వెలుగు ఓపెన్ పేజీ.. దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే

వెలుగు ఓపెన్ పేజీ.. దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి 1989లో  వీపీ సింగ్ నేతృత్వంలో మండల్​శక్తులు అధికారంలో వాటా సంపాదించుకుని మండల్​ కమిషన్​ రిపోర్టును అమలు చేయించుకున్నప్పుడు రాజీవ్​గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్​ మండల్ కమిషన్​ రిపోర్టును అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తరువాత కూడా అది పార్టీలో ఓబీసీల నాయకత్వాన్ని అన్ని స్థాయిల్లో ఎదగనివ్వలేదు. 2006లో  రెండో మండల్​ అని పిలిచే  కేంద్రస్థాయి రిజర్వేషన్​ అమలు ఓబీసీలను సంతృప్తిపర్చే పద్ధతిని అనుసరించలేదు. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో జాతీయ గుర్తింపు కలిగిన ఒక్క ఓబీసీని నియమించలేదు.  ముస్లింలకు, దళితులకు కొంత ప్రాముఖ్యతనిచ్చింది.  కేఆర్ నారాయణన్​ ఆ క్రమంలోనే అధ్యక్షుడిని చేసింది. 

అంతకుముందు ముస్లిం నాయకులు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అయ్యారు. ముఖ్యంగా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు  ప్రతిభాపాటిల్​ను, ప్రణబ్​ముఖర్జీని అధ్యక్షులను చేశారు. కానీ, మండల్​ సపోర్టర్లుగా ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఆ పార్టీలో ఆ స్థానాలకు రానివ్వలేదు.యూపీఏ కాలంలో  మన్మోహన్​సింగ్​ (సిక్కు ఎకనామిస్ట్)  పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల పార్టీ నిర్మాణానికి మేలు ఏమీ జరగలేదు.  ప్రాంతీయ పార్టీల అండతో అధికారంలో ఉండగలిగారు.  హమిద్​ అన్సారీ  ఉపాధ్యక్షుడిగా ఉన్నా పార్టీ నిర్మాణానికి జరిగిన మేలు ఏమీలేదు.  మెజారిటీ ముస్లింలు మామూలుగానే  కాంగ్రెస్​తో ఉన్నారు.  సిక్కులు దేశమంతటా ఉన్న ఓటర్లు కాదు. ముస్లింలు ఓబీసీల్లా 50 శాతానికి మించిన జనాభా కాదు.  కానీ ఆనాటికి ఒక ఓటు బ్యాంకుగా మారిన ఓబీసీ రాజకీయ చైతన్యంపై  కాంగ్రెస్​ ఫోకస్​ పెట్టలేదు.  ఈ స్థితిని బాగా అధ్యయనం చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ 2014 నుంచి ఎత్తుగడను మార్చాయి.  

నిర్మాణపరంగా ఓబీసీ రాజకీయాలకు చోటు ఇవ్వడం ప్రారంభించాయి.  ఆ క్రమంలోనే 2014 మోదీని  ఓబీసీ  పీఎంగా  ప్రచారం చేశారు. కానీ,  కాంగ్రెస్​ ఆ మార్పు ప్రాధాన్యాన్ని అసలు అధ్యయనం చేయలేదు. అదే బీజేపీకి అదునుగా మారింది. రాహుల్ గాంధీ యాత్రలతో  పార్టీలోకి ఓబీసీలురాహుల్​ గాంధీ నాయకత్వాన్ని చేపట్టేవరకు ఓబీసీ ఓటర్ల మధ్య అసలు కాంగ్రెస్​కు బలం లేదు.  జాతీయస్థాయిలో  కాంగ్రెస్​ నేషనల్​ ప్లాట్​ఫాం నుంచి ఓబీసీ కానిస్టిట్యుయన్సీని అడ్రస్​ చేయగలిగిన ఓబీసీ నాయకుడు లేడు.  ఆస్థితిని క్రమంగా మార్చే ప్రయత్నం రాహుల్​గాంధీ నాయకత్వంలోనే  ప్రారంభమైంది.  ఆయన భారత జోడో యాత్ర,  భారత్​ జోడో న్యాయ్​ యాత్రలతో ఓబీసీలను పార్టీలోకి తెచ్చుకునే  ప్రయత్నం ప్రారంభమైంది. అది ఢిల్లీలో  2025 ఓబీసీ కాంగ్రెస్ సభ్యత్వాలు తాల్కటోరా స్టేడియంలో పెట్టాక  ఓబీసీలకు  పార్టీపై  కొంత నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్​కి కొంత గుబులు మొదలైంది.  అయినా వాళ్లు ఆ పార్టీని  నెహ్రూ కుటుంబ పార్టీగా  ముద్రవేసి  తమ పరిధిలోని  ఓబీసీలను  కాపాడుకోవచ్చని  ప్రాంతీయ పార్టీల్లోని ఓబీసీలను  కాంగ్రెస్​ వైపు పోకుండా చూడొచ్చని నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు.  ఓబీసీలకు మేమే ఎక్కువ వాటాను అధికారంలో ఇస్తామని నిరూపించుకునే  ప్రయత్నం చేస్తున్నారు. 

కాంగ్రెస్​లోని అగ్రకుల నాయకులుసుదీర్ఘకాలం తాము స్వయంగా ఓట్లు సంపాదించలేకపోయినా ఏఐసీసీ అగ్ర నాయకులుగా పనిచేసిన  అగ్రకుల నాయకులు ఓబీసీ నాయకులు అతి కీలక పదవుల్లోకి  రావడానికి ఇష్టపడడంలేదు.  వాళ్లు దళిత నాయకత్వంలో,  ముస్లిం నాయకత్వంలో  చాలాకాలంగా సన్నిహితంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు.  ఆ రెండు కమ్యూనిటీలు ఓబీసీల్లాగ పెద్ద కమ్యూనిటీలు కావు.  కాలక్రమంలో పార్టీని మొత్తంగా నడిపే శక్తిగల నాయకులు ఆ రెండు కమ్యూనిటీల నుంచి ఎదగడం కష్టం. కానీ ఓబీసీలు అలా కాదు. ఇప్పటికే రీజనల్​ పార్టీలను వివిధ రాష్ట్రాల్లో నడిపిన అనుభవం వారికి ఉంది. శక్తి కూడా ఉంది. కానీ ఈ స్థితే  కొనసాగితే కాంగ్రెస్​  జాతీయ స్థాయిలో అధికారంలోకి  రాలేదు.  ముస్లిం, దళిత, అగ్రకుల కాంబినేషన్​  ఒక ఓబీసీ యునిఫైడ్ శక్తికి సమానం కాదు.  శూద్ర  ఓబీసీ వెంటరాకుండా కాంగ్రెస్​  తిరిగి అధికారంలోకి రాలేదు.  ఇప్పడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ముస్లిం వ్యతిరేక  ప్రచారం ఓబీసీలను  దినదినం వారి నిర్మాణంలోకి నెడుతున్నవి.  కనుక  కేవలం ముస్లిం– దళిత  ప్రమోషన్​తో  కాంగ్రెస్​ బీజేపీని అడ్డుకునే జాతీయపార్టీగా తిరిగి బలపడి అధికారంలోకి రావడం అసాధ్యంగానే కనిపిస్తున్నది. ఈ దశలోనే ఓబీసీగా  ప్రచారం పొందింన మోదీని ఎదుర్కొనే ఓబీసీ లీడర్​ను  కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షునిగా చేయడానికి సిద్ధపడాలి.  అదీ ఓబీసీల మధ్య బాగా  క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఆ పార్టీకి ఇప్పుడు అవసరం. 

పార్టీకి సిద్ధరామయ్య అవసరం

గత కొంతకాలంగా చాలా అనుభవంగల దళిత నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే ఆ పార్టీని రాహుల్ గాంధీతో కలిసి  మార్చడానికి బాగా తోడ్పడ్డాడు. ఆయన 2024 ఎన్నికల్లో దళిత​ ఓటర్లను కాంగ్రెస్​వైపు ఎక్కువగా తేవడానికి చేసిన కృషి చాలా గొప్పది.  బీజేపీని ముఖ్యంగా మోదీని, అమిత్ షాని ఆయన వాగ్ధాటితో  చాలా ఇరకాటంలో పెట్టగలిగాడు. ఆయన అక్టోబర్​ 2022 నుంచి కాంగ్రెస్  ​ప్రెసిడెంట్​గా ఉన్నారు.  

83 ఏండ్ల ఖర్గే ఇక ఆ భారాన్ని మోయడం కష్టంగానే కనిపిస్తున్నది.  కొత్తగా నాయకుని కోసం కాంగ్రెస్​ చూడాల్సిన అవసరం ఆ పార్టీ నాయకత్వానికి ఉన్నది. ఖర్గే స్థానంలో సిద్ధరామయ్య రావొచ్చు అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్​ నాయకత్వం ఆయన్ని ఢిల్లీ రావాలని కోరింది. ఇది చాలా కీలకమైన అంశం. ఆయన రాజ్యసభకు పోవడానికి తిరస్కరించాడు అని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం తాత్కాలిక ప్రకటనలు అయి ఉండవచ్చు. సిద్ధరామయ్య 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి  నుంచి ఓబీసీల పక్షపాతిగా,  8 సంవత్సరాలుపైగా  ముఖ్యమంత్రిగా పనిచేసిన  ఏకైక వ్యక్తిగా ఉన్నాడు.  

ఆయన ఆ రాష్ట్రంలో  ఆర్థికమంత్రిగా 18 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు.  దేవరాజ్​అర్స్​ తర్వాత సిద్ధరామయ్య  ఆ రాష్ట్రాన్ని ఎక్కువకాలం పరిపాలించాడు. రాష్ట్రంలోని  ఎన్నో  రాజకీయ,  ఆర్థిక, సామాజిక మార్పులకు మూలస్తంభంగా జీవించాడు. మొదట్లో షియావాది సోషలిస్టుగా, ఆ తరువాత అలుపెరగని మండల్​వాదిగా, హేతుబద్ధ రాజకీయ సిద్ధాంతకర్తగా ఆ రాష్ట్రంలో  దేవెగౌడను,  దేవరాజ్​ అర్స్​ను మించి పేరు  ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 

మత రాజకీయాలకు వ్యతిరేకంగా...

మతతత్వ శక్తులకు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశాడు. దేవేగౌడ పార్టీ జేడీ (ఎస్) నుంచి ఆయన బయటకి వచ్చి తాను స్వయంగా అహిందా అనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఐక్య పరిచి బ్రహాండమైన ఉద్యమాన్ని నిర్మించాడు. తన భుజాలమీద బాధ్యత వేసుకుని రెండుసార్లు కాంగ్రెస్​ను కర్నాటకలో అధికారంలోకి తెచ్చాడు.  ఇప్పుడు అధిష్టానం అభిప్రాయాన్ని గౌరవించి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నా ముఖ్యమంత్రి పదవిని శివకుమార్​కు అప్పజెప్పాడు. 

జాతీయ కాంగ్రెస్, రాహుల్ గాంధీ,  సోనియా గాంధీ ఎంత ప్రయత్నించినా రాజస్తాన్​ ముఖ్యమంత్రి  అశోక్​ గెహ్లాట్​జాతీయ పార్టీ  అధ్యక్ష పదవిని ధిక్కరించి ఆ రాష్ట్రంలో అధికారంలో కొనసాగి కాంగ్రెస్​ అధికారం కోల్పోవడానికి  కారకుడయ్యాడు. అదేవిధంగా కర్నాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి  పదవి వదిలిపెట్టడానికి నరేంద్ర మోదీ,  అమిత్ షా, ఆర్ఎస్ఎస్ నానాతిప్పలు పడ్డారు. దేశ రాజకీయాల్లోనే ఇంత గౌరవప్రదంగా ముఖ్యమంత్రి  పదవిని వదిలిపెట్టిన మరో నాయకుడు లేడు సిద్ధరామయ్య తప్ప.  

సిద్ధరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడైతే...

సిద్ధరామయ్య కనుక ఏఐసీసీ అధ్యక్షుడైతే ఆ పార్టీ చరిత్రలో ఒక అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆయనంత స్టేచర్, సిద్ధాంతపటిమ, కరప్షన్​కు తావులేని జీవితంగల మరో  ఓబీసీ నాయకుడు మాత్రమే కాదు అగ్రకుల  నాయకుడు లేడు. ఆయన పార్లమెంటులో, బయట  నరేంద్ర మోదీ ఓబీసీ స్టేటస్​ని, విలువలను నిలదీస్తే  మోదీ పట్టు  ప్రభుత్వంపై,  పార్టీపై  కూడా  జారిపోతుంది.  ఆయన మంచి ఇంగ్లిష్​  మాట్లాడగలడు. హిందీ అంతగా మాట్లాడలేకపోవడం ఒక సమస్యగా  చూడాల్సిన అవసరం లేదు.  రాహుల్ గాంధీ,  సిద్ధరామయ్యల పోరాటం దేశ రాజకీయాలను ఒక కొత్త మలుపుతిప్పే అవకాశం ఉంది. 

 కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల్లో ముఖ్యంగా ఓబీసీ కార్యకర్తల్లో  కొత్త ఉత్సాహం వస్తుంది.  ప్రాంతీయ పార్టీ నాయకులతో ఆయన  బాగా  సమన్వయం చేయగలడు. వారందరికి ఆయనపైన ఎనలేని గౌరవం ఉంది.  సిద్ధరామయ్యను కనుక కాంగ్రెస్​ ఢిల్లీకి మార్చి అధ్యక్ష పదవిని కట్టబెడితే ఆ పార్టీకి కచ్చితంగా ఒక నూతన బలం వస్తుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలి దేశానికే  మేలుచేసే రాజకీయ నాయకుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది.  ఏమైతదో వేచ్చిచూద్దాం.

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 

హామీ తప్పనిసరి రాయాలి. 

స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.