జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో లోయలో పడ్డ బస్సు .. 37 మంది దుర్మరణం

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో లోయలో పడ్డ బస్సు  .. 37 మంది దుర్మరణం

దోడా:  జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని దోడా జిల్లాలో ఘోరం జరిగింది. 300 అడుగుల లోయలో బస్సు పడి 37 మంది చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌‌‌‌గా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని సమాచారం. యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 

అదుపు తప్పి.. 300 అడుగుల లోయలోకి..

సుమారు 56 మంది ప్రయాణికులతో కిష్ట్వార్​ నుంచి జమ్మూకు ఓ బస్సు బయల్దేరింది. బటోటే – కిష్ట్వార్​ నేషనల్ హైవేపై వెళ్తుండగా.. బుధవారం ఉదయం 11.50 గంటల సమయంలో త్రుంగల్ – అస్సార్ వద్ద బస్సు స్కిడ్ అయింది. ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. వేగంగా వెళ్లడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ కారణంతోనే ఎక్కువమంది చనిపోయారు. కొన్ని శరీరాలు ఇరుక్కు పోయాయని, బస్సు భాగాలను కట్ చేసి బయటికి తీశామని అధికారులు చెప్పారు. కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని చెప్పారు. 

ముందుగా స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత పోలీసులు, ఎస్‌‌‌‌డీఆర్ఎఫ్‌‌‌‌ సిబ్బంది రెస్క్యూ చేపట్టారు. చనిపోయిన వారిలో కొందరిని గుర్తించామని తెలిపారు. పరిమితికి మించి ప్యాసింజర్లతో బస్సు వెళ్తున్నట్లుగా తెలిసిందని, యూటర్న్ తీసుకునే క్రమంలో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ‘‘మేం అన్ని వివరాలను చెక్ చేశాం. బస్సు సరిగ్గా నడపలేదని, రాంగ్ సైడ్​లో వెళ్లారని భావిస్తున్నాం. ఈ క్రమంలోనే క్రాష్ బారియర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొని బస్సు లోయలోకి పడింది” అని దోడా డిప్యూటీ కమిషనర్ హర్వీందర్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ముర్ము, మోదీ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘దోడా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన తీవ్రంగా బాధిస్తున్నది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పీఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌ కింద నష్టపరిహారాన్ని ఆయన ప్రకటించారు. 

ఖరాబైన రోడ్ల వల్లే..

దోడా జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను అధికారులు బాగు చేయడం లేదని, ప్రమాదాలకు ఇదే కారణమవుతోందని స్థానికులు ఆరోపించారు. 37 మంది చనిపోయిన ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. వాటిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానిక సర్పంచ్ మొహమ్మద్ ఆష్రఫ్ చెప్పారు. కొన్ని నెలల వ్యవధిలోనే 10 ప్రమాదాలు జరిగాయని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రయాణాలకు మంచివి కాదని తెలిపారు. తాము రోడ్ల మరమ్మతులకు రూ.6 లక్షలు అధికారులకు ఇచ్చామని, వాటినీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

గతంలోనూ ప్రమాదాలు

దోడా జిల్లాలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. 2019 జులై 1న ఓవర్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌తో వెళ్తున్న మినీ బస్సు.. కిష్ట్వార్​‌‌‌‌‌‌‌‌లోని సిర్‌‌‌‌‌‌‌‌గ్వారీ ఏరియాలో లోయలో పడటంతో 35 మంది చనిపోయారు. 2018 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 14న కిష్ట్వార్​‌‌‌‌‌‌‌‌లోని దండారన్ ఏరియాలో మినీ బస్సు లోయలో పడటంతో 17 మంది మరణించారు. ఈ ఏడాది మే 24న కిష్ట్వార్​‌‌‌‌‌‌‌‌లోని దచన్ ఏరియాలో క్రూజర్ వాహనం లోయలో పడటంతో ఏడుగురు చనిపోయారు. 

జూన్ 27న భదర్‌‌‌‌‌‌‌‌వా–పఠాన్‌‌‌‌కోట్ మధ్య వెహికల్‌‌‌‌ లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఆగస్టు 30న కిష్ట్వార్​‌‌‌‌‌‌‌‌లో కారు లోయలో పడటంతో 8 మంది చనిపోయారు. ఇక 2018 అక్టోబర్ 6న రాంబన్‌‌‌‌ జిల్లాలోని జమ్మూశ్రీనగర్ హైవేపై వెళ్తూ మినీ బస్సు లోయలో పడిపోవడంతో 21 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు. 2022 సెప్టెంబర్ 14న పూంచ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మే30న జమ్మూ జిల్లాలోని జజ్జర్‌‌‌‌‌‌‌‌కోట్లిలో జరిగిన ప్రమాదంలో 10 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు.