- మంగళవారం సాయంత్రం ముగిసిన తొలి విడత ప్రచారం
- 11న పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : వారం రోజులుగా తొలి విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మంగళవారం ప్రచారానికి తెర పడడంతో చివరి రోజు పల్లెల్లో ప్రచారాలు హోరెత్తాయి. అభ్యర్థులు, మద్దతుదారులు గుర్తులు చూపిస్తూ ఓటర్లకు వంగివంగి దండాలు పెట్టడంతోపాటు పాదాభివందనాలు చేశారు. చికెన్ప్యాకెట్ల పంపిణీతోపాటు జోరుగా దావత్లు జరిగాయి. ఫస్ట్ విడత పోలింగ్ జరిగే గ్రామాలకు బుధవారం సాయంత్రమే ఎన్నికల సామగ్రితో అధికారులు చేరుకోనున్నారు.
ఇప్పటికే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి ట్రైనింగ్, విధులు కేటాయించేందుకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తైంది. పోలీస్ సిబ్బంది మద్యం షాపులు, కల్లు దుకాణాలను మూసివేయించారు. మంగళవారం సాయంత్రం ప్రచార సందడి లేక పల్లెలు మూగబోయాయి. అంతర్గత ప్రచారం చేస్తూ ఓటర్లు ప్రలోభాలకు గురిచేసే పనిలో ఆయా పార్టీల శ్రేణులు నిమగ్నమయ్యారు. ఈ నెల 11న పోలింగ్, అందేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తొలి విడత బరిలో..
నిజామాబాద్ జిల్లా 11 మండలాల్లోని 184 గ్రామ పంచాయతీలకుగాను 29 మంది సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1,642 వార్డులకు 575 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 155 జీపీల నుంచి సర్పంచ్ పదవి కోసం 519 మంది అభ్యర్థులు, 1,060 వార్డుల నుంచి 2,734 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కామారెడ్డి జిల్లాలోని10 మండలాల్లో 167 పంచాయతీల్లో 11 సర్పంచ్ పదవులు, 1,520 వార్డు మెంబర్లకు గాను 433 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 156 పంచాయతీల్లో సర్సంచ్ అభ్యర్థులు 738 మంది, 1,084 వార్డుల్లో 3,481 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నగదు, చికెన్, మద్యం పంపిణీ
చివరి రోజు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం జరిగింది. ర్యాలీలు తీయడంతోపాటు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, చికెన్, మద్యం పంపిణీ చేసినట్లు తెలిసింది. మహిళలకు కూల్ డ్రింక్స్ సప్లయ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, రెంజల్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బిక్కనూరు, సదాశివనగర్, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, తాడ్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో దావత్లు జోరుగా కొనసాగాయి.
అందరిని ఒక చోట కాకుండా నలుగురైదుగురిని కూర్చొబెట్టి దావత్ ఇచ్చారు. కొన్నిచోట్ల నేరుగా ఇండ్లకు మద్యం పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో ఓ కుల సంఘం సభ్యులు చేసిన ప్రమాణం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. మద్దతుదారులకు మటన్, మందు దావత్లు పెట్టినట్లు తెలుస్తోంది. మంగళ, బుధవారాల్లో పంపిణీ చేసేందుకు సరిపడా లిక్కర్ డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

