సద్గురు డీప్‌‌ ఫేక్ వీడియోతో.. భక్తురాలికి రూ. 3 కోట్ల 75 లక్షల టోకరా!

సద్గురు డీప్‌‌ ఫేక్ వీడియోతో.. భక్తురాలికి రూ. 3 కోట్ల 75 లక్షల టోకరా!
  • ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో వృద్ధురాలిని మోసం చేసిన సైబర్‌‌‌‌ నేరగాళ్లు
  • ఐదు నెలల కింద బెంగళూరులో ఘటన
  • క్యాష్‌‌ విత్‌‌డ్రా కాకపోవడంతో బయటపడిన మోసం

బెంగళూరు: సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌ డీప్‌‌ ఫేక్‌‌ వీడియోను చూపించి  ఓ భక్తురాలిని సైబర్ నేరగాళ్లు దోపిడీ చేశారు.  ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఆమెతో ఏకంగా రూ. 3.75 కోట్లు పెట్టుబడి పెట్టించి, ఆ డబ్బులను కొట్టేశారు. చివరకు తన డబ్బులు విత్‌‌డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు కంప్లయింట్‌‌ చేసింది. డబ్బంతా ఆమె ఐదు నెలల కిందే నేరగాళ్లకు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసినందున ఇప్పుడేం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. 

డీప్‌‌ ఫేక్‌‌ అని తెలియక.. 

బెంగళూరులోని సీవీ రామన్‌‌నగర్‌‌‌‌కు చెందిన 57 ఏండ్ల రిటైర్డ్‌‌ మహిళ సద్గురు జగ్గీవాసుదేవ్‌‌ను ఆరాధిస్తారు. ఆమెకు ఓరోజు యూట్యూబ్‌‌లో వీడియోలు చూస్తుండగా సద్గురు వీడియో కనిపించింది. అందులో ఆయన ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లో డబ్బులు పెట్టాలని సజెస్ట్‌‌ చేస్తున్నట్లుంది. 

ఇ–మెయిల్‌‌, ఫోన్‌‌ నంబర్‌‌‌‌తో పాటు 250 డాలర్లు చెల్లిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, అందుకు కిందున్న లింక్‌‌ క్లిక్‌‌ చేయాలని జగ్గీ వాసుదేవ్‌‌ చెప్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అది డీప్‌‌ ఫేక్‌‌ వీడియో అని తెలియక ఆ మహిళ.. వీడియో కింద ఉన్న లింక్‌‌పై క్లిక్‌‌ చేశారు. దీంతో ఆ పెద్దావిడకు ఇద్దరు కాల్‌‌ చేసి పెట్టుబడి చేయాల్సిన మిగతా ప్రాసెస్‌‌ అంతా చెప్పి ఆమెతో ఫార్మాలిటీస్‌‌ పూర్తి చేయించారు. 

ట్రేడింగ్‌‌పై ట్రైనింగ్‌‌ ఇచ్చి దోపిడీ

యూకే నుంచి వలీద్‌‌ అనే వ్యక్తి ఫోన్‌‌ చేసి మిర్రాక్స్‌‌ అనే యాప్‌‌ను ఆ మహిళతో డౌన్‌‌లోడ్‌‌ చేయించాడు. ఆపై ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ ఎలా చేయాలో కూడా జూమ్‌‌ యాప్‌‌ ద్వారా ఆమెకు ట్రైనింగ్‌‌ ఇచ్చాడు. అతడు లేనప్పుడు మైఖేల్‌‌ అనే మరో వ్యక్తికూడా ట్రేడింగ్‌‌పై శిక్షణ ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్‌‌ 23 మధ్య ఆ మహిళతో ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లోకి రూ. 3.75 కోట్లకుపైగా బదిలీ చేయించారు. డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పారు. 

కొద్దిరోజుల్లో డబ్బులు పెరిగినట్లు యాప్‌‌లో చూపించడంతో బాధితురాలు విత్‌‌డ్రా చేసేందుకు యత్నించారు. డబ్బులు విత్ డ్రా కాకపోగా, నాలుగు నెలలపాటు ఎవరిని సంప్రదించినా రెస్పాన్స్‌‌ రాలేదు. దీంతో తాను మోసపోయానని ఆమె గ్రహించారు. గురువారం బెంగళూరు సైబర్‌‌‌‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కేసు దర్యాప్తు ప్రారంభించాం కానీ, ఇన్నిరోజుల తర్వాత  సైబర్‌‌‌‌ నేరగాళ్ల ఖాతాలోంచి డబ్బులు తిరిగి పొందడం సాధ్యం కాదని, బ్యాంకులతో సంప్రదించి వాళ్ల అకౌంట్లను మాత్రం ఫ్రీజ్‌‌ చేయిస్తామని పోలీసులు చెప్తున్నారు.