యుద్ధ విమానాలతో రాష్ట్రానికి ఆక్సిజన్..మోడీకి కృతజ్ఞతలు

యుద్ధ విమానాలతో రాష్ట్రానికి ఆక్సిజన్..మోడీకి కృతజ్ఞతలు

తెలంగాణలో కోవిడ్ బాధితుల కోసం, యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా కు చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. యుద్ధ ట్యాంకర్ల ద్వారా రాష్ట్రాని ఆక్సిజన్ తీసుకురావడంపై  ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని  భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయని తెలిపారు బండి సంజయ్. భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుందన్నారు. దీని కోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వెంటనే ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రయత్నం చేయడం సంతోషకరమని పత్రికా ప్రకటనలో తెలిపారు.

దేశంలో సునామీ లాగా వచ్చిన రెండో ఫేజ్ కరోనాను ఎదుర్కొనేందుకు మోడీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోందన్నారు బండి సంజయ్. ఒక వైపు  పెరుగుతున్న కరోనాను నియంత్రిస్తూనే..మరోవైపు కరోనా బారిన పడ్డ రోగులకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తోందన్నారు. పరిశ్రమలు నడుస్తున్న కారణంగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మొత్తం పరిశ్రమలకే అవసరమైన క్రమంలో గత వారం మోడీ ప్రభుత్వం ఆక్సిజన్ వాడే అన్ని కంపెనీల నుండి మెడికల్ ఆక్సిజన్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించిందన్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని అన్ని సంస్థలు సమన్వయంతో ఆక్సిజన్ తో పాటు వ్యాక్సిన్ మందులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రధాని  24 గంటలు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ కరోనాను అరికట్టడంలో ఏ చర్యలు తీసుకోకపోగా, కేంద్రంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించారు బండి సంజయ్.