డిస్కౌంట్లు ఇవ్వడంతో కార్ల ఉరకలు

డిస్కౌంట్లు ఇవ్వడంతో కార్ల ఉరకలు
  • డిసెంబరులో భారీగా అమ్మకాలు

న్యూఢిల్లీ: 2022 డిసెంబరులో ఆటోమొబైల్​కంపెనీలు భారీగా అమ్మకాలను సాధించాయి. ప్యాసింజర్​ వెహికల్​ (పీవీలు) రిటైల్ అమ్మకాలు డిసెంబరులో రికార్డుస్థాయిలో ఉన్నాయని కంపెనీలు చెబుతున్నాయి. త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉండటం, ఇయర్-ఎండ్ తగ్గింపులు, ఆఫర్ల కారణంగా కస్టమర్లు కార్ల షోరూమ్​లకు క్యూలు కట్టారు. త్వరలో మరింత కఠినమైన కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే బండ్ల ధరలు పెరుగుతాయి. అందుకే కొందరు డిసెంబరులోనే కొనేశారు. దీంతో పీవీ సేల్స్​ నాలుగు లక్షల యూనిట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. 2018 డిసెంబర్​లో  అమ్మకాలు 3.82 లక్షల యూనిట్లుగా రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటి వరకు నెలవారీ రికార్డు. కస్టమర్లతో క్యాలెండర్ సంవత్సరం చివరి నెలలో కార్లను కొనిపించాలంటే తగ్గింపులు తప్పనిసరి. అందుకే డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్​ బోనస్​లు, క్యాష్​బ్యాక్​లు ఇచ్చారు. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్​డీఈ) రూల్స్‌‌  ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి  స్టాక్‌‌‌‌ వేగంగా అమ్ముడయిందని మారుతీ సుజుకి  ఈడీ  శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 

ఎస్​యూవీల హవా 

 ఎస్​యూవీల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయని మారుతి శ్రీవాస్తవ చెప్పారు. ఆర్​డీఈ నిబంధనల వల్ల కార్ల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే వెహికల్స్​ విడుదల చేసే కాలుష్యాల స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి సెల్ఫ్​డయోగ్నస్టిక్స్​ కిట్లు ఉండటం తప్పనిసరి.  ఆర్​డీఈ నిబంధనలకు అనుగుణంగా చిన్న డీజిల్ కార్లను తయారు చేయడం కంపెనీలకు వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. అందుకే చాలా కారు మోడల్స్​ను కంపెనీలు దశలవారీగా తొలగిస్తున్నాయని హ్యుందాయ్​కు చెందిన తరుణ్ గార్గ్ అన్నారు. ధరలు తగ్గినందున ప్రస్తుతం వీటి అమ్మకాలు చురుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. భారీగా వెహికల్స్ ​అందుబాటులో ఉండటం, డిస్కౌంట్లు, పాజిటివ్​ సెంటిమెంట్స్​ వల్ల సేల్స్​ పెరిగాయని గార్గ్ చెప్పారు.   ఈ నెలలో ఎక్స్-షోరూమ్ ధరలను పెంచనున్నట్లు పలు కార్ల తయారీదారులు ప్రకటించడంతో చాలా మంది అనుకున్నదానికంటే ముందుగానే వెహికల్​ కొన్నారు. డెలివరీ మాత్రం కొత్త సంవత్సరంలో డెలివరీ తీసుకోవాలని అనుకుంటున్నారు.