వలస కూలీలకు బిల్డర్ల అండ.. వసతులు కల్పిస్తూ భరోసా

వలస కూలీలకు బిల్డర్ల అండ.. వసతులు కల్పిస్తూ భరోసా
  • మాస్కులు, శానిటైజర్లు, సరుకుల పంపిణీ 
  • లేబర్ క్యాంపులలో హెల్త్ చెకప్స్, మెడిసిన్స్
  • కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తం 

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ తో బిల్డర్లు అప్రమత్తమయ్యారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వలస కూలీలు మళ్లీ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. లేబర్ క్యాంపులలో హెల్త్ చెకప్స్ నిర్వహిస్తున్నారు. కార్మికులకు మాస్కులు, శానిటైజర్లతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు. కేసులు పెరుగుతున్నా భయపడొద్దని, తామున్నామనే భరోసా ఇస్తున్నారు. పోయినేడాది లాక్ డౌన్ తో నిర్మాణ రంగ కార్మికులు సొంతూళ్లకు వెళ్లగా, ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడింది. లేబర్లు మళ్లీ ఇంటిదారి పడితే నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న బిల్డర్లు.. వాళ్లు వెళ్లకుండా తగిన సౌలతులు కల్పిస్తున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణ రంగంలో స్కిల్డ్, ఆన్ స్కిల్డ్ లేబర్ లో 90 శాతం మంది వలస కూలీలే ఉన్నారు. నిర్మాణ పనులు జరిగే చోటనే వీరికి షెల్టర్ ఇచ్చి, పనులు చేయించుకుంటారు. అయితే లాక్ డౌన్ టైమ్ లో లేబర్ క్యాంపులన్నీ ఖాళీ అయ్యాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లలో చాలామంది తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో ఉన్నోళ్లు కూడా పోతే.. మళ్లీ రారని బిల్డర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేబర్ క్యాంపులలో ప్రైవేట్ డాక్టర్లతో కార్మికులకు హెల్త్ చెకప్స్ చేయిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు ఉంటే మందులు ఇస్తున్నారు. కొన్ని నిర్మాణ కంపెనీలైతే ఏడాదిగా ప్రతినెలా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. చత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలపైనే హైదరాబాద్ లోని నిర్మాణం  రంగం ఆధారపడి ఉంది. కరోనాకు ముందు 5 లక్షలకు పైనే కార్మికులు సిటీలో ఉండగా... లాక్ డౌన్ తర్వాత వారి సంఖ్య రెండున్నర నుంచి మూడు లక్షలకు పడిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వారిలో దాదాపు 40 నుంచి 50 శాతం మంది తిరిగి రాలేదు. ఏటా హోలీతో పాటు జూన్, జులై టైమ్ లో సొంత రాష్ట్రాలకు వెళ్లే మైగ్రెంట్ లేబర్లు.. తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ లో సిటీకి వస్తుంటారు. అయితే లాక్ డౌన్ టైమ్ లో కార్మికులందరూ వెళ్లిపోగా.. వారిలో దాదాపు 50 నుంచి 60 శాతం మంది మాత్రమే తిరిగి వచ్చారు. ఇప్పుడు మరోసారి కేసులు పెరుగుతుండడంతో.. ఉన్నోళ్లు పోతే వాళ్లు కూడా తిరిగి రారని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. వాళ్లను ఇక్కడే ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా రూల్స్ పాటిస్తూనే పనులు కొనసాగిస్తున్నారు. 
నిర్మాణంలో రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులు.. 
ప్రస్తుతం సిటీలో రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 18కి పైగా 20 అంతస్తుల హైరైజ్ బిల్డింగులు, 19,352 అపార్టుమెంట్లతో పాటు 30 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉంది. పోయినేడాది లాక్ డౌన్ కారణంగా సిటీలో 1,680 ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. ఆ టైమ్ లో నిర్వహణ వ్యయం, లేబర్ షార్టేజీకి తోడు మెటీరియల్ రేట్లు పెరిగి బిల్డర్లకు ఆర్థికంగా భారమైంది. ఈ క్రమంలో మరోసారి లేబర్ వెళ్లిపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని బిల్డర్లు భావిస్తున్నారు. మరోవైపు అదనంగా మెయింటెనెన్స్, ఫండింగ్ సంస్థలకు చెల్లించాల్సిన వడ్డీలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా ప్రాజెక్టులను పూర్తి చేసి, అమ్ముకుంటేనే మంచిదని ఆలోచిస్తున్నారు. అందుకే పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఏడాదిగా హెల్త్ క్యాంపులు పెడ్తున్నం 
పోయినేడాది లేబర్ సొంతూళ్లకు వెళ్లడంతో ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ఐదు సైట్లలో 1,500 మందికి పైనే పని చేస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి కార్మికుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోయినేడాది మొదలుపెట్టిన నెలవారీ హెల్త్ చెకప్ క్యాంపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరోనా లక్షణాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే కార్మికులను క్యాంపుకే పరిమితం చేస్తున్నాం. వారి హెల్త్ వివరాలను రికార్డు చేయడంతో పాటు రేషన్ సరుకులు అందిస్తున్నాం. - పి.శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాజపుష్ప ప్రాపర్టీస్ 

కార్మికులకూ టీకా వెయ్యాలె 
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నిర్మాణ రంగంపై పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. వలస కూలీల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నిర్మాణ సంస్థలకు చెబుతున్నాం. నిర్మాణ సైట్ల వద్దనే కార్మికులకు టీకా వెయ్యాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. అదే విధంగా కార్మిక శాఖ నుంచి సౌలతులు కల్పించాలని కోరాం. - రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్, జనరల్ సెక్రటరీ.