
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ యంగ్ షట్లర్ కలగొట్ల వెన్నెల ప్రతిష్టాత్మక బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే ఇండియా జట్టుకు ఎంపికైంది. వెన్నెలతో పాటు రైజింగ్ షట్లర్లు తన్వీ శర్మ, ఉన్నతి హూడా, డబుల్స్ జోడీ అరిగెల భార్గవ్ రామ్ – గొబ్బురు విశ్వ తేజ్ అక్టోబర్ 6 నుంచి 19 వరకు గువాహతిలో జరిగే ఈ మెగా టోర్నీలో 25 మందితో కూడిన ఇండియా జట్టును నడిపించనున్నారు.
తొలుత (అక్టోబర్ 6– 11) మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ పోటీలు, తర్వాత వ్యక్తిగత ఈవెంట్లు (అక్టోబర్ 13– 19) నిర్వహిస్తారు. ఇండియా ఇదివరకు 2008లో ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు సైనా నెహ్వాల్ గోల్డ్ గెలిచిన ఇండియా తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించగా.. గురుసాయి దత్ కాంస్యం నెగ్గాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 11 పతకాలు అందుకుంది. ప్రస్తుత వరల్డ్ జూనియర్ నంబర్ వన్ ప్లేయర్, యూఎస్ ఓపెన్ సూపర్ 300 రన్నరప్‌గా నిలిచిన తన్వీ శర్మ, 2022 ఒడిశా మాస్టర్స్, 2023 అబుదాబి మాస్టర్స్ సూపర్100 టైటిల్స్ గెలిచిన ఉన్నతి హూడాతో పాటు వెన్నెలపై ఈసారి పతక ఆశలు ఉన్నాయి. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ మెడలిస్టులుగా తన్వీ, వెన్నెలకు డైరెక్ట్ బెర్త్ లభించింది. తాజా ఈవెంట్ ఫార్మాట్ ప్రకారం జట్టులో ఉన్న 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో ఆడతారు. రషికతో కలిసి వెన్నెల గర్ల్స్ డబుల్స్‌లో కూడా ఆడనుంది.
ఇండియా జట్టు:
బాయ్స్ సింగిల్స్ : రౌనక్ చౌహాన్, జ్ఞాన దత్తు, లాల్తజులా హెచ్, సూర్యక్ష్ రావత్;
గర్ల్స్ సింగిల్స్ : తన్వీ శర్మ, కలగొట్ల వెన్నెల, ఉన్నతి హూడా, రక్షిత శ్రీ;
బాయ్స్ డబుల్స్: ఎ.ఆర్. సుమిత్– భవ్య ఛబ్రా, భార్గవ్ రామ్– విశ్వ తేజ్, విష్ణు కేదార్ కోడే–మిథిలేష్; గర్ల్స్ డబుల్స్: వెన్నెల–రషిక, గాయత్రి రావత్–మాన్స రావత్, ఆన్య బిష్ట్–ఏంజెల్ పునేరా; మిక్స్‌డ్ డబుల్స్: భవ్య ఛబ్రా–విశాఖ టొప్పో, లాల్‌రామ్‌సంగా–తారిని సూరి, విష్ణు కేదార్ కోడే–కీర్తి మంచాల, వంశ్ దేవ్–డియాంకా వాల్డియా.