కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 60 మంది మృతి

కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 60 మంది మృతి

గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ ప్రమాద ఘటనలో మరెంతో మందికి గాయాలయ్యాయి. దాదాపు 100 మంది జాడ గల్లంతైందని అంటున్నారు.  

సందర్శకులు సరదాగా కేబుల్ బ్రిడ్జిపై తిరుగుతుండగా హఠాత్తుగా కుప్పకూలింది. బ్రిడ్జిపై ఉన్న సందర్శకులు తేరుకునేలోపే చాలామంది నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న వారు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎంత మంది గాయపడింది ఇంకా తెలియడం లేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కేబుల్ బ్రిడ్జికి మరమ్మత్తులు రావడంతో కొన్ని రోజులపాటు మూసివేశారు. ఇటీవలనే అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు. సందర్శకులు తిరిగేందుకు ఐదు రోజుల క్రితమే (అక్టోబరు 26న) అనుమతిచ్చారు. అక్టోబరు 26నే గుజరాతీ నూతన సంవత్సర వేడుకలు కూడా జరిగాయి.

కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటనే స్పందించి విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక అంతకుముందు ఆయనకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చెరో రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. 

ప్రస్తుతం తెలంగాణలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు తగిన సహాయ సహకారాలు అందించాలని గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.