బ్రిటన్ ప్రధాని లిజ్ రాజీనామా..రేసులో రిషి సునక్ ?

బ్రిటన్ ప్రధాని లిజ్ రాజీనామా..రేసులో రిషి సునక్ ?

బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి  భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు రిషి సునక్ వైపు మళ్లింది. కనీసం ఈసారైన ప్రధాని పదవి రిషిని వరించే అవకాశం ఉందా ? లేదా ? అనే దానిపై వాడివేడి చర్చ మొదలైంది. అయితే దీనిపై ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చేవారం ప్రధాని ఎన్నిక జరిగేలోగా రాజకీయ పరిణామాలు ఏ మలుపైనా తీసుకునే చాన్స్ ఉంటుందని అంటున్నారు. లిజ్ ట్రస్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీపడే అభ్యర్థుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో రిషి సునక్, పెన్నీ మోర్డాండ్, జెరెమీ హంట్ ఉన్నారంటూ ‘స్కై న్యూస్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఇంతకుముందు బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ తో చివరి రౌండ్ దాకా పోటీపడిన బలమైన అభ్యర్థిగా రిషి సునక్ కు మంచి గుర్తింపు ఉందని విశ్లేషించింది. ఈ గుర్తింపే రిషిని పెన్నీ మోర్డాండ్, జెరెమీ హంట్ కంటే ముందు వరుసలో నిలిపే చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. మరోవైపు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని ఒక వర్గం మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తీర్పును అనుసరించి మళ్లీ జాన్సన్ నే ప్రధాని చేయాలనే అభిప్రాయంతో ఆ వర్గం ఉందని అంటున్నారు. ఇదే విధంగా మాజీ ప్రధాని థెరెసా మే నాయకత్వంలో పనిచేస్తామని వాదించే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వీరంతా వచ్చే వారం జరగనున్న ప్రధానమంత్రి ఎన్నిక వేళ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. ఇక చివరిసారి జరిగిన ఎన్నికలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 1.70 లక్షల మంది సభ్యుల్లో అత్యధికులు లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపారు. దీంతో ఫలితం ఆమె వైపే వచ్చింది. ఈసారి రిషిసునక్ వారిని ప్రసన్నం చేసుకోవడంపై దృష్టిపెడితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.   

ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇస్తడనే పేరు..

కరోనా కాలంలో బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రిషి సునక్ తీసుకున్న నిర్ణయాలు  దేశ ప్రజలకు ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. ఆ అనుభవంతోనే కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికల్లో రిషి సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. లిజ్ ట్రస్ హామీలను ప్రకటించిన తర్వాత..  పన్ను కోతలపై విధానాలను మార్చుకోవాల్సిందిగా మద్దతుదారుల నుంచి రిషి సునక్‌పై ఒత్తిడి పెరిగింది. ఓటమి తప్పదని కూడా హెచ్చరించారు. అయినా సరే.. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేదాకా పన్నుల కోతలు ఉండబోవని సునక్ స్పష్టం చేశారు. ఒకవేళ పన్నుల్లో కోతపెడితే ఆర్థిక వ్యవస్థ పతనం కావచ్చని తేల్చి చెప్పారు. కానీ కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి..  ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన లిజ్‌ ట్రస్‌ కే పట్టం కట్టారు.

లిజ్ ట్రస్ పై ఎందుకీ అసహనం ? 

ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపింది. దీంతో  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లిజ్ ట్రస్ ప్రధానిగా ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ సవ్యంగా లేకపోవడంతో డాలరుతో పోలిస్తే పౌండ్ మారకం విలువ పతనమైంది. ప్రభుత్వ రుణ వడ్డీ రేట్లు పెరిగాయి. 2 శాతం ఉండాల్సిన ద్రవ్యోల్బణం రేటు కాస్తా 10 శాతం దాటేసింది. ఈనేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీలోని మెజార్టీ సభ్యుల్లో లిజ్ ట్రస్ పై అసహనం పెరిగింది. ఈ తరుణంలో ఇటీవల నిర్వహించిన పోల్ లో.. కన్జర్వేటివ్ పార్టీలో దాదాపు 62 శాతం మంది తాము సరైన వ్యక్తిని ఎన్నుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏడాదిలోగా గద్దె దించడం ఈజీ కాదు.. కానీ

నిజానికి కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల నిబంధనల ప్రకారం బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వారిని గద్దె దించాలంటే కనీసం ఏడాది పాటు వేచి ఉండాల్సిందే. అయితే పార్టీ నిబంధనలను మార్చే అధికారం కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల కమిటీకి ఉంది. ఈ కమిటీకి హెడ్‌గా గ్రాహమ్‌ బాడీ పనిచేస్తున్నారు. ఇటీవల 100 మంది పార్లమెంట్‌ సభ్యులు తమ అవిశ్వాస పత్రాలను అక్టోబరు 24లోగా బ్రాడీకి సమర్పించేందుకు సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి.  ఈ పరిణామం నేపథ్యంలోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం గమనార్హం.