ఫుడ్ ఛాలెంజ్ వీడియో: 50 రకాల వంటకాలతో 7  కేజీల గ్రాండ్ ‌థాలీ..

ఫుడ్ ఛాలెంజ్ వీడియో: 50 రకాల వంటకాలతో 7  కేజీల గ్రాండ్ ‌థాలీ..

మామూలుగా మనం భోజనం చేసినప్పుడల్లా మహా అయితే ఒక 250 గ్రాముల ఆహారం తీసుకుంటాం. మరీ వెరైటీలు ఎక్కువైతే ఇంకొంచెం లాగిస్తాం. ఆ మాత్రానికే పొట్ట పట్టుకొని జీర్ణం కావడం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటాం. అటువంటింది.. 7 కేజీల ఆహారం తినాలంటే? ఇంగ్లాండ్‌లోని ఇండియన్ రెస్టారెంట్ ఈ పోటీ పెట్టింది. ఏకంగా 50 రకాల వంటకాలతో తయారు చేసిన గ్రాండ్ థాలీని తినగలరా? అని భోజన ప్రియులకు సవాల్ విసురుతోంది. అది కూడా ఒక గంటలోనే తినాలంట. ఈ విచిత్ర పోటీ పెట్టిన లిల్లీస్ ఇండియన్ రెస్టారెంట్ గ్రేటర్ మాంచెస్టర్‌లోని అష్టన్‌లో ఉంది. ఈ పోటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను గ్రాండ్ థాలీ పేరుతో ఆ రెస్టారెంట్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.

ఈ గ్రాండ్ థాలీలో ఎనిమిది రకాల రోటీలు, మూడు రకాల అన్నం, పదహారు కూరలు మరియు సబ్జీ, మూడు డిప్‌లు, ఆరు డెజర్ట్‌లు, రెండు లస్సీలు మరియు రెండు రుచికరమైన స్నాక్స్ వంటివి ఉన్నాయి. భారతీయ వంటకాలన్నీ కలగలిసిన ఈ గ్రాండ్ థాలీ ధర 35 పౌండ్లు. (ఇండియన్ కరెన్సీలో రూ. 3,611).

ఈ సవాలును స్వీకరించడానికి ఆగస్టు 4న ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. అయితే, వారు ఈ థాలీని తినడానికి చాలా ఇబ్బంద పడ్డారు. స్థానిక మ్యాగజైన్ ప్రకారం.. రెస్టారెంట్‌కు రెగ్యులర్‌గా వచ్చే 39 ఏళ్ల జోష్ సాండర్స్ ఈ ఛాలెంజ్‌ను తీసుకున్నాడు. పోటీ ప్రారంభమైన తర్వాత మూడు కేజీల ఆహారం తిన్న తర్వాత ఇక నావల్ల కాదని చేతులెత్తేశాడు. అదేవిధంగా మరో ఇద్దరు పోటీదారులైన టామ్ ఈస్ట్‌హామ్ మరియు లీ డ్రెన్నాన్‌లు కూడా పోటీలో ఓడిపోయినట్లు ఒప్పుకున్నారు. 

ఈ పోటీలో పాల్గొన్న డ్రెన్నాన్ తన అనుభవాన్ని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పంచుకున్నారు. ‘ఈ పోటీలో పాల్గొనడానికి నన్ను ప్రోత్సహిస్తూ నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లిల్లీ రెస్టారెంట్ నిర్వహించిన ఈ పోటీలో ఓడిపోయినా.. మునుపటి రికార్డును అధిగమించి గట్టి పోటీని ఇచ్చాం. కానీ, కొన్ని రోజుల వరకు మేం ఏం తినలేం. ఇండియన్ వంటకాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి’ అని అన్నాడు.

ఈ పోటీపై రెస్టారెంట్ యజమాని ప్రీతిల్ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. ‘నేను ఒక రోజు రెస్టారెంట్‌లో ఖాళీగా కూర్చున్న సమయంలో ఈ ఆలోచన వచ్చింది. ఇది మేం నిర్వహించిన మొదటి పోటీ. పోటీ తర్వత వంటకాలు ఏవీ వృధా చేయలేదు. పోటీలో పాల్గొనే వారందరూ వారి ఇష్టపూర్వకంగానే ముందుకొచ్చారు. పోటీదారులు ఓడిపోయిన తర్వాత మిగిలిన ఆహారాన్ని వారివారి ఇంటికి తీసుకెళ్ళి.. కుటుంబసభ్యులతో కలిసి తినొచ్చు. ఆ విధంగా ఫుడ్ వేస్టేజ్ కాకుండా చూశాం’ ఆయన చెప్పారు.