- చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్, రచిన్.. యువరాజ్ సమ్రా రికార్డు సెంచరీ వృథా
చెన్నై: కెనడా కుర్రాడు యువరాజ్ సమ్రా (65 బాల్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 110) టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించినా.. న్యూజిలాండ్ జోరు ముందు ఆ టీమ్ తేలిపోయింది. ఇరుజట్లకు సూపర్–8కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్న మ్యాచ్‌లో కివీస్ చెలరేగింది. టార్గెట్ ఛేజింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్–డి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. దాంతో ఆరు పాయింట్లతో గ్రూప్‌లో రెండో ప్లేస్‌లో నిలిచి సూపర్–8కు అర్హత సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కెనడా.. సమ్రా మెరుపు సెంచరీతో 20 ఓవర్లలో 173/4 స్కోరు చేసింది. . తర్వాత న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో 176/2 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్ (6), ఫిన్ అలెన్ (21) ఫెయిలవడంతో కివీస్ 30/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో రచిన్, ఫిలిప్స్.. కెనడా బౌలింగ్‌ను ఉతికేశారు. మూడో వికెట్‌కు 146 రన్స్ జోడించి జట్టును గెలిపించారు. ఫిలిప్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సమ్రా వంద..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ 19 ఏండ్ల యువరాజ్ వన్ మ్యాన్ షో చూపెట్టాడు. ఆరంభం నుంచే భారీ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన అతను రికార్డు సెంచరీతో భారీ స్కోరు అందించాడు. రెండో ఎండ్‌లో దిల్‌ప్రీత్ బజ్వా (36) కూడా నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో 36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సమ్రా తర్వాత మరింత స్పీడు పెంచాడు.
14వ ఓవర్లో జెమీసన్ (1/41).. బాజ్వాను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 116 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి సమ్రా ఆట మరో మెట్టు ఎక్కింది. ధలివాల్ (10), కిర్టన్ (2) విఫలమైనా సమ్రా మాత్రం భారీ షాట్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 58 బాల్స్‌లో సెంచరీ సాధించాడు. చివరి ఓవర్‌లో సమ్రా వెనుదిరగగా, హైలిగర్ (8 నాటౌట్) స్కోరు 170 మార్కు దాటించాడు.
సంక్షిప్త స్కోర్లు
కెనడా: 20 ఓవర్లలో 173/4 (యువరాజ్ సమ్రా 110), దిల్‌ప్రీత్ 36, డఫీ 1/25, హెన్రీ 1/28). న్యూజిలాండ్: 15.1 ఓవర్లలో 176/2 (ఫిలిప్స్ 76*, రచిన్ 59*, డిలాన్ 1/42, ).
