భానుడి భగభగ.. ఎండదెబ్బకు కారు దగ్ధం

భానుడి భగభగ.. ఎండదెబ్బకు కారు దగ్ధం

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడిమి, ఉష్ణగాలులకు  జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 దాటితేనే భానుడు భగభగమంటున్నాడు. కాలు బయట పెట్టాలంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఎండ తీవ్రతకు ఓ కారు పూర్తిగా కాలిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో ఎండ వేడికి కారు కాలిబూడిదైపోయింది. జగిత్యాల మండలం చాల్ గల్ గ్రామానికి చెందిన సుర బక్కయ్య  తన కారులో కోరుట్లకు వస్తుండగా ఎండ వేడికి ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బక్కయ్య... రోడ్డు పక్కన కారును ఆపి దిగడంతో  ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించాడు. అయితే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా దగ్ధమైంది.