
దొంగతనానికి గురయిన కోట్ల మంది యూజర్ల డేటా
కంపెనీలపై ర్యాన్సమ్‌వేర్ ఎటాక్..డబ్బులు డిమాండ్
బిజినెస్‌డెస్క్, వెలుగు: ఈ ఏడాది కరోనా వైరస్‌తో పాటు సైబర్ ఎటాక్‌లు కూడా ప్రపంచాన్ని వణికించాయి. మొదటి ఆరు నెలల్లోనే సుమారు 80 దేశాలకు చెందిన 81 కంపెనీల డేటా దొంగతనానికి గురయ్యిందని అంచనా. బ్యాంకులపై సైబర్ ఎటాక్‌లు 238 శాతం పెరిగాయని, ఫిసింగ్ ఎటాక్స్ 600 శాతం పెరిగాయని ఫిన్‌టెక్ న్యూస్ పేర్కొంది.వివిధ దేశాలు లాక్‌డౌన్ విధించడంతో ఎన్నడూ లేనంతగా 2020 లో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. దీంతో హ్యాకర్ల దాడులు కూడా ఎక్కువయ్యాయి. ర్యాన్స్‌మ్‌వేర్, మాల్వేర్ ఎటాక్స్ వంటివి అనేక గ్లోబల్ కంపెనీలను వణికించాయి. ఈ ఎటాక్‌లలో కొన్నింటి వెనుక కొన్ని దేశాలు ఉన్నాయి కూడా. ఈ ఏడాది మొత్తంలో అతిపెద్ద సైబర్ ఎటాక్ ఈ నెలలోనే జరిగిందని చెప్పొచ్చు. తమ కస్టమర్ల సెక్యూరిటీని టెస్ట్ చేయడానికి ఉపయోగించే టూల్స్‌ను హ్యక్ చేశారని ఈ నెల ప్రారంభంలో సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఫైర్‌ఐ ప్రకటించింది. ఈ ఎటాక్‌కు సంబంధించి ఎటువంటి డిటైల్స్ బయటకు రానప్పటికీ ఈ సైబర్ దాడి ప్రభావం కేవలం ఒక్క కంపెనీపై ఉండదని మాత్రం చెప్పొచ్చు. ఈ దాడికి మూల కారణం ఓరియన్ సాఫ్ట్‌వేర్‌లో మాల్వేర్‌ను హ్యాకర్లు ఇన్‌స్టాల్ చేయడమే. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఐటీ కంపెనీ సోలార్‌విండ్స్ డెవలప్ చేసింది. ఇదే సాఫ్ట్‌వేర్‌ను ఇంటెల్, సిస్కో, వీఎంవేర్, నివిడియా వంటి 24 పెద్ద కంపెనీలు ఇన్‌స్టాల్ చేసుకున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ ఏడాది ఎదుర్కొన్న వేల సైబర్ ఎటాక్‌ల కంటే ఈ ఎటాక్ చాలా భిన్నంగా ఉందని ఫైర్‌ఐ సీఈఓ కెవిన్ మాండియా అన్నారు.
ఇండియన్ కంపెనీలపై సైబర్ దాడులు..
ఫార్మా కంపెనీ డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కంప్యూటర్ సిస్టమ్స్‌పై ఈ ఏడాది ర్యాన్సమ్‌వేర్ ఎటాక్ జరిగింది. గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ సైబర్ దాడికి గురయ్యింది. ఈ దాడిని హ్యాకింగ్ గ్రూప్ ‘సైనీహంటర్స్’ చేసిందని వార్తలొచ్చాయి. ఈ సైబర్ ఎటాక్ వలన ఏకంగా 2 కోట్ల మంది యూజర్ల డేటా దొంగతనానికి గురయ్యింది. ప్రధానమంత్రి వెబ్‌సైట్ నరేంద్రమోడీ.ఇన్ కూడా సైబర్‌దాడికి గురయ్యింది. ఈ ఎటాక్ ద్వారా 5లక్షల మంది యూజర్ల డేటాను దొంగిలించారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ సైబల్ తెలిపింది. శ్నాక్స్ తయారు చేసే హల్దీరామ్ కూడా సైబర్ దాడిని ఎదుర్కొంది. హ్యాకర్లు ఈ కంపెనీ సిస్టమ్స్ నుంచి కీలకమైన డేటాను దొంగిలించి, 7.5 లక్షల డాలర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4.75 కోట్ల ట్రూకాలర్ ఇండియా యూజర్ల డేటా డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉందని మేలో వార్తలొచ్చాయి.
గ్లోబల్‌గా ఈ ఏడాది జరిగిన అతిపెద్ద సైబర్ ఎటాక్‌లు..
1) జర్మనీలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ డెవలపర్ సాఫ్ట్‌వేర్ ఏజీపై ఈఏడాది అక్టోబర్‌లో సైబర్ ఎటాక్ జరిగింది. క్లాప్ ర్యాన్సమ్‌వేర్ ద్వారా ఎటాక్ చేసి హ్యాకర్లు, కంపెనీకి చెందిన కీలక డేటాను దొంగిలించి 20 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
2) ఫ్రెంచ్ ఐటీ కంపెనీ సోప్రా స్టైరియాపై ఈ ఏడాది అక్టోబర్‌లో ర్యాన్సమ్‌వేర్ ఎటాక్ జరిగింది.
3) సెప్టెంబర్‌లో టెలిగ్రాం మెసెంజర్‌పై , క్రిప్టోకరెన్సీ బిజినెస్‌లోని పెద్ద కంపెనీల ఈ –మెయిల్స్‌పై హ్యాకర్లు దాడి చేశారు.
4) అమెరికన్ లీగల్ కంపెనీ షైఫార్త్ షాపై మాల్వేర్ ఎటాక్ జరిగింది. కంపెనీ ఈ–మెయిల్ సిస్టమ్ మొత్తం ఈ ఎటాక్‌తో డౌన్ అయ్యింది.
5) అతిపెద్ద క్రూయిజ్ ఆపరేటర్ కార్నివాల్ కార్పొరేషన్ డేటాను ఈ ఏడాది ఆగస్టులో హ్యాకర్లు దొంగిలించారు.
6) ట్విటర్ క్రిప్టోకరెన్సీపై ఈ ఏడాది హ్యాకర్లు దాడి చేశారు. ఈ ఎటాక్ వలన జోబైడెన్, బరాక్ ఒబామా, ఎలన్ మస్క్, బిల్‌గేట్స్, జెఫ్‌బేజోస్, యాపిల్, ఉబర్‌లకు చెందిన ట్విటర్ అకౌంటర్లను హ్యాక్‌కు గురయ్యాయి.
7) ఈ ఏడాది అగస్ట్‌లో న్యూజిలాండ్ స్టాక్ ఎక్చేంజిపై సైబర్ ఎటాక్ జరిగింది.