
- బీసీల కల నెరవేరాలంటే అన్ని పక్షాలు రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి
- బీసీ బిల్లుకు పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు తెలపాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ కులగణన దేశ దశ, దిశను మార్చే సర్వే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశానికి తామో మార్గం చూపామని, దాన్ని అనుసరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ ధర్నా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపిందని, పార్లమెంట్‌లోనూ మద్దతుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుకు గురువారమే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టబద్ధమైన పనులు పూర్తి చేశామని, పార్లమెంట్‌లో చర్చ కోసం కాంగ్రెస్ ఎంపీలు అడ్జెండ్మెంట్ మోషన్ ఇచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన పనిని పూర్తి చేసిందని, కేంద్రమే ఆమోదముద్ర వేయాలన్నారు. దశాబ్దాల బీసీల కల నెరవేరాలంటే అన్ని పక్షాలు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించింది కాదని, ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని స్పష్టతనిచ్చారు.
ఆర్డినెన్స్‌పై వారివి అవగాహన లేని మాటలు..
బిల్లు పంపిన తర్వాత ఆర్డినెన్స్ ఏంటని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా బీఆర్ఎస్ నేతలు పెట్టిన పరిమితిని తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆర్డినెన్స్ తెచ్చిందని వివరించారు. రాష్ట్రపతి వద్ద ఉన్న రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు చేపట్టిన ఈ ధర్నా ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా సైంటిఫిక్‌గా సర్వే చేపట్టాలని ప్రణాళికా శాఖకు ప్రభుత్వం ఆదేశించిందని గుర్తుచేశారు. 1.05 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుని, ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేని రీతిలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.