సందేశ్ ఖాలీ అల్లర్లపై విచారణ చేయండి : హైకోర్టు

సందేశ్ ఖాలీ అల్లర్లపై విచారణ చేయండి : హైకోర్టు
  • సీబీఐకి కలకత్తా హైకోర్టు ఆదేశం

కోల్​కతా: బెంగాల్ సందేశ్‌‌ఖాలీ అల్లర్లపై సీబీఐ విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు, భూకబ్జా ఆరోపణలపై విచారణ జరపాలని తెలిపింది. దీనిని కలకత్తా హైకోర్టు పర్యవేక్షిస్తుందని పేర్కొంది. భూములను భౌతికంగా తనిఖీ చేయడంతో పాటు రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని  కోరింది. 

వ్యవసాయ భూమిని అక్రమ నీటి వనరులుగా మార్చారనే ఆరోపణలపై సమగ్ర నివేదికను దాఖలు చేయాలని  కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ టీఎస్‌‌ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ సీబీఐని ఆదేశించింది. నివేదికను మే2న సమర్పించాలని అదే రోజున కేసును మళ్లీ విచారిస్తామని చెప్పింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ ప్రాంగణాన్ని సోదా చేయడానికి వెళ్లిన ఈడీ అధికారులపై  జనవరి 5న మూక దాడి జరిగింది. రేషన్ పంపిణీ కేసుకు సంబంధించి ఆయన నివాసాల్లో తనిఖీ చేయడానికి ఈడీ అధికారులు వెళ్లారు.