
మెదక్ (శివ్వంపేట), వెలుగు : మెదక్ జిల్లాలో కొత్తదారిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదివరకు చాలాసార్లు ఎండు గంజాయి ప్యాకెట్ల రూపంలో లభ్యం కాగా, తాజాగా మెదక్ పట్టణంలో చాక్లెట్ల రూపంలో పట్టుబడింది. మరికొన్ని చోట్ల గంజాయిని సిగరెట్లలో నింపి అమ్ముతున్నారు.
దందా తీరు ఇదీ..
మెదక్ పట్టణంతోపాటు కంపెనీలు ఎక్కువగా ఉన్న చేగుంట, చిన్నశంకరంపేట, తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో సీక్రెట్ గా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని కంపెనీల్లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. వారిలో చాలా మంది కిక్కు కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్టున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు కర్నాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా గంజాయిని ఇక్కడికి తీసుకొస్తున్నట్లు సమాచారం. వివిధ రూపాల్లో గంజాయి ఇక్కడికి చేరుకోగా 50 గ్రాముల నుంచి100 గ్రాముల వరకు చిన్న ప్యాకెట్లు తయారు చేసి కంపెనీలు ఉన్న ప్రాంతాల్లోని హోటళ్లు, పాన్ షాప్‌లలో సీక్రెట్‌గా అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు..
శివ్వంపేట మండల కేంద్రంలో సిగరెట్ల రూపంలో, మెదక్ పట్టణంలో చాక్లెట్లు, సిగరెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు తేలింది. ఎక్సైజ్ ఆఫీసర్లకు పట్టుబడకుండా దీనికి ప్రత్యేక కోడ్ ను ఉపయోగిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. గతేడాది మూడు సార్లు వివిధ రూపాల్లో గంజాయి విక్రయిస్తూ కొందరు ఆఫీసర్లకు పట్టుబడగా తాజాగా చాకెట్ల రూపంలో విక్రయిస్తూ దొరికిపోయారు.
ఇవీ ఘటనలు...
గతేడాది జులైలో మెదక్ పట్టణంలో ఎండు గంజాయి పాకెట్లలో నింపి అమ్ముతున్న ముగ్గురు యువకులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ఆఫీసర్లు పట్టుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో నర్సాపూర్ పట్టణంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రైడింగ్ లు నిర్వహించి వెయ్యి గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గత నవంబర్ 26న రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో కటకం రాజు, కోత్వాల్ రజనీ కుమార్ అనే వ్యక్తుల నుంచి 252 గ్రాముల ఎండు గంజాయిని ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13న మెదక్ పట్టణ శివారులోని ఔరంగాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు నిర్వహించిన రూట్‌వాచ్‌లో 70 గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. అలాగే మహారాష్ట్ర నుంచి గంజాయి సిగరెట్లు తీసుకొచ్చి సరఫరా చేస్తున్న మెదక్ పట్టణానికి చెందిన గోవింద్ సింగ్, రవీందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రత్యేక నిఘా పెట్టాం
మెదక్ జిల్లాలో గంజాయి విక్రయాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే పలుచోట్ల ఎండు గంజాయి సరఫరా చేస్తున్నవారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశాం. ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్టు తెలిస్తే ఎక్సైజ్ అధికారులకు సమచారం ఇవ్వాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- రజాక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మెదక్