ఐదు పీఎస్​యూలు అమ్మకానికి

ఐదు పీఎస్​యూలు అమ్మకానికి

న్యూఢిల్లీఎకానమీ నెమ్మదిస్తున్న నేపథ్యంలో మరిన్ని నిధులను సమకూర్చుకోవడానికి మోడీ ప్రభుత్వ కేబినెట్‌‌ ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌‌యూలు) వాటాల అమ్మకానికి పచ్చజెండా ఊపింది. పీఎస్‌‌యూల ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన కేబినెట్‌‌ మీటింగ్‌‌ పీఎస్‌‌యూ డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ కొత్త విధానానికి గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చింది. వాటాల అమ్మకానికి డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అండ్‌‌ పబ్లిక్‌‌ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (దీపమ్‌‌)ను నోడల్‌‌ ఏజెన్సీగా నియమించింది. ఫలితంగా వ్యూహాత్మక వాటాల అమ్మకానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం వాటాలు అమ్మాల్సిన కంపెనీలను నీతి ఆయోగ్‌‌ గుర్తిస్తున్నది. ఇక నుంచి నీతి ఆయోగ్‌‌, దీపమ్‌‌ కలిసి డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ ప్రక్రియలను నిర్వహిస్తాయి. డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌పై ఏర్పాటైన మంత్రుల బృందానికి దీపమ్‌‌ కార్యదర్శి కో–చైర్మన్‌‌గా పనిచేస్తారు. భారత్‌‌ పెట్రోలియం సహా వివిధ పీఎస్‌‌యూలో వాటాల అమ్మకం ప్రతిపాదనకు మంత్రిత్వశాఖల కార్యదర్శుల బృందం ఆమోదం తెలపడంతో కేబినెట్‌‌ ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో రెండో పెద్ద రిఫైనరీ భారత్‌‌ పెట్రోలియం కార్పొరేషన్‌‌ లిమిటెడ్ (బీపీసీఎల్‌‌)లో మెజారిటీ వాటాను ఏదైనా గ్లోబల్‌‌ ఆయిల్‌‌ కంపెనీకి అమ్మేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కంట్రోలింగ్‌‌ వాటా వదులుకోవాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం తొలుత దేశంలోని అతి పెద్ద రిఫైనరీ ఇండియన్‌‌ ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌ (ఐఓసీ)కే తన వాటా అమ్మాలని భావించింది. ఐతే, దాని వల్ల ఆ రంగంలో మోనాపోలీకి అవకాశమిచ్చినట్లవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఇప్పుడు ఏదైనా గ్లోబల్‌‌ కంపెనీకి అమ్మాలని భావిస్తోంది. దేశీయ ఇంధన రంగంలో మల్టీ నేషనల్‌‌ కంపెనీలను తేవడం ద్వారా మార్కెట్లో పోటీ తేవాలనేది కూడా ప్రభుత్వ వ్యూహాలలో ఒకటిగా తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచీ చమురు రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. బీపీసీఎల్‌‌లో  ప్రభుత్వానికి మొత్తం 53.3 శాతం వాటా ఉంది. ఇందులో మొత్తం వాటానూ అమ్మేస్తోంది.