కరీంనగర్ సిటీ, వెలుగు : కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర అని, రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయిన వారి స్మృతివనాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గురువారం కరీంనగర్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోతిరాంపూర్ బైపాస్ రోడ్డులోని బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కోతిరాంపూర్, కమాన్, బస్టాండ్, తెలంగాణ చౌక్ మీదుగా అనభేరి ప్రభాకర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వెట్టి చాకిరి విముక్తి కోసం పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని చెప్పారు.
బీజేపీ లీడర్లు తెలంగాణ విమోచన దినమంటూ, కాంగ్రెస్ నాయకులు సమైఖ్యతా దినోత్సవం అంటూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం అని, రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య పాల్గొన్నారు.
