యాడ్ల కోసమే బస్​షెల్టర్లు.. సిటిజన్లకు ఉపయోగపడ్తలే..

యాడ్ల కోసమే బస్​షెల్టర్లు.. సిటిజన్లకు ఉపయోగపడ్తలే..
  • స్టాప్​లుండేది ఒక చోట.. బస్సులు ఆగేది మరో దగ్గర..
  • దంచికొడుతున్న ఎండలకు.. రోడ్ల మీదనే ప్యాసింజర్ల పడిగాపులు

హైదరాబాద్, వెలుగు: సిటీ బస్టాప్​లు యాడ్‌‌‌‌ ఏజెన్సీలకే తప్ప సిటిజన్లకు ఉపయోగపడట్లేదు. సిటీవ్యాప్తంగా చాలా చోట్ల బస్‌‌‌‌ షెల్టర్లు సరిగా లేవు. ఉన్నచోట కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ, బల్దియా విఫలమవుతున్నాయని సిటిజన్లు మండిపడుతున్నారు. సిటీలోని బస్టాప్‌‌‌‌లు, ఏసీ బస్‌‌‌‌షెల్టర్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. అనేకచోట్ల కూర్చునేందుకు వీలులేకుండా బెంచీలు పాడైపోగా, మరికొన్ని చోట్ల నిల్చునేందుకు ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు కూడా లేక ఎండకు రోడ్ల మీదనే ప్యాసింజర్లు ఎదురుచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బస్టాండుల్లో బస్సులు కోసం ఎదురుచూస్తుంటే అక్కడ కాకుండా డ్రైవర్లు నచ్చిన విధంగా ఆపుతున్నారని ప్యాసింజర్లు పేర్కొంటున్నారు. ఎండలు పెరుగుతున్న సమయంలో సమస్య తీవ్రతరం అవుతోందని వాపోతున్నారు.

జీహెచ్ఎంసీకి రూ.కోట్లలో ఆదాయం

గ్రేటర్ లో 2,350 బస్టాప్​లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ దాదాపు1,600 మాత్రమే ఉన్నాయి. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్(బీవోటీ) పద్ధతిలో ఆరేండ్ల కిందట కొన్ని నిర్మించగా, ఏడాది క్రితం మరికొన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఏరియాని బట్టి బస్ షెల్టర్లను ఒక్కో దానికి ఏడాదికి రూ.20 నుంచి 30 వేలకు ఏజెన్సీలకు అప్పగించారు. కొద్ది నెలల క్రితం ఆ రేటును రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పెంచారు. ఈ లెక్కన బస్ షెల్టర్ల నుంచి జీహెచ్ఎంసీకి ఏడాదికి రూ.వంద కోట్లకుపైగానే ఆదాయం వస్తోంది. ఇలా బస్ షెల్టర్లను బల్దియా ఆదాయ వనరుగా వాడుకుంటుందే తప్ప ప్యాసింజర్ల అవసరాలను పట్టించుకోవడం లేదు. కూకట్​పల్లి, జేఎన్టీయూ, దిల్​సుఖ్ నగర్, షేక్​పేట, దర్గా, యూసఫ్ గూడ, ఎర్రగడ్డ ఇలా అనేక చోట్ల బస్ షెల్టర్లు లేనేలేవు. జనాలు బస్సుల కోసం రోడ్ల మీదనే ఎదురుచూస్తున్నారు.

ఏసీ బస్టాప్​ల పరిస్థితీ అంతే..

ఏజెన్సీలకు అప్పగించిన అనేక షెల్టర్లు వారి ప్రకటనలకు తప్పితే ప్యాసింజర్లకు పెద్దగా ఉపయోగపడటం లేదు. బస్టాప్‌‌‌‌ల పరిరక్షణ బాధ్యతలు మర్చిపోయి సొంత లాభాల కోసం చూసుకుంటున్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసి  ఏసీ బస్టాప్​ల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. శిల్పారామం ఎదురుగా ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్​లో పవర్ కనెక్షన్ లేక లోపలికి ఎవరూ వెళ్లడం లేదు. దీంతో కొందరు దాన్ని రాత్రిపూట పడుకునేందుకు షెల్టర్‌‌‌‌‌‌‌‌గా, మరికొందరు మద్యం తాగేందుకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మిగతా చోట్లలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. లోపల కూర్చుంటే బస్ వచ్చేది తెలియక, బస్సులు ఆగక చాలా మంది బయటే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఏండ్లు గడుస్తున్నా ఇలాగే..

సమస్య ఉందని ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి మాత్రం స్పందన కనిపిస్తలేదు. ఏండ్లుగా సరిగా బస్టాప్‌‌‌‌లు లేక ఇబ్బందిపడుతున్నాం. కనీసం ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు కూడా ఏర్పాటుచేయడం లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్ల మీద నిలబడి బస్‌‌‌‌ కోసం ఎదురుచూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. 
– స్వప్న, సేల్స్ గర్ల్, షేక్‌‌‌‌పేట

ఎప్పుడొస్తయో తెలియక..

ఏసీ బస్టాప్‌‌‌‌లు పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉన్నాయి. బస్సు వచ్చే వరకు కాసేపు కూర్చుని రిలాక్స్ అవుదామన్నా ఏసీలు పనిచేయడం లేదు. ఫ్యాన్ల వైర్లు బయటకొచ్చి కనిపిస్తున్నాయి. లోపల బెంచీల్లో కూర్చుంటే బయట బస్సు వచ్చి, పోయేది కూడా తెలియడం లేదు. అందుకే ఎండ ఉన్నా బయటే నిల్చుని ఎదురుచూస్తున్నాం.
– రమేశ్, ఉద్యోగి, దిల్‌‌‌‌సుఖ్ నగర్‌‌‌‌