లవర్​​తో కలిసి అమ్మమ్మ ఇంట్లో చోరీ

లవర్​​తో కలిసి అమ్మమ్మ ఇంట్లో చోరీ
  •     వేసవి సెలవులకు వచ్చి యువతి స్కెచ్
  •     మూడు రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులు

నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా నస్పూర్​లో సంచలనం సృష్టించిన చోరీ కేసును మూడు రోజుల్లోనే పోలీసులు చేధించారు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన యువతే తన లవర్​తో కలిసి చోరీ చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​లో చదువుకుంటున్న యువతి నాగార్జున కాలనీలోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చింది. ఆన్​లైన్ గేముల ద్వారా పరిచయమైన హైదరాబాద్​కు చెందిన యువకుడితో ఆమె అప్పటికే ప్రేమలో ఉంది. అమ్మమ్మ ఇంట్లో బంగారం, నగదు చూసి ప్రియుడికి సమాచారం ఇచ్చి రప్పించింది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డారు. మే 27న సాయంత్రం తాత సింగరేణి ఉద్యోగానికి, అమ్మమ్మ వాకింగ్​కు వెళ్లగా, ఇద్దరు కలిసి ఇంట్లో బీరువా పగులగొట్టి రూ.4.5 లక్షల నగదు, సుమారు 15 తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ చేశారు. అనంతరం యువకుడు సొత్తుతో వెళ్లిపోగా, యువతి ఇంటికి తాళం వేసి ఏమీ తెలియనట్టు బయటకు వెళ్లింది. 

తిరిగి అమ్మమ్మతో కలిసి ఇంట్లోకి వచ్చి ఎవరో దుండగులు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు..  ఫింగర్ ప్రింట్స్, జాగిలాలు, సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ డేటా విశ్లేషణ ఆధారంగా ఇంటి దొంగలను పట్టుకున్నారు. సొత్తుతో పాటు ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని యువతి, యువకుడిని రిమాండ్​కు తరలించారు.