కెట్ ఉన్న సిటీపై తీవ్ర ప్రభావం చూపనుంది.  ఇక బహిరంగ మార్కెట్ లో ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉండడంతో రివైజ్ చేసిన రిజిస్ట్రేషన్ చార్జీలతో సిటీ రియాలిటీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.  
ఇప్పుడిప్పుడే మార్కెట్​..
ఇప్పటికే కరోనాతో అన్నివర్గాల ఆదాయాలు తలకిందులు అయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ పుంజుకోవడంతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో భూముల మార్కెట్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఆర్థికంగా మరింత భారం మోపినట్లేనని రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నిర్మాణ వ్యయం 15 శాతం పెరగడంతో నిర్మాణంలోని ప్రాజెక్టులపైనే ఎక్కువ భారం పడుతుంది.  బడ్జెట్ అంచనాలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు రెండు, మూడు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఖైరతాబాద్ కు చెందిన బిల్డర్ రామ్మోహన్ చెప్పారు. 
మిడ్ రేంజ్ ఫ్లాట్లపైనా..
బడ్జెట్ ఇండ్లకు సిటీలో విపరీతమైన డిమాండ్ ఉంది.  రూ. 30లక్షల్లో దొరికే ఫ్లాట్లకు కనీసం లక్షన్నర చార్జీలుగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలతో అదనంగా రూ. 3.5లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. బడ్జెట్ రూ. 30 లక్షల నుంచి రూ. 35లక్షల పెరగనుందని రియల్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా బడ్జెట్ ఇండ్లను కొనుగోలు చేయాలనుకునేవారు,  స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు కూడా సవరించిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు విద్యానగర్ ఏరియాలో గతంలో గజం మార్కెట్ విలువ రూ. 26, 437 ఉండేది. ఆస్తి విలువలో 6.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుతో కనీసం రూ. 2.5లక్షలయ్యేది.  ఇప్పుడు సవరించిన భూముల విలువతో ప్రస్తుతం రూ. 35,250కు పెరిగింది. ఈ లెక్కన 150 గజాల జాగాకు రూ. 3.9లక్షలు పెడితే గానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి. అదనంగా లక్షన్నర చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫ్లాట్ల విలువను కూడా సవరించడంతో ప్రధానంగా మిడ్ రేంజ్ అపార్టుమెంట్లలో కొనుగోలు చేసే క్రమంలో బడ్జెట్ మూడు లక్షల వరకు పెరగనుంది.