
తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అయితే, నా అభిప్రాయం ప్రకారం దేశంలో స్వాతంత్ర్యానంతరం విద్యావ్యవస్థ ద్వారా వర్ణ వ్యవస్థను తిరిగి నెలకొల్పారు. బ్రిటిష్ వారి విద్యవల్ల మనదేశంలో ఆధునిక భావాలు పెరిగి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం మొదలైన లక్ష్యాల కోసం స్వాతంత్య్ర ఉద్యమం చేశారు.
కానీ, అవేవి నెరవేరకపోగా ఇంకా వర్ణవ్యవస్థకు అనుగుణంగా విద్యావ్యవస్థ కుల భావజాలాన్ని పెంచి పోషిస్తోంది. విద్యవల్లనే మనిషిలో మార్పు వస్తుంది. అది జరగకుండా పాత సామాజిక వ్యవస్థకనుగుణంగా విద్యను పునర్నిర్మించారు. అందుకే రాజ్యాంగ లక్ష్యాలన్నీ నెరవేరాలంటే మళ్ళీ విద్య నుంచే మొదలుపెట్టాలి.
విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులు
- 1. పీజీ కోర్సులన్నింటినీ ఒకే పేరుతో ఉండేలా మార్చాలి. మాస్టర్స్ ఇన్ లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అని సబ్జెక్ట్ పేరును రాయవచ్చు.
- 2. పీజీ కోర్సుల పేర్ల ద్వారా వస్తున్న వివక్ష (ఎమ్మెస్సీ/ఎంకాం/ఎంఏ/ఎంబీఏ/ఎం ఎస్ డబ్ల్యూ/ ఎం హెచ్ ఆర్ ఎం/ ఎంసీఏ/ఎంసీజే/ఎంటీఎం/ ఎంటెక్/ఎంఫార్మసీ/ ఎల్ ఎల్ ఎం/ఎంఎడ్ / ఎంపీ ఎడ్/ఎండీఎస్/ఎండీ/ఎంఎస్ తదితర.,)ను తొలగించాలి.
- 3. డిగ్రీలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీలో అన్ని కోర్సులు (మొత్తం సబ్జెక్టులను ఒక జాబితాగా ప్రకటించి ఏ సబ్జెక్టునైనా) చదువుకోవడానికి అవకాశమివ్వాలి. అందుకు ప్రవేశపరీక్ష నిర్వహించవచ్చు. డిగ్రీలో చదివిన సబ్జెక్టు కాకుండా వేరే సబ్జెక్ట్‌లో పీజీ చేయదలిస్తే, ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం సీటు కేటాయిస్తున్నారు. సీటుకోసం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తను కోరుకునే సబ్జెక్ట్‌లో అనుభవాన్ని గడించవలసిందే కదా! అనగా ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం వల్లనే మార్కులు సాధిస్తారు. కాబట్టి డిగ్రీలో సబ్జెక్ట్ చదవలేదని, పీజీ ప్రవేశ పరీక్ష రాయకుండా నిరోధించడం పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు. కేవలం మన దేశంలో మాత్రమే అమలులో ఉంది.
- 4. చదువుకునే సమయంలో పీజీ, డిగ్రీ విద్యార్థులకు సంబంధిత పట్టణాల్లో/నగరాల్లో కచ్చితంగా ఏదేని, వారికి నచ్చిన లేదా దొరికిన పని కల్పించాలి. ప్రతి విద్యార్థికి వారి అభిప్రాయం ప్రకారం ఎన్ని గంటలు పనిచేయాలనుకుంటే అన్ని పని గంటలు నిర్ణయించి, కనీస వేతనం పొందేటట్టు ఏర్పాటు చేయాలి. పనిని కల్పించిన సంస్థకు, విద్యార్థికి మధ్య అనుసంధానం చేసి ప్రతి ఒక్కరూ చదువుతూ పని, పనిచేస్తూ చదువు అనే భావన కల్పించి అమలు పరచాలి. దాంతో శ్రమచేసే లక్షణం అభివృద్ధి చెంది, గౌరవం పెరుగుతుంది అంతేకాదు బాధ్యత కూడా తెలుస్తుంది. ఇంకోవైపు తల్లిదండ్రులకు మరియు ప్రభుత్వానికి ఆర్థిక భారం ఎంతో కొంత తగ్గుతుంది.
- 5. డిగ్రీ కోర్సులన్నింటినీ ఒకే పేరుతో ఉండేవిధంగా మార్చాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్, బ్యాచిలర్ ఆఫ్ ఇన్ అని అన్ని సబ్జెక్ట్‌ల పేర్లు రాయాలి. తక్షణ చర్యగా దోస్త్ అడ్మిషన్ వ్యవస్థలో బకెట్ పద్దతి తీసేసి గోలెం పద్ధతి అమలుచేయాలి. అట్లనే ప్రభుత్వ, యూనివర్సిటీ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశమిచ్చి తద్వారా చేరినవారికి స్కాలర్షిప్ ఇవ్వాలి.
- 6. డిగ్రీ కోర్సుల పేర్ల ద్వారా వస్తున్న వివక్ష (బీఎస్సీ/ బీకాం/బీఏ/బీబీఏ/బీసీఏ/బీసీజే/బీఏఎంస్/బీహెచ్ఎంస్/బీబీఎం/ బీటెక్/బీఫార్మసీ/ ఎల్ఎల్బీ / బి.ఎడ్/ బీపీఈడి/బీడీఎస్/ఎంబీబీఎస్ తదితర.,)ను తొలగించాలి. దీని వల్ల మానసిక సమతా స్థితినీ అందరం ఒకటే అనే భావన మనుషుల్లో కలిగించవచ్చు. సామాజిక శాస్త్రాలు చదివినవారికి మిగతా సైన్స్, కామర్స్ కోర్సులు చదవడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు. కానీ, ఎంపీసీ చదివినవారిని మిగతా కోర్సులు అన్నింటికి అర్హులుగా నిర్ణయించి, అలాగే అన్ని రకాల ఉద్యోగాలకు కూడా అర్హులుగా చేశారు. రెండోది బైపీసీ చదివినవారు గణితంకు సంబంధించిన అన్ని కోర్సులకు, ఉద్యోగాలకు అనర్హులు. అలాగే కామర్స్ లేదా వాణిజ్య శాస్త్రం, సామాజిక శాస్త్రాల కోర్సులకు అలాగే ఉద్యోగాలకు అర్హులు. ఇక సీఈసీ చదివినవారు ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించిన పై చదువులు చదవడానికి వీలుండదు. అలాగే ఉద్యోగాలకు అర్హులు కారు. ఈ విద్యావిధానం వర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉందని పలువురి అభిప్రాయం. చిట్ట చివరి గ్రూప్ అయిన హెచ్ సీఈ గ్రూపునకు సంబంధించిన పై చదువులు చదవడానికి, ఉద్యోగాలు పొందడానికి అర్హులు. ఇక చిట్ట చివరికి హెచ్ సీఈ గ్రూపు తీసుకున్న/చదివినవారు మిగతా పై మూడు గ్రూపులకు సంబంధించిన పై చదువులు చదవడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు. ఇదంతా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఒక పద్ధతి ప్రకారం వర్ణ వ్యవస్థకనుగుణంగా విద్యా ప్రణాళికను స్వాతంత్ర్యానంతరం పునర్నిర్మించారు అని నా నిశ్చితాభిప్రాయం. కాబట్టే దీనిని మార్చకుండా సామాజిక జీవనంలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు అని బలంగా నమ్ముతున్నాను. అందుకే విద్యావ్యవస్థను ప్రజాస్వామీకరించాలి.
- 7. ఇంటర్లో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా డిగ్రీలో అన్నింటినీ కలిపి వేయాలి. అనగా మొత్తం సబ్జెక్టులన్నింటినీ ఒక జాబితాగా ప్రకటించి ఏ మూడు సబ్జెక్టులనైనా తీసుకోవడానికి లేదా చదువుకోవడానికి అవకాశమివ్వాలి. కాలక్రమంలో ఇంజినీరింగ్, వైద్యం, మందుల తయారీ, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, నర్సింగ్, సాంకేతిక వృత్తి విద్యాకోర్సులన్నింటినీ కలపవచ్చు. అయితే, ముందుగా సంప్రదాయ సబ్జెక్టులను వీలైనంత మేరకు కలిపి అమలుచేయాలి.
- 8. ఇంటర్ విద్యను ఉన్నత పాఠశాల విద్యకు అనుబంధంగా మార్చి సీబీఎస్ఈ పద్ధతిలో నడుపుతూ 12వ తరగతిగా నిర్ణయించి ఇంటర్ బోర్డ్‌ను రద్దు చేయాలి. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో కలిపేయాలి. దేశంలో అనేక రాష్ట్రాల్లో అలానే ఉండగా మన రాష్ట్రంలో కొనసాగించడం సరైనది కాదు.
- 9. ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు రెండు భాషా సబ్జెక్టులు, నాలుగు ఆప్షనల్ సబ్జెక్టులు ఉండేవిధంగా విద్యా విధానాన్ని పునర్నిర్మించాలి. ఒక భాష సబ్జెక్టును తీసేసి దాని స్థానంలో కంప్యూటర్ సైన్స్‌ను పన్నెండవ తరగతి వరకు ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా పెట్టాలి. ప్రస్తుత ఏఐ కాలంలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టును నేర్చుకోకుంటే నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారనేది ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.
- 10. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన త్రి భాషా విధానాన్ని పాటించాలనుకుంటే 3 నుంచి 5వ తరగతి వరకు మూడు భాషలు బోధించవచ్చు. పిల్లలకు బోధనా పద్ధతిలో మార్పులు చేసి ఒత్తిడి లేకుండా ఆట పాటల విధానంలో బోధన చేయాలి.
- 11. మొత్తం పరీక్షల విధానాన్ని, మూల్యాంకన విధానాన్ని సంస్కరించాలి. డిగ్రీ వార్షిక లేదా సెమిస్టర్ చివరి పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించాలి. మూల్యాంకనంలో ప్రస్తుత పద్ధతిలో మార్పులు చేస్తూ హాజరు శాతానికి, మంచిరాత రాసేవారికి, వివిధ రకాల పాఠ్యేతర అంశాలకు/కార్యకలాపాలకు, క్షేత్ర అధ్యయనాలకు కూడా మార్కులివ్వాలి. విద్యార్థులకున్న మేధస్సుకు, క్రమబద్ధమైన కార్యకలాపాలకు, ప్రాధాన్యమివ్వాలి.
- 12. అన్ని స్థాయిల్లోని సబ్జెక్టులలో ఊహాజనిత అంశాలను పాఠ్యాంశాలుగా పెట్టరాదు. కుల, మత సంబంధమైన విషయాలను బోధించరాదు. శాస్త్రీయ, సంస్కరణ విషయాలకు బోధనలో
- ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలి.
- 13. అన్ని కోర్సుల పరీక్షలతో పాటు పరిశోధన సిద్ధాంతాలను కూడా మాతృభాషలో రాసుకోవడానికి అవకాశమివ్వాలి. అందుకనుగుణంగా పుస్తకాలను తెలుగు అకాడమీ ద్వారా ముద్రించి అందుబాటులో ఉంచాలి.
- 14. పని కల్పించే కోర్సుల రూపకల్పన జరగాలి. నిరంతరం ఉద్యోగ/ పని ఆధారిత చదువుకే
- ప్రాధాన్యమివ్వాలి. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే అనే భావనను తొలగించడానికి అవసరమైన చర్యలను ప్రయివేటు రంగంలో ప్రవేశపెట్టి అమలుచేయాలి.
- 15. విద్యావ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ, నిధుల కేటాయింపు, ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగాలి. శాశ్వత నియామకాలు చేపట్టి, విధుల నిర్లక్ష్యం/విస్మరణ చేసినవారిని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలి.
- డా. కె. వీరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్,కాకతీయ యూనివర్సిటీ-