రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్-ఢిల్లీ హైవేపై మంగళవారం ఇటుక బట్టీ కార్మికులను తీసుకెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు, ఓవర్ హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగను తాకడంతో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందగా, మరో 10 మంది పైగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్‌లో ఇటుక బట్టీ కోసం సుమారు 25 నుండి 30 మంది వలస కార్మికులను తీసుకెళ్తోంది. అయితే మంటలు చెలరేగినప్పుడు చాలా మంది ప్రయాణికులు బస్సు నుంచి దూకి తప్పించుకున్నారు, దింతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
బస్సు పైకప్పుపై పెట్టిన గ్యాస్ సిలిండర్లు, ఇతర గృహోపకరణాలు బస్సు రోడ్డు పై వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తాకడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుంది. హైటెన్షన్ విద్యుత్ వైర్ తాకడం వల్ల బస్సులో బలమైన విద్యుత్ ప్రవాహం జరిగి మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
►ALSO READ | 1956 ముందు తండ్రి మరణిస్తే.. కూతురికి ఆస్తిలో వాటా రాదు : ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు
మంటలు చెలరేగిన తర్వాత గ్యాస్ సిలిండర్ పేలినట్లు పెద్ద శబ్దాలు సంభవించాయి, దింతో చుట్టుపక్కల ప్రజలు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన తర్వాత స్థానిక నివాసితులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా అత్యవసర టీం సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం జైపూర్‌లోని SMS ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారికి షాపురాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. బస్సులో గ్యాస్ సిలిండర్లు మాత్రమే కాకుండా సైకిళ్ళు, బైక్ వంటి ఇతర వస్తువులు కూడా పైకప్పు, లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఉండటం వల్ల మంటల ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి పెరిగింది.
బాధితులను, గాయపడిన వారిని గుర్తించే ప్రక్రియను అధికారులు ప్రారంభించగా... సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపిస్తామని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, బస్సులో ప్రమాదకరమైన వాటిని ఎందుకు రవాణా చేశారో పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
