ఆసిఫాబాద్, వెలుగు: మహిళలు, చిన్నపిల్లల రక్షణే పోలీస్ శాఖ ఫస్ట్ ప్రియారిటీ అని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మహిళలు, పిల్లలకు చట్టాలపై షీ టీమ్ ద్వారా జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని సోమవారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నెలలో షీటీం ద్వారా 87 హాట్స్పాట్ లను గుర్తించామని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి స్టూడెంట్స్ కు అవగాహన కల్పించామని చెప్పారు.
మహిళలు సోషల్మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని.. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ సమస్యలపై నిర్భయంగా సంప్రదించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు షి టీమ్ లు పనిచేస్తున్నాయని, ఆసిఫాబాద్ డివిజన్ షీ టీం నంబర్ 8712670564, కాగజ్ నగర్ డివిజన్ షీ టీం నంబర్ 8712670565, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు.
బాధితులకు సత్వర న్యాయం
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా, స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు.
