1956 ముందు తండ్రి మరణిస్తే.. కూతురికి ఆస్తిలో వాటా రాదు : ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు

1956 ముందు తండ్రి మరణిస్తే.. కూతురికి ఆస్తిలో వాటా రాదు : ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు

భారతీయ కుటుంబాల్లో ఆస్తి వారసత్వ హక్కుల గురించి తరచుగా వివాదాలు తలెత్తటం సర్వ సాధారణం. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకూ సమాన వాటాలపై అనేక సమస్యలు, గొడవలు, పంచాయతీలు ఊళ్లలో జరగటం మనం వింటూనే ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటి ఒక కేసుపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

తాజాగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గమనిస్తే..  హిందూ వారసత్వ చట్టం, 1956 (Hindu Succession Act, 1956) అమల్లోకి రాకముందు అంటే 1956కి మునుపు తండ్రి మరణిస్తే ఆయన ఆస్తిపై.. కుమార్తెకు హక్కు ఉంటుందా లేదా అనే ప్రశ్నకు జవాబు లభిస్తుంది.1956 హిందూ వారసత్వ చట్టం అమల్లోకి రాకముందే.. అంటే 1956 సెప్టెంబర్ 9 కంటే ముందు తండ్రి మరణించి ఉంటే ఆ కుమార్తెకు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. పాత మితాక్షర హిందూ చట్టం ప్రకారం ఆస్తి కొడుక్కు మాత్రమే చెందుతుంది. కుమారులు లేని పక్షంలో మాత్రమే కుమార్తెలు లేదా ఇతర ఆడపిల్లలు హక్కును పొందేవారు.

కేసును పరిశీలిస్తే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ రాగ్మానియా తన తండ్రి సుధిన్ ఆస్తిలో వాటా కోసం న్యాయ పోరాటం చేసింది. ఆమె తండ్రి 1950-51 ప్రాంతంలో మరణించారు. ఈ కేసు విచారణలో జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్, దిగువ కోర్టుల నిర్ణయాన్ని సమర్థిస్తూ, "వారసత్వం 1956 పూర్వమే మొదలైంది కాబట్టి, ఆనాటి 'మితాక్షర హిందూ ధర్మశాస్త్రం' ప్రకారమే ఆస్తి పంపకం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇక్కడ రాగ్మానియాకు సోదరుడు ఉన్నందున ఆస్థి అతనికే పూర్తిగా చెందుతుందని హైకోర్టు కూడా పేర్కొంది.

ALSO READ :  క్రిప్టో కరెన్సీలు చట్ట ప్రకారం ఆస్తేనా..

ఈ తీర్పు చాలా మందికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. హిందూ వారసత్వ చట్టం, 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు సమాన వాటా (Coparcenary Right) లభించినప్పటికీ.. ఈ హక్కులు గతకాలానికి వర్తించవని తేల్చి చెబుతోంది. ఆస్థి విషయంలో తండ్రి మరణించిన తేదీ వారసత్వ హక్కులను నిర్ణయిస్తుందని చెబుతోంది తీర్పు. తండ్రి 2005 తర్వాత మరణిస్తే, పూర్వీకుల ఆస్తిలోనూ కొడుకులతో సమానంగా కుమార్తెలకు పుట్టుకతోనే హక్కులు లభిస్తాయని గమనించాలి. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు పాత చట్టాల ప్రాముఖ్యతను, చారిత్రక వారసత్వ పద్ధతులను మరోసారి గుర్తు చేసింది.