ఆదిలాబాద్టౌన్/ఆసిఫాబాద్/నిర్మల్/నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉపాధి, భూభారతి తదితర విభాగాల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్తెలిపారు.
మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తూ, లబ్ధిదారులకు యాప్ ద్వారా మార్కౌట్, ఫొటో అప్‌లోడ్, చెల్లింపుల వివరాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ దరఖాస్తులు స్వీకరించారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని, ఉపాధి కల్పించాలని, భూమికి పట్టా ఇప్పించాలని, వాంకిడి మండలంలోని సమస్యలు పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని ప్రజలు దరఖాస్తులు అందజేశారు.
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని నిర్మల్అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్జీలను శాఖల వారీగా విభజించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకల్యాణి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, ఆర్డీఓ శ్రీనివాస్ రావుతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వృద్ధాప్య పింఛను ఇప్పించాలని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, పందుల సమస్య పరిష్కరించాలని, పట్టా మార్పు చేయాలని కోరుతూ అర్జీలు సమర్పించారు.
