
నవాబుపేట, వెలుగు: దృశ్యం సినిమా తరహాలో శవాన్ని మాయం చేయాలని చూసిందా భార్య. భర్తను చంపి డెడ్‌బాడీని కొత్తగా కడుతున్న ఇంటి బాత్రూమ్కింద పాతిపెట్టింది. కానీ పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. నిందితులను విచారించిన పోలీసులు గురువారం బాత్రూం కింద తవ్వి డెడ్‌బాడీని వెలికితీశారు. మహబూబ్‌నగర్‌జిల్లా నవాబుపేట మండలం దర్పల్లి గ్రామ పంచాయతీ మొరంబావి గ్రామానికి చెందిన రాములమ్మ తన భర్త చెన్నయ్యను బంధువుల సాయంతో హత్య చేసింది. పొలం అమ్ముదామని భర్త ఒత్తిడి చేస్తుండడంతో ఈ దారుణానికి పాల్పడింది. నెల క్రితం హత్య చేయగా మృతుడి చెల్లెలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాములమ్మను విచారించగా కొడుకు, మరో ఇద్దరు బంధువుల సాయంతో భర్తను చంపిన విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన సమాచారంతో బాత్రూంలో పాతిపెట్టిన డెడ్‌బాడీని గురువారం తహసీల్దార్రాజేందర్రెడ్డి సమక్షంలో జేసీబీతో వెలికి తీశారు. పూర్తిగా డీకంపోజ్ అయిన బాడీకి పోలీసులు పంచనామా నిర్వహించారు. అనంతరం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డా.పార్వతి, డాక్టర్సుచిత్ఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.