ఇది పరుగులు తీసే బుల్లెట్టూ..

ఇది పరుగులు తీసే బుల్లెట్టూ..

హైదరాబాదుకి బుల్లెట్ ట్రైన్లు  వస్తాయన్న వార్త  సిటీ ప్రజల్లో జోష్ పెంచేసింది. ఇప్పటికిప్పుడే కాకపోయినా త్వరలోనే బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం వెస్టర్న్‌ ఇండియాలోని ముంబై–అహ్మదాబాద్‌ నగరాల మధ్య లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ పనులు సాగుతున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 2009–2010 రైల్వే బడ్జెట్‌లో దేశంలో అయిదు హైస్పీడ్‌ కారిడార్లపై ప్రపోజల్స్‌ పెట్టారు. తమ హయాంలో హైస్పీడ్​ కాకుండా ఏకంగా బుల్లెట్​ ట్రైన్​లనే పట్టాలెక్కించాలని మోడీ సర్కారు నిర్ణయించింది. బుల్లెట్‌ రైళ్లు వచ్చినయిట్లయితే… డెవలప్‌మెంట్‌ గ్యారంటీ అంటున్నారు. కుప్ప పోసినట్లుగా నగరాలకే పరిమితమైన అభివృద్ధి గ్రేడ్‌–బి టౌన్‌లకుకూడా అందుతుంది.

బుల్లెట్ ట్రైన్ ది మామూలు స్పీడు కాదు. జపాన్ వంటి దేశాల్లో గంటకు దాదాపు 350 కిలోమీటర్ల స్పీడుతో  దూసుకెళుతుంది.  కొన్ని దేశాల్లో స్పీడు 320 కిలోమీటర్లు. ఏమైనా కనురెప్పపాటులో నగరాలను దాటుకుంటూ వెళుతుంది. ప్రపంచానికి తొలిసారి బుల్లెట్ ట్రైన్‌‌లను  పరిచయం చేసింది జపాన్ దేశం. ప్రపంచంలో అనేక దేశాలు బొగ్గుతో రైళ్లు నడుపుతున్న దశలో బుల్లెట్ ట్రైన్‌‌ని పట్టాలమీదకెక్కించి కెవ్వు కేక పెట్టించింది జపాన్.  ఇంటర్నేషనల్ రైల్వేస్ చరిత్రనే తిరగరాసింది. ఒక సిరీస్‌‌లో  బుల్లెట్ ట్రైన్‌‌లను తయారు చేయడం మొదలెట్టింది.  ఇందులో గంటకు 350 కిలోమీటర్ల  స్పీడుతో వెళ్లే  ట్రైన్‌‌ని  తయారు చేసి  ప్రపంచం ఆశ్చర్యపడేలా చేసింది. జపాన్ దేశస్తులకు బుల్లెట్ ట్రైన్‌‌లో జర్నీ చేయడం ఇప్పుడు మామూలై పోయింది. విండో పక్కన కూర్చుని  కొన్ని సెకన్లలో మాయమయ్యే నగరాలు, పట్టణాలను చూస్తూ థ్రిల్లయిపోతున్నారు.  చాలా మంది జపాన్ దేశస్తులకు బుల్లెట్ ట్రైన్ జర్నీ నిత్య జీవితంలో భాగంగా మారింది. బుల్లెట్ ట్రైన్‌‌ల విషయంలో జపాన్ బాటలో  చైనా,  జర్మనీ నడిచాయి.  చైనాలోని అనేక రూట్లలో ఇప్పటికే  బుల్లెట్ ట్రైన్‌‌లు పరుగులు తీస్తున్నాయి. ఇక్కడ మినిమం స్పీడే 250 కిలోమీటర్లు ఉంటుంది. జర్మనీ అయితే టీఆర్–09 పేరుతో ఒక సిరీస్‌‌ని తయారు చేసింది.  జర్మనీ రూపొందించిన బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల స్పీడుతో పరుగులు తీస్తుంది.

సేఫ్టీ ఓరియంటేషన్ ముఖ్యం

బుల్లెట్ ట్రైన్‌‌ని పట్టాలెక్కించడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న రైల్వే ట్రాక్ ఏమాత్రం పనికి రాదు. బుల్లెట్ ట్రైన్‌‌లకోసం  ప్రత్యేక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాదు బేస్మెంట్ కూడా పక్కాగా ఉండాలన్నారు. ట్రైన్  స్పీడును తట్టుకునేలా బేస్మెంట్‌‌ చాలా స్ట్రాంగ్‌‌గా ఏర్పాటు చేసుకోవాలి. పట్టాలపై  ట్రైన్ పరుగులు తీస్తున్నప్పుడు  ఫ్రిక్షన్ ఉంటుంది. దీనిని నివారించడానికి ట్రాక్​ నిర్మాణంలో ప్రత్యేక టెక్నాలజీని ఫాలో కావాలి అంటున్నారు నిపుణులు. దీని వల్ల  ట్రైన్‌‌కి సడన్ బ్రేకులు వేసినా, యాక్సిడెంట్లు కావట. బోగీలు సేఫ్ జోన్‌‌లోనే ఉంటాయన్నారు ఎక్స్‌‌పర్ట్‌‌లు. బోగీల్లో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జపాన్‌‌లో నడిచే బుల్లెట్ ట్రైన్‌‌ బోగీలకు స్టీల్ వాడరు. అల్యూమినిమంతోనే  తయారు చేస్తారు. బుల్లెట్ స్పీడుతో వెళ్లే  ట్రైన్ కాబట్టి సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే, మనకు అందుబాటులో ఉన్న బ్రేకింగ్ సిస్టమ్ ఏమాత్రం పనికిరాదు. బ్రేకింగ్ సిస్టమ్‌‌లో సమూల మార్పులు చేయాలంటున్నారు రైల్వే ఎక్స్‌‌పర్ట్‌‌లు.  బ్రేక్ వేసినా లేదా ట్రైన్ స్లో చేసినా,  యాక్సిడెంట్లు జరగకుండా,  ప్రయాణీకులు తూలి కిందపడకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికోసం ప్రతి వీల్‌‌కి షాక్ అబ్జార్బర్  సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మన దేశంలో ఏ ప్రాజెక్ట్‌‌ చేపట్టాలన్నా భూ సేకరణ అనేది పెద్ద యజ్ఞం. రాజకీయ, సామాజిక వర్గాల నుంచి చాలా అభ్యంతరాలు, వత్తిడులు వస్తాయి. ప్రస్తుతం సాగుతున్న  ముంబై–అహ్మదాబాద్‌‌ బుల్లెట్‌‌ ట్రైన్‌‌ ప్రాజెక్ట్‌‌కికూడా భూ సేకరణే పెద్ద సమస్య. ప్రాజెక్ట్‌‌ రిపోర్ట్‌‌ ప్రకారం 2022 ఆగస్టు నాటికి బుల్లెట్‌‌ ట్రైన్‌‌ పరుగులు తీయాలి. అయితే, భూ సేకరణలో జాప్యంవల్ల ప్రాజెక్ట్‌‌ పూర్తవడానికి మరో ఏడాది పట్టవచ్చని అనధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే, 2023 నాటికిగానీ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవచ్చు.

సొంతూళ్లోనే టిఫిన్‌‌, డిన్నర్‌‌

తెలంగాణలోని ఇతర నగరాలు, సెకండ్​ టయిర్​ కార్పొరేషన్లుకూడా అన్ని విధాలా లాభపడతాయి. హైదరాబాదులో సెటిల్​ అవ్వాలనుకునేవారి సంఖ్య చాలా మటుకు తగ్గుతుంది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేసేవారు తమ సొంతూరి నుంచే రాకపోకలు సాగించి, సకాలంలో వర్క్‌‌ ప్లేస్‌‌లకు చేరుకోవచ్చు. వ్యాపారాభివృద్ధికి, కొత్త కొత్త ప్రాజెక్టులకు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌‌కి స్పెషల్‌‌ ట్రాక్‌‌ చాలా ఉపయోగపడుతుంది.   హైదరాబాదులో ఉద్యోగం చేసేవారు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉండదు. నిజామాబాదులోనో, వరంగల్‌‌లోనో, ఖమ్మంలోనో ఉండొచ్చు. మార్నింగ్ ఫ్రెష్‌‌గా బుల్లెట్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుని డిన్నర్‌‌కి ఇంటికి చేరుకోవచ్చు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌‌ సమస్య తీరుతుందంటున్నారు సిటీ ప్లానర్లు.

ఇండియాకు అవసరమా?

మనది చాలా పెద్ద దేశం. ప్రజల అవసరాలకు తగ్గట్టు రవాణా సదుపాయాలుకూడా ఉండాలి. బుల్లెట్ రైళ్లు ట్రాన్స్‌పోర్టేషన్‌లో వేగం పెంచుతాయంటున్నారు నిపుణులు. సాధారణ ప్రయాణీకుల అవసరాలను తీర్చేది రైళ్లే. బుల్లెట్ ట్రైన్లు పట్టాలెక్కితే ఇండియా సోషల్‌ స్ట్రక్చరే మారిపోతుంది. హై స్పీడ్ కనెక్టివిటీ వస్తుంది. ఫలితంగా నార్త్ నుంచి సౌత్‌కి కూడా చాలా తక్కువ టైమ్‌లో ప్రయాణం చేసే వెసులుబాటు ప్రజలకు కలుగుతుంది. రఫ్‌గా చెప్పాలంటే 500 కిలోమీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లో చేరుకునే అవకాశాన్ని ఈ రైళ్లు కల్పిస్తాయి.

ఎంప్లాయ్‌మెంట్‌కి బూస్ట్‌

బుల్లెట్ ట్రైన్లు ఎంట్రీ ఇస్తే  ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నది ఒక అంచనా.  రైల్వే లైన్ నిర్మాణం దశలోనే కొన్ని వేల మంది కార్మికులకు  పని దొరుకుతుంది.  కొన్నేళ్లుగా దేశంలో అర్బనైజేషన్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టు రవాణా రంగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడం లేదు. హై స్పీడ్ రైల్వే లైన్లు వస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

ఇక, బుల్లెట్ ట్రైన్ల వ్యవస్థ సంప్రదాయ రైల్వే  వ్యవస్థతో పోలిస్తే పూర్తిగా డిఫరెంట్. సేఫ్టీకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది హై స్పీడ్ రైల్వే వ్యవస్థ. జపాన్‌లో అనేక రూట్లలో  పెద్ద సంఖ్యలో బుల్లెట్ ట్రైన్లు తిరుగుతున్నా యాక్సిడెంట్లయిన దాఖలాలు లేవు. దీనికి కారణం సేప్టీ సిస్టమ్ పక్కాగా ఉండటమే.

ట్రాక్ పూర్తిగా డిఫరెంట్

బుల్లెట్ ట్రైన్ ట్రాక్ డిఫరెంట్ గా ఉంటుంది. సేఫ్టీ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ రైల్వే ట్రాక్ లో ఉంటే అతుకులు అలాగే మలుపు ఇందులో ఉండవు. దీనికి ప్రత్యేకంగా ట్రాక్​ వేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు పట్టాలు స్ట్రయిట్ గా ఉంటాయి. అలా ఉండటం వల్లే  రైలు అంత స్పీడుగా వెళ్లగలుగుతుంది. ఈ ట్రాక్ మీద నడిచే రైలు పెట్టెలకు బరువు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే  పట్టాలపై  రైలు పరుగులు తీస్తుంటే మూడు అడుగుల దూరంలో నిలబడ్డ మనుషులు మాట్లాడుకుంటే అంత శబ్దం వస్తుందో అంత శబ్దమే (70 డెసిబుల్స్) అవుతుంది. టన్నెల్స్ లో నిర్మించే  ట్రాక్ ను ‘స్లాబ్ ట్రాక్ ’ అంటారు. స్లాబ్ ట్రాక్ నిర్మాణానికి ఖర్చు 30 శాతం తగ్గుతుంది. బుల్లెట్ ట్రైన్స్ కు ఉపయోగించే సిగ్నల్ సిస్టమ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దీనిని ‘ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్’ సిస్టమ్ అంటారు. బుల్లెట్ ట్రైన్ల ఆపరేషన్లను సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ మానిటర్ చేస్తుంది. ట్రైన్ల మూవ్ మెంట్ తో సహా అన్నీ సీటీసీ కంట్రోల్లో నే ఉంటాయి.

ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్.. రియల్ ఎస్టేట్ కు కిక్

బుల్లెట్ ట్రైన్ అనేది ఇండియాకు ఎప్పటినుంచో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్. 2014 సెప్టెంబరులో జపాన్ టూర్‌‌కి వెళ్లినప్పుడు బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి అక్కడి ప్రభుత్వంతో  ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. బుల్లెట్ ట్రైన్లు వస్తే మనదేశంలో పరిస్థితులే మారిపోతాయి. ముంబై–అహ్మదాబాద్‌‌ కారిడార్‌‌తో పాటుగా మరో అయిదు హైస్పీడ్‌‌ రైలు కారిడార్లుకూడా ఉన్నాయి.  మన్మోహన్‌‌ సింగ్‌‌ హయాం (2009–2010 రైల్వే బడ్జెట్‌‌)లోనే హైస్పీడ్‌‌  కారిడార్ల సాధ్యాసాధ్యాలపై స్టడీ చేయాలని ప్రతిపాదించడమైంది.  వీటిని తమ హయాంలో పట్టాలెక్కించాలని మోడీ సర్కారు భావిస్తోంది. ముంబై మీరుగా ఫుణే నుంచి అహ్మదాబాద్‌‌కి బుల్లెట్‌‌ రైలుని నడిపించడానికి స్టడీ రిపోర్టు రెడీ అయ్యింది. ఈ కారిడార్లన్నీ అహ్మదాబాద్‌‌ నుంచి ఆరంభమై సూరత్‌‌, వడోదర, భరూచ్‌‌ల మీదుగా లోనావాలా, ముంబై, పుణేలకు చేరుకుంటాయి. దీనిని బెంగళూరుకుకూడా పొడిగించాలని రైల్వే అధికారులు ప్రతిపాదించారని సమాచారం. ఇవి వెస్టర్న్‌‌ ఘాట్స్‌‌ మీదుగా సాగే కారిడార్లు. దక్షిణానికి సంబంధించి తాజాగా హైదరాబాద్‌‌ను బుల్లెట్‌‌ రైలు ప్రాజెక్ట్‌‌లో చేర్చినట్లు జేఆర్‌‌ సెంట్రల్‌‌ (జపాన్‌‌ రైల్వే కంపెనీ) వెల్లడించింది.

జోష్‌‌లో జపాన్ ఎకానమీ

జపాన్​ ఎకానమీని బుల్లెట్​ ట్రైన్​ కంప్లీట్​గా మార్చేసింది. జపాన్​లో అందరూ టోక్యోలోనే సెటిల్​ అవ్వడానికి ఇష్టపడతారు. దేశంలోని సగం జనాభా టోక్యో నగరంలోనే ఉంటుంది. బుల్లెట్​ ట్రైన్​ వచ్చాక ఎక్కడో మారుమూల పట్టణాల్లో ఉండేవారు కూడా టోక్యోకు వచ్చి ఉద్యోగం చేసుకుని తిరిగి సొంతూరుకు వెళ్లే వెసులుబాటు కలిగింది. దీంతో జర్నీ సమయం తగ్గడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా బుల్లెట్​ ట్రైన్లు మేజర్ రోల్ పోషిస్తున్నాయి. జపాన్ ఎకానమీ పై  బుల్లెట్ ట్రైన్ల ప్రభావం చాలా ఎక్కువ.  సహజంగా జపాన్ ఆర్థికవ్యవస్థలో కార్పొరేట్ కంపెనీలదే పై చేయి. జపాన్ ఎకానమీని ఈ కంపెనీలే శాసిస్తాయి. ఎంత పెద్ద కంపెనీకైనా  సప్లయర్ చాలా ముఖ్యం. టోక్యోలో బడా కంపెనీలు  ఉంటే సప్లయర్ లు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరాన ఉంటారు. బుల్లెట్ ట్రైన్లు రాకముందు టోక్యోలో ఉండే  కంపెనీలకు, ఎక్కడో ఉండే సప్లయర్ కు మధ్య  సరైన కనెక్టివిటీ ఉండేది కాదు. కార్పొరేట్ కంపెనీల బిజినెస్ నత్తనడకన సాగేది.  ఏ ప్రోడక్ట్‌‌ అయినా కేవలం కొన్ని నిమిషాల్లోనే సప్లయర్ దగ్గరకు చేరడం మొదలైంది. కనెక్టివిటీ ప్రభావం బిజినెస్‌‌పై పడి,  కంపెనీల టర్నోవర్ పెరిగింది.

రెండు గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌‌కి!

ఇప్పటికే వెస్టర్న్‌‌ ఇండియాలో కీలకమైన ముంబై –అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మొదలయ్యింది. మరో మూడేళ్లలో (2022 ఆగస్టు నుంచి) ఈ రైలు పట్టాలెక్కాలన్న లక్ష్యంతో స్పీడ్‌‌గా పనులు చేస్తున్నారు… జపాన్‌‌కి చెందిన జేఆర్ సెంట్రల్ సంస్థ ఈ నిర్మాణాన్ని  చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌‌కి సంబంధించి ఇండియా, జపాన్ మధ్య 2014లో ‘మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయు)’ కుదిరింది. 505 కిలోమీటర్ల దూరం ఉండే ముంబై–అహ్మదాబాద్  ట్రైన్ రూటులో  మొత్తం 12 స్టేషన్లుంటాయి. మహారాష్ట్రలో 155 కిలోమీటర్లు, గుజరాత్‌‌లో 350 కిలోమీటర్ల మేర  హై స్పీడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది. దాదాపు ఏడు కిలోమీటర్ల ట్రాక్‌‌ సముద్రం లోపల ఉంటుంది. దీని కోసం సెపరేట్‌‌గా టన్నెల్ తవ్వుతారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ బుల్లెట్ ట్రైన్‌‌లో 750 సీట్లు ఉంటాయి.  రైలు మ్యాగ్జిమమ్ 350 కిలోమీటర్ల స్పీడుతోనూ, మినిమం 320 కిలోమీటర్ల స్పీడుతోనూ పరుగులు తీస్తుంది. ఈ ప్రాజెక్ట్‌‌కి  1,08,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నది అంచనా.  ఈ రెండు సిటీల మధ్య ప్రస్తుతం ప్రయాణ సమయం ఎనిమిదిన్నర  గంటలు పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌‌ పూర్తయితే కేవలం రెండు గంటల ఎనిమిది నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు.

కంఫర్ట్​కే ప్రాధాన్యం

బుల్లెట్ రైళ్లంటే చాలా ఖరీదైన వ్యవస్థ అనుకుంటారు.  మారుతున్న పరిస్థితులతో పోలిస్తే  ఆ అభిప్రాయం తప్పంటారు నిపుణులు. వీటికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిదులు కేటాయించాల్సిన అవసరం ఉండదంటున్నారు. మామూలు రైళ్లతో పోలిస్తే  బుల్లెట్ ట్రైన్లలో టికెట్ ఖరీదు ఎక్కువే ఉండొచ్చు. అయితే, ప్రజల మైండ్‌‌సెట్ మారింది. డబ్బుల కంటే కంఫర్ట్‌‌కే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రయాణ సమయం కలిసి వస్తున్నందువల్ల ప్రజలు బుల్లెట్ రైళ్లకే ప్రాధాన్యం ఇస్తారని అంచనా వేస్తున్నారు సోషల్ సైంటిస్టులు. ఒకప్పుడు విమానాల్లో కేవలం డబ్బులున్నవాళ్లే  ప్రయాణం చేసేవారు. ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా విమానాల్లో ప్రయాణించడానికి వెనకాడటం లేదు. బుల్లెట్ ట్రైన్స్ విషయంలోనూ ఇదే రూల్ అప్లయ్ అవుతుందన్న అభిప్రాయం తెర మీదకు వచ్చింది.

దూసుకెళుతున్న  చైనా

ఐదేళ్లుగా హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీలో చైనా దూసుకెళ్తోంది. ఈ రంగంలో అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టి వాటిని సక్సెస్ చేసింది. మొత్తం ప్రపంచంలో గల బుల్లెట్ ట్రైన్ల నెట్​వర్క్​లో 65 శాతం చైనాలోనే ఉంది. తమ అవసరాలకు  అనుగుణంగా 12 వేల కిలోమీటర్ల  రైల్వే లైన్‌ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.  దేశంలో ఒక కొస నుంచి మరో కొసకు కేవలం కొన్ని గంటల్లోనే వెళ్లడానికి వీలుగా కనెక్టివిటీని పెంచింది.  సామాన్యుల ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా కంఫర్ట్ జోన్‌లో ఉంచింది. తాజాగా షాంగ్జి ప్రొవిన్స్ లోని బోజిని, గన్సు ప్రొవిన్స్‌లోని లాన్ ఝాతో కనెక్ట్ చేసే కొత్త రైల్వే లైన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో ఆపిల్ రైతులకు మేలు జరుగుతుంది. మార్కెటింగ్‌  అవకాశాలు పెరుగుతాయంటున్నారు.

అతి పొడవైన బుల్లెట్‌ రైలు

తాజాగా దేశంలోనే అతి పొడవైన బుల్లెట్ రైలును చైనా ప్రవేశపెట్టింది.  ప్రస్తుతం బీజింగ్–షాంఘై రూట్‌లో దూసుకెళ్తున్న ఈ రైలు పొడవు 440 మీటర్లు. ఇప్పటివరకు చైనాలో అతి పొడవైన బుల్లెట్ ట్రైన్ 414 మీటర్లు మాత్రమే ఉంది.