
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ చాలా టెనార్ల (కాలపరిమితుల) మార్జినల్ కాస్ట్‌ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన బెంచ్‌మార్క్ ఆధారిత లోన్లపై వడ్డీలు తగ్గుతాయి. ఆటో, పర్సనల్ వంటి చాలా లోన్ల ఏడాది టెనార్ వడ్డీని ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుత రేటు 9.10 శాతం ఉండగా, దీనిని తొమ్మిది శాతానికి తగ్గించామని కెనరా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఇతర లోన్లలో ఒక-నెల, మూడు-నెలలు, ఆరు నెలల టెనార్ల రేటు 8.25–-8.80 శాతం పరిధిలో ఉంటుంది. ఓవర్‌నైట్ టెనార్‌పై ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.20 శాతంగా ఉంటుంది. కొత్త రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి వస్తాయి. ఆర్బీఐ గత నెలలో బెంచ్‌మార్క్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తీసుకొచ్చింది.