ప్రియురాలిపై దాడి చేసి కారుతో తొక్కించిండు

ప్రియురాలిపై దాడి చేసి కారుతో తొక్కించిండు
  •     మహారాష్ట్రలోని థానెలో దారుణం
  •     తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలు

థానె :  అతడో ప్రభుత్వ అధికారి కొడుకు.. గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ను ఫంక్షన్‌‌‌‌‌‌‌‌కు పిలిచి గొడవ పడిండు.. దారుణంగా తిట్టిండు.. కోపంతో కొట్టిండు.. ఆపై కారుతో తొక్కించేందుకు ప్రయత్నించిండు.. అదృష్టం బాగుండి బాధిత యువతి ప్రాణాలతో బయటపడింది. కానీ తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిందీ ఘటన. తనకు ఎదురైన దారుణ పరిస్థితులను సోషల్ మీడియాలో ఆ యువతి వెల్లడించింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల్ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ కొడుకు అశ్వజిత్ గైక్వాడ్, ప్రియాంక సింగ్ ఐదేండ్లుగా రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఈ క్రమంలో థానెలోని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఫ్యామిలీ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌కు రావాలంటూ సోమవారం తెల్లవారుజామున ప్రియాంకకు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి అశ్వజిత్ పిలిచాడు. ‘‘అక్కడికి వెళ్లి కొందరు ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ను కలిశాను. నా బాయ్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ కొంచెం విచిత్రంగా ప్రవర్తించడాన్ని గమనించా. ‘అంతా ఓకేనా? మనం పక్కకి వెళ్లి మాట్లాడుకుందామా?’ అని అడిగాను. అక్కడి నుంచి బయటికి వచ్చాను. అశ్వజిత్‌‌‌‌‌‌‌‌ కూడా బయటికి వస్తాడని, మాట్లాడి ఏమైందో తెలుసుకుందామని అనుకున్నాను. కానీ అతడు తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తోపాటు వచ్చాడు. అతడు, అతడి ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. తర్వాత కొట్టాడు.. నా గొంతు నులిమేందుకు ట్రై చేశాడు. దీంతో అతడిని పక్కకు నెట్టేందుకు యత్నించగా.. మళ్లీ కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగాడు. అతడి ఫ్రెండ్ నన్ను కిందికి తోశాడు. కారులో ఉన్న నా ఫోన్, ఇతర వస్తువులు తీసుకునేందుకు వెళ్లాను. కారును ముందుకు పోనిచ్చి.. నన్ను తొక్కించాలని డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అశ్వజిత్ చెప్పాడు” అని ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలో బాధితురాలు రాసుకొచ్చింది. కారు వేగంగా ముందుకు పోవడంతో యువతి కిందికి పడిపోయిందని, ఆమె కాలుపై కారు వెళ్లడంతో గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

విరిగిన కాలు.. శరీరమంతా గాయాలు

గాయాలతో ప్రియాంక పడిపోయినా పట్టించుకోకుండా.. ఆమె ఫోన్‌‌‌‌‌‌‌‌ను అశ్వజిత్ తీసుకెళ్లాడు. దాదాపు అరగంటపాటు ఆమె అక్కడే అలానే పడిపోయింది. అటుగా వెళ్లే వాళ్లు చూసి.. ఆసుపత్రిలో చేర్చారు. ‘‘కుడి కాలు విరిగింది. భుజాలు, మెడ, వీపు సహా శరీరమంతటా గాయాలయ్యాయి. 3 నెలలు బెడ్‌‌‌‌‌‌‌‌పైనే ఉండాలి. ఆ తర్వాత కూడా 6 నెలలపాటు సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో నడవాలి” అని ప్రియాంక వాపోయింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.