ఆరుగురి ప్రాణం తీసిన రాంగ్ రూట్

ఆరుగురి ప్రాణం తీసిన రాంగ్ రూట్

న్యూఢిల్లీ: తొందరగా వెళ్లిపోవాలనే ఆత్రం, ఇంతలో ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో రాంగ్ రూట్ లో ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కాడో కారు డ్రైవర్.. సడెన్ గా అడ్డమొచ్చిన ఈ కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో రెండు కార్లలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మహారాష్ట్రలోని జాల్న జిల్లా కద్ వాంచీ గ్రామ సమీపంలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిందీ ఘోరం.. ప్రమాద తీవ్రతకు ఓ కారు నుజ్జునుజ్జుగా మారగా.. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

పెట్రోల్ నింపుకుని హైవే పైకి..

కద్ వాంచీ గ్రామ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకున్న తర్వాత నాగ్ పూర్ వెళ్లేందుకు స్విఫ్ట్ డిజైర్ డ్రైవర్ సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే ఎక్కాడు. అయితే, రాంగ్ రూట్​లో ఎంటర్ కావడంతో ముంబై వైపు వెళుతున్న ఎర్టిగా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లలో ఉన్నవాళ్లు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా నలుగురు గాయపడ్డారు. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కార్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.