
న్యూఢిల్లీ : జీ20 సదస్సు కోసం రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఇందుకోసం నగరంలోని చాలా రోడ్ల వెంట అందమైన పూల కుండీలను ఏర్పాటు చేశారు. అయితే వాటిని కూడా దొంగలు వదలడం లేదు. కొందరు లగ్జరీ కారులో వచ్చి మరీ పూల కుండీలను ఎత్తుకుపోయారు. ఢిల్లీ – గురుగ్రామ్ ఎక్స్ప్రెస్ వేపై ఉండే యాంబియెన్స్ మాల్ ఎదుట సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూల కుండీల చోరీకి సంబంధించిన వీడియోను ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈవిషయం తెలియడంతో గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్అథారిటీ (జీఎండీఏ) ఉన్నతాధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఫుటేజీలోని కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేసి.. నగరంలోని గాంధీ నగర్ కు చెందిన మన్మోహన్ అనే వ్యక్తి పూల కుండీలను దొంగతనం చేశాడని గుర్తించారు. ఇప్పటికే అతడిని అరెస్టు చేశారు. దొంగతనానికి వాడిన కారును కూడా సీజ్ చేశారు. పూల కుండీలను కారులో పెట్టడంలో మన్మోహన్కు హెల్ప్ చేసిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.