
గువాహటి: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియా జట్టు.. కాంస్య పతకంతో ముగించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఇండియా 35–45, 21–45తో డి ఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియా చేతిలో ఓడింది. కొరియాతో ఆడిన జట్టులో ఒక్క మార్పు (ఆన్య బిస్త్ ప్లేస్‌లో విశాఖ టోప్పో) చేసి బరిలోకి దిగిన ఇండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
బాయ్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్ అరిగెలా–విశ్వ తేజ్ గొబ్బూరు 9–6తో ముహ్మద్ రిజ్కీ ముబారోక్–రైహాన్ డాఫా ప్రమోనోపై, గర్ల్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 18–16తో థలిత విర్యావాన్‌పై గెలిచారు. కానీ బాయ్స్ సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్.. జాకీ ఉబైదుల్హా చేతిలో ఓడటంతో ఇండోనేసియా స్కోరు 27–23కు పెరిగింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో లాల్‌రామ్‌సంగా–విశాఖ టోప్పో.. ఇక్షాన్ ప్రముద్య–రింజని నాస్తిన్ చేతిలో, విమెన్స్ డబుల్స్‌లో వెన్నెల–రేషికా.. రిస్కా అంగ్రానీ–రింజని నాస్తిన్ చేతిలో ఓడటంతో ఇండోనేసియా 45–35తో సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ ఇండోనేసియన్లదే ఎక్కువ ఆధిపత్యం నడవడంతో ఇండియాకు నిరాశ తప్పలేదు. ఇక, సోమవారం నుంచి జరిగే ఇండివిడ్యువల్ చాంపియన్‌షిప్‌పై ఇండియన్ ప్లేయర్లు దృష్టి పెట్టారు.