
హైదరాబాద్:సవాళ్లను ఎదుర్కొని దేశంలో ప్రజా సేవకు అంకితమైన మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన జాబితాను బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసింది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌లలో స్ఫూర్తిని, జోష్ ను నింపేందుకు ఉమెన్ కాటలిస్ట్స్-2023 ఆధ్వర్యంలో టాప్ ఉమెన్ పర్ఫార్మర్స్ ఆఫ్ ఇండియన్ బ్యూరోక్రసీ పేరుతో మూడో జాబితాను విడుదల చేశారు.
సానుకూల మార్పును సాధించడంలో గణనీయమైన పురోగతిని సాధించిన మహిళా అధికారులు అంటూ ఆ జాబితాలో పేర్కొన్నారు.ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురు మహిళా ఐఎఏఎస్లకు చోటు లభించింది. వారిలో స్మితా సభర్వాల్, కాట ఆమ్రపాలి, పమేలా సత్పతి ఉన్నారు. తమకు చోటు దక్కినట్టుగా ఉన్న జాబితాను ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2023లో ప్రజాసేవలో గణనీయమైన పురోగతి సాధించిన మహిళా అధికారులు వీళ్లే’ అంటూ భారతీయ బ్యూరోక్రసీలో మహిళల సంబరాలు అని పోస్ట్‌చేశారు. ఆ లిస్ట్‌లో ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు.