వరంగల్ జిల్లాలో మినీ మేడారాల సందడి

వరంగల్ జిల్లాలో మినీ మేడారాల సందడి
  •     ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

హనుమకొండ, వెలుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుండగా.. జిల్లాలోని మినీ మేడారాలు కూడా జాతరకు సిద్ధమయ్యాయి. మేడారం జాతర తేదీల్లోనే మినీ మేడారం జాతరలు కూడా జరగనుండటంతో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సమ్మక్క జన్మస్థలంగా చెప్పుకునే హనుమకొండ జిల్లా అగ్రంపహడ్​ వద్ద జాతర నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  కాగా ఈ జాతరకు  25 లక్షలకుపైగానే భక్తులు తరలిరానుండటంతో  ప్రభుత్వం తరఫున భక్తుల సౌకర్యార్థం  వివిధ పనుల కోసం రూ.59 లక్షలు కేటాయించారు.  ఈ మేరకు తాగునీటి సౌకర్యం, క్యూ లైన్లు, రోడ్ల రిపేర్లు చేపట్టారు.  

కమలాపూర్ మండలంలోని కన్నూరు, మర్రిపెల్లిగూడెం, కమలాపూర్, మాదన్నపేట సమ్మక్క జాతరలు జరగనున్నాయి. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, కొత్తకొండ, కాజీపేట మండలంలో ఉర్సుగుట్ట వద్ద అమ్మవారిపేట, శాయంపేట మండలం పెద్దకోడెపాక సమీపంలోని జోగంపల్లి,  నడికూడ మండలంలోని కంఠాత్మకూరు, పులిగిల్ల గ్రామాల్లో మినీ మేడారం జాతరల సందడి నెలకొంది.  వేలేరు మండలంలోని పీచరలో కూడా సమ్మక్క జాతర నిర్వహించనుండంతో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. మేడారం మహాజాతర మాదిరిగానే బుధవారం నుంచి శనివారం వరకు మినీ మేడారం జాతరలు కొనసాగనుండగా.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

జాతరకు సిద్ధమైన మద్ది మేడారం

నల్లబెల్లి : ఈ నెల 21  నుంచి జరిగే మద్ది మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి సమీపంలో జరిగే  జాతర ఏర్పాట్లను నర్సంపేట ఏసీపీ కిరణ్​కుమార్, నల్లబెల్లి తహసీల్ధార్​ రాజేశ్ మంగళవారం పరిశీలించారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు రావద్దన్నారు.   రెండేళ్ల క్రితం   సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు లక్షలకు పైగా భక్తులు రాగా ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరగే అవకాశం ఉందని ట్రస్టు చైర్మన్​ సుధర్శన్​ రెడ్డి ఎమ్మెల్యే మాదవరెడ్డి చెప్పారు. జాతర అభివృద్ది కోసం రూ. 10 లక్షలు మంజూరు చేశామన్నారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దార్​  రాజేశ్​​, సీఐ శ్రీనివాస్​, ఐబీ డీఇ రవిందర్​, ఎస్సై నగేశ్​, అధికారులు  పాల్గొన్నారు.

మల్లన్నగండి సమ్మక్క జాతరను విజయవంతం చేయాలి

స్టేసన్​ఘన్​పూర్​ : జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం తాటికొండ, జిట్టూగూడెం తండాల శివారులోని మల్లన్నగండి సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని వైస్​ ఎంపీపీ చల్లా సుధీర్​రెడ్డి, జాతర కమిటీ చైర్మన్​ కోరుకొప్పుల మహేందర్​గౌడ్​ మంగళవారం కోరారు.   బుధవారం  నుంచి ప్రారంభమయ్యే జాతరకు దాదాపుగా లక్ష మంది భక్తులు హాజరవుతారన్నారు.  

భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్, కొత్తకొండ, ఎర్రబెల్లి గ్రామాల్లో నేటి   నుంచి సమ్మక్క సారలమ్మ జాతర షురూ కానుంది. ఈ నెల 23 న  జాతరకు రాష్ర్ట రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు  జాతర చైర్మెన్​ మాడుగుల వీరస్వామి తెలిపారు.