- కుటుంబసభ్యుల మధ్య ఆస్తి గొడవలే కారణం?
- వెనుదిరుగుతున్న కస్టమర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చారిత్రక నేపథ్యమున్న కేఫ్ బహార్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూత పడింది. రోజూ వేల మంది కస్టమర్లతో కిటకిటలాడే 51 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్ 10 రోజుల నుంచి క్లోజ్ అయ్యింది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన ఆస్తి తగాదాలే మూసివేతకు కారణమని తెలుస్తోంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే హైదర్‌గూడ కేఫ్ బహార్ పరిసరాలు వెలవెలబోతున్నాయి. 1973లో ఇరానీ ఛాయ్ స్టాల్‌తో ప్రారంభం సిటీలో బిర్యానీ, ఇరానీ చాయ్‌కి కొన్ని రెస్టారెంట్లు పెట్టింది పేరు. అందులో కేఫ్ బహార్ ఒకటి.
హైదర్‌గూడలో 1973లో ఇరాన్ నేపథ్యమున్న హుస్సేన్ బొలూకి చిన్న ఇరానీ టీస్టాల్ ప్రారంభించారు. కాల క్రమేణా ఇది మల్టీక్యూజియన్ రెస్టారెంట్ స్థాయికి ఎదిగింది. వారం క్రితం ఈ కేఫ్‌లో 250 మందికి పైగా వర్కర్లు పనిచేసేవారు.
కొవిడ్ టైంలో దీని ఓనర్ బొలూకి ఇరాన్ లో చనిపోయారు. తర్వాత కుటుంబసభ్యుల మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలు మొదలయ్యాయని, కోర్టు మెట్లు ఎక్కడంతో రెస్టారెంట్‌ను మూసివేసినట్లు సమాచారం. కొద్ది రోజుల్లో తిరిగి రెస్టారెంట్ ను ఓపెన్ చేస్తారని రెస్టారెంట్ పక్కన ఉన్న సమీప షాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు.
చిన్నప్పటి నుంచి వస్తున్నా
నా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో కలిసి కేఫ్బహార్కు వెళ్లేవాళ్లం. ఇక్కడ దొరికే ఫిష్ బిర్యానీ నా ఫేవరెట్. వారంలో ఒక్కసారైనా ఈ బిర్యానీ తినే వాడిని. కొద్ది రోజులుగా హోటల్ మూసి వేసి ఉంది. బిర్యానీని మిస్ అవుతున్నా..త్వరలోనే ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నా.
మనోజ్, పాన్ షాప్ నిర్వాహకుడు, బషీర్ బాగ్
కేఫ్ బహార్ బంద్తో.. నా బిజినెస్ డల్
నేను గత పదేండ్లుగా కేఫ్ బహార్ రెస్టారెంట్ వద్ద గాగుల్స్ అమ్ముతున్న. పది రోజులుగా రెస్టారెంట్ మూతపడి ఉంది. ఆ ఎఫెక్ట్ నా వ్యాపారంపై పడింది. రోజూ ఇక్కడికి వచ్చేవారికి 30 గాగుల్స్అమ్మేవాడిని.. ఇప్పుడు రోడ్ మీద వెళ్లేవారిని బతిమాలి అమ్ముకోవాల్సి వస్తోంది. రోజూ పది గాగుల్స్కూడా అమ్ముడుపోవడం లేదు.
అఫ్జల్, గాగుల్స్ వెండర్, హైదర్ గూడ