కానీ అవే హయ్యెస్ట్ కావు: టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి

కానీ అవే హయ్యెస్ట్ కావు: టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి
  • కమిషన్​లో నమ్మినవాళ్లే గొంతుకోశారు.. ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం 
  • షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్, ఇతర ఎగ్జాంలు 

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ప్రవీణ్​కు గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్‌‌లో103 మార్కులు వచ్చిన మాట నిజమేనని చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ప్రవీణ్ ప్రిలిమ్స్​లో క్వాలిఫై కాని మాట వాస్తవమేనని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్​లో 103 మార్కులే హయ్యెస్ట్ కాదని గుర్తించాలన్నారు. ప్రవీణ్ లీవ్ పెట్టకుండా ఎగ్జామ్ రాశాడన్న విషయంపై స్పందిస్తూ.. లీవ్ పెట్టాలన్న రూల్ లేదని, అది ఎథికల్ ఇష్యూ అని చెప్పారు. టీఎస్‌‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పేపర్‌‌ లీకేజీలో ఐదుగురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తేలిందని, వారిని తొలగిస్తామని వెల్లడించారు. కమిషన్ లో నమ్మినవాళ్లే గొంతు కోశారన్నారు.   

ఐపీ అడ్రస్​తో యాక్సెస్ చేశారు 

రాజశేఖర్‌‌రెడ్డి అనే నెట్‌‌ వర్క్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ దాదాపు ఆరేడేళ్ల నుంచి టీఎస్‌‌పీఎస్సీలో ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడని, అతనికి అన్ని ఐపీ అడ్రస్‌‌లు తెలిసే అవకాశం ఉందని జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆ డేటాతోనే కీలక సమాచారం యాక్సెస్‌‌ చేసినట్టు తేలిందన్నారు. అసిస్టెంట్‌‌ సెక్షన్‌‌ ఆఫీసర్‌‌ ప్రవీణ్ దాన్ని దుర్వినియోగం చేసి రేణుక తదితరులకు ప్రశ్నపత్రాలు చేరవేశాడన్నారు. పేపర్ తీసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ ఏఈ ఎగ్జామ్ రాశారని చెప్పారు. దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలిందన్నారు. ప్రవీణ్‌‌10 లక్షలకు పేపర్లు అమ్ముకున్నాడని ఎంక్వైరీలో వెల్లడైందన్నారు. 

అపోహలు లేకుండా ఒక్క పరీక్షా జరగలే 

పేపర్ లీకేజీ వ్యవహారంలో అనవసర వదంతులను నమ్మొద్దని జనార్దన్ రెడ్డి కోరారు. ఈ ఇష్యూపై కొందరు కోర్టుకు వెళ్లొచ్చని, మరికొందరు ధర్నాలు చేసే అవకాశం ఉందని, ఇవన్నీ చూసి నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు. అయితే, అపోహాలు లేకుండా ఒక్క పరీక్ష కూడా ఇంతవరకు జరగలేదన్నారు. లీకేజీపై సోషల్‌‌ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని,  తన పిల్లలు ఎవరూ గ్రూప్‌‌-1 పరీక్ష రాయలేదని చెప్పారు. తాను చైర్మన్ పదవి నుంచి దిగిపోయాకే ఎగ్జామ్ రాయాలని తన పిల్లలకు చెప్పానన్నారు. వదంతులకు కూడా ఒక హద్దు ఉంటుందన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అక్రమాలు జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీస్కున్నామని, టీఎస్‌‌పీఎస్సీపై కూడా చాలా ప్రెజర్​ ఉందని.. తమ దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపారు.

రిపోర్ట్ తర్వాతే ‘ఏఈ’పై నిర్ణయం

ఏఈ పేపర్ మాత్రమే లీక్ అయిందా? లేదంటే ఇటీవల నిర్వహించిన పరీక్షల క్వశ్చన్ పేపర్లు కూడా లీక్ అయ్యాయా? అన్నది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే తేలుతుందని జనార్దన్ రెడ్డి చెప్పారు. రిపోర్ట్ లో తేలే అంశాలను బట్టి ఆయా ఎగ్జాంలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఈ ఎగ్జాంను రద్దు చేయాల్నా? లేదా? అనేదానిపై లీగల్ ఒపీనియన్​తో ముందుకెళ్తామని, దీనిపై బుధవారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఈ పేపర్ లీక్​పై ఎవరో వచ్చి ఉద్యమాలు చేయలేదని.. తామే గుర్తించి కంప్లయింట్ చేశామన్నారు. ఒక్కదాంతో అన్నింటికీ ముడిపెట్టలేమన్నారు. ఇతర పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయినట్లు ప్రచారం జరుగుతున్నందున మెయిన్స్ వాయిదా వేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 5నే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఉంటాయన్నారు.