రేషన్ కార్డులపై 14న కేబినెట్ సబ్ కమిటీ భేటీ

రేషన్ కార్డులపై 14న కేబినెట్ సబ్ కమిటీ భేటీ
  • డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం
  • కరోనా క్లిష్ట కాలంలో కేసీఆర్ అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నాడు
  • పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు.. డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈనెల 14న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుట కమలాకర్ వెల్లడించారు.కరోనా క్లిష్ట కాలంలో కేసీఆర్ అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నాడని మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
రేషన్ కార్డుల జారి, డీలర్ల సమస్యలు, ప్రజాపంపిణీ వ్వవస్థ పటిష్టంపై విధి విధానాల ఖరారు కోసం తన ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతుందని ఆయన తెలిపారు. అన్నార్థుల ఆకలి తీర్చే మహాయజ్ణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  కరోనా సంక్షోభంతో బతుకు చిద్రమైన వారి జీవితాల్లో అర్ధాకలిని పారదోలడానికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు.

సబ్ కమిటీ సమావేశంలో నూతన రేషన్ కార్డుల జారీ విధి విధానాలు, జనాభా ప్రాతిపదికన రేషన్ షాపుల ఏర్పాటు, ప్రజలకు సులభంగా రేషన్ అందేలా ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టం కోసం తీసుకోవాల్సిన చర్యలు, రేషన్ డీలర్ల సమస్యలు, కమిషన్ పెంపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నామని వివరించారు. సీఎం కేసీఆర్ సంకల్పించిన విధంగా పౌరసరఫరాల వ్యవస్థని తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద 53,55,797 కార్డులకు గానూ 1,91,69,619 మంది లబ్దిదారులు, అదనంగా రాష్ట్రం ఇచ్చిన 33,85,779 కార్డుల ద్వారా 87,54,681 మంది లబ్దిదారులు ఉండగా తాజాగా 4,46,169 కార్డులు  పెండింగులో ఉన్నాయన్నారు మంత్రి గంగుల. ప్రస్తుతం 1,78,043 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రతి నెలా ఇస్తుండగా జూన్ మాసంలో అదనంగా 2,52,864 మెట్రిక్ టన్నుల్ని లబ్దిదారులకు సరఫరా చేస్తున్నామన్నారు.