కొత్త ఏడాదిలో గోల్డ్ ధరలు పైకే!

కొత్త ఏడాదిలో గోల్డ్ ధరలు పైకే!

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఔన్స్ గోల్డ్ (28.35 గ్రాములు)  ధర  2,060 – 2,090 డాలర్ల (రూ.1.69 లక్షల) కు చేరుకోవచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రేట్లు పడినా 2,035 డాలర్ల దిగువకు రాకపోవచ్చని పేర్కొన్నారు.  2024 లో బంగారం ధరలు 2,115 డాలర్లకు పెరగొచ్చని ఎమ్కే వెల్త్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 

ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ గరిష్టాల్లో ఉన్నప్పటికీ  యూఎస్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లు పెరగడంతో గోల్డ్ రేట్లు ఈ ఏడాది  ఎక్కువగా పెరగలేకపోయాయని వెల్లడించింది. తాజాగా ఔన్స్ గోల్డ్ ధర 2,050 డాలర్ల లెవెల్‌‌‌‌‌‌‌‌ను క్రాస్ చేసిందని,  డాలర్ వాల్యూ తగ్గితే గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తామని ఫెడ్ ప్రకటించింది. దీంతో  డాలర్ వాల్యూ తగ్గే అవకాశం ఉందని ఎమ్కే వెల్త్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అంచనా వేస్తోంది. టెక్నికల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే ఔన్స్ గోల్డ్ 2,035 డాలర్ల కిందకి వస్తే 2,010 డాలర్ల దగ్గర గట్టి సపోర్ట్ ఉందని తెలిపింది. 

రేంజ్ బౌండ్‌‌‌‌‌‌‌‌లోనే

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గోల్డ్ రేట్లు 13–15 శాతం పెరిగాయని, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8 శాతం మేర లాభపడిందని మోతీలాల్‌‌‌‌‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  జియో పొలిటికల్ టెన్షన్లు,  సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పెంచడంతో వీటికి డిమాండ్ నెలకొందని వెల్లడించింది. కొత్త ఏడాదిలో  బేస్ మెటల్స్ ధరలు ఒకే రేంజ్‌‌‌‌‌‌‌‌లో కదులుతాయని ఈ బ్రోకరేజ్ కంపెనీ అంచనా వేస్తోంది.