- భైంసాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ప్రారంభం
 
భైంసా, వెలుగు: పత్తి విక్రయానికి వచ్చే రైతులను సీసీఐ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్సూచించారు. సోమవారం భైంసాలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే రామారావు పటేల్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్‌తో కలిసి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు.
రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి సహకరించాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. నాణ్యత పేరిట తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని సూచించారు. తేమ శాతం విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సోయా కొనుగోళ్లను పారదర్శకంగా చేపడతామన్నారు.
సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి: ఎమ్మెల్యే
పత్తి, సోయా, వరి ధాన్యం, మొక్కజొన్న, ఇతరత్ర పంట దిగుబడులను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడులు లేక రైతాంగం ఎన్నో కష్టాలు పడిందని, తేమ శాతం పేరిట వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ఆనంద్రావు పటేల్, సెక్రటరీ పూరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
