తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటారు..మరి వేరే రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటారు..మరి వేరే రాష్ట్రాల్లో..

ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే  పంటల పండుగ, పెద్దల పండుగ, పశువుల పండుగ. బీడు నేలను  పంటసిరిగా మార్చిన అన్నదాతలకు తొలి పండుగ. అందుకే సంక్రాంతి పండగను తెలంగాణతో పాటు..ఏపీలోనూగొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో .. వివిధ ఆచారాలు..పద్దతులతో అక్కడి ప్రజలు సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. 

తెలుగు రాష్ట్రాల్లో....

తెలుగు వారికి  పెద్ద పండగ సంక్రాంతి పండగ.  పర్వదినంగా గుర్తింపు పొందిన సంక్రాంతి రోజున ప్రతి లోగిలి మెరిసిపోతుంది.రంగు రంగుల ముగ్గులు, వాటిపై గొబ్బెమ్మలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.  మంచుతెరల్ని చీల్చుకు వచ్చే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతాయి. దీనికి తోడు నోరూరించే పిండివంటల ఘుమఘుమలు. తెలంగాణలో సకినాలు, మురుకులు వంటి పిండి వంటలు చేస్తారు. ఆంధ్రాలో సున్నుండలు, జంతికలు, గారెలు, కజ్జికాయలు వంటి రక రకాల పిండి వంటలు తయారు చేస్తారు. 

తమిళనాడులో..

తమిళనాడులో సంక్రాంతి  పండుగను నాలుగు రోజులు జరుపుకుంటారు. ఇక్కడ సంక్రాంతిని పొంగల్ అని అంటారు.   రెండో రోజున థై పొంగల్‌ను  ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున కొత్త పాత్రలో పాత బియ్యం, బెల్లం, పాలు కలిపి పొయ్యిమీద పొంగించి, ఆ తర్వాత నైవేద్యం చేసి, సూర్యుడికి సమర్పిస్తారు. అ తర్వాత రోజున పశువులను పూజిస్తారు. పొంగల్ రోజున చెక్కర పొంగల్ వంటకాన్ని తయారు చేస్తారు. బియ్యము, బెల్లము, పాలు, సగ్గుబియ్యము మొదలగు వాటి కలయికతో చేయబడు ఒక వంటకం. తమిళంలో 'పాంగ్' అనే పదానికి ప్రవహించడం అని అర్థం. అందుకని ఈ పొంగల్ ఉడికి, కాస్త పొంగి పొర్లడం ఆనవాయితీ. 

కేరళలో..

కేరళలో సంక్రాంతి రోజున మకర విళక్కును ఘనంగా నిర్వహిస్తారు. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. ఈ సందర్భంగా కొబ్బరితోటల్లో పూజలు చేస్తారు. అనంతరం మిఠాయిలు పంచి పెడతారు. కేరళలో సంక్రాంతి సందర్భంగా అవియల్ కూర ఫేమస్. 

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లో సంక్రాంతి పండగను  సుఖరాత్‌గా పిలుస్తారు. తెల్లవారుజామునే స్నానం ఆచరించి గోవులను పూజిస్తారు. కొత్తపంటల్ని ఇంటికి తీసుకొచ్చి పిండి వంటలు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. రకరకాల మిఠాయిలను పంచుకోవడం సుఖరాత్‌ ప్రత్యేకత.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో సంక్రాంతి పేరుతోనే వేడుకలు నిర్వహిస్తారు. తిల్‌గుల్‌ పేరిట నువ్వులతో చేసిన రంగురంగుల హల్వాను పంచుకుంటారు. . కొత్తగా పెళ్లయిన వాళ్లు  పసుపు కుంకుమలతో పాటు తాంబూలాలతో బహుమతులు అందిస్తారు. ఈ సంప్రదాయాన్ని హల్ధీకుంకుమ్‌ అంటారు. సంక్రాంతి రోజున మహరాష్ట్రలో పూరన్ పోలీలు అనే వంటకాన్ని తయారు చేస్తారు. ఇవి భక్ష్యాల వలే ఉంటాయి. బెల్లంతో శెనగపప్పు వేసిన పుర్ణాన్ని రుబ్బుకుని మైదాలోపల స్టఫ్ చేసి చపాతీలా వత్తి చేసే పూరన్ పోలీలను మహారాష్ట్రలో సంక్రాంతికి వండుకుంటారు. 

ఉత్తరప్రదేశ్‌లో..

ఉత్తరప్రదేశ్‌లో కిచెరీ పేరుతో సంక్రాంతి పండుగ  జరుపుకుంటారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమమైన అలహాబాద్‌కు వేల సంఖ్యలో ప్రజలు వచ్చి నదీస్నానాలు ఆచరిస్తారు.  పిండి వంటలు, మిఠాయిలను బంధువర్గాలకు పంచి పెట్టి పండుగ చేసుకుంటారు.

పశ్చిమ బెంగాల్లో..

పశ్చిమ బెంగాలీ సంక్రాంతిని పోష్‌ సంక్రాంతిగా చేసుకుంటారు. ఇక్కడ సంక్రాంతి రోజున  సంప్రదాయ వంటకమైన పతిషప్తాను వండుకుంటారు.  పతిషప్తా రెండు రకాల్లో నోరూరిస్తుంది. క్రిస్పీ క్రేప్ గా తయారు చేసేందుకు ఆల్ పర్పస్ ఫ్లోర్, స్వీట్, బెల్లం, కొబ్బెర లేదా ఖోయాతో నింపి చేస్తారు. దీన్ని మళ్లీ కండెన్స్డ్ మిల్క్ లో ముంచుతారు. 

పంజాబ్‌, కశ్మీర్‌లో..

సంక్రాంతి పండగను పంజాబ్‌, కశ్మీర్‌ రాష్ట్రాల్లో లోహ్రి పండుగగా జరుపుతారు. పంజాబ్‌లో భోగి రోజున మంటల్లో చెరకు గడలు, మిఠాయిలు, బియ్యం వేస్తారు. ఆ మంటల చుట్టూ భాంగ్రా డ్యాన్స్ చేస్తారు. అలాగే  సంక్రాంతి రోజున నదీ స్నానం ఆచరించి.. నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఖీర్‌, పాప్‌కార్న్‌ను సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కశ్మీర్‌లో పవన్‌ యజ్ఞాస్‌ పేరుతో భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి రోజున నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి చేసే పదార్థాల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 

పలు రకాల పేర్లు..వంటకాలు..

కర్ణాటకలో సుగ్గీ, ఒడిశాలో మకర చౌలా, అసోంలో మాఘ్‌బిహూ, మహర్‌దొమిహి పేర్లతోనూ…ఢిల్లీ, జార్ఖండ్‌, హర్యానా, బిహార్‌లలో సక్రాత్‌, గోవాలో సంక్రాంత్‌, గుజరాత్‌లో ఉత్తరాయణ్‌ సంక్రాంతి, హిమాచల్‌ ప్రదేశ్‌లో మఘసాజీ అని… ఇలా పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పర్వదినాన్ని చేసుకుంటారు. మూడునాలుగు రోజులు అంతా ఆనందంగా గడుపుతారు.  హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో సంక్రాంతికి విధిగా చిక్కీలు చేసి తింటారు. డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాలలో ఈ పండుగను మాగీ సక్రతి అని పిలుస్తారు.