కార్బన్ రహిత శక్తి వనరులు పెరగాలె : దొంతి నరసింహారెడ్డి

కార్బన్ రహిత శక్తి వనరులు పెరగాలె : దొంతి నరసింహారెడ్డి

బయోమాస్, కలప  భౌగోళికంగా చాలా ప్రాంతాల్లో అత్యంత ముఖ్యమైన ఇంధనాలుగా కొనసాగుతున్నాయి.  కలప,  కలప ఆధారిత ఇంధనాలు సాంకేతికంగా పరిణతి చెందినవి. పర్యావరణపరంగా దృఢమైనవి. ఆర్థికంగా ఆచరణీయమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక ఇంధన అభివృద్ధికి ఆమోదయోగ్యమైన ఎంపికలుగా ఆమోదం పొందగలవని ప్రపంచ ఆహార సంస్థ నివేదిక వెల్లడిస్తున్నది.

అణుశక్తి, జలశక్తి మీద మిశ్రమ అంచనాలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత, అసంపూర్ణ సాంకేతిక అభివృద్ధి, అధిక ఖర్చు, భద్రత, వ్యర్థాల నిర్వహణ సమస్యల కారణంగా అణు విద్యుత్ వృద్ధి మందగించింది. అనేక దేశాలు తమ అణుశక్తి సామర్థ్యం తగ్గించాయి. కాగా, ఇటీవల దుబాయ్​లో జరుగుతున్న ఓపీ28 సదస్సులో 20 దేశాలు అణుశక్తి ఉపయోగం అవసరం ఉంది అని ప్రకటించాయి.

దీంతో అణు ఇంధనాన్ని మళ్ళీ చర్చలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రయత్నం చేస్తామని ప్రకటన చేసింది. అయితే, అణుశక్తి అనేక ప్రమాదాలతో కూడుకున్న ఇంధనం. దాని ఉపయోగం గురించి ఆలోచించడం ఆత్మహత్యాసదృశ్యం. మరోవైపు జలశక్తి కఠినమైన ఆర్థిక, పర్యావరణ ప్రమాణాలను అందుకుంటేనే ఒక మార్గంగా ఆలోచించవచ్చు.

సమన్యాయం సాధించాల్సిన విధానాలు

జనాభా వృద్ధి అంచనాలు, ఆర్థిక అవకాశాలు, ఇంధన సమర్థతలో మార్పులు, వివిధ ఇంధనాల (శిలాజ, శిలాజేతర) మధ్య మార్పులు, సాంకేతిక ఆవిష్కరణ, వ్యాప్తి, పర్యావరణ సమస్యలు, పెట్టుబడి, సమర్థవంతమైన సంస్థలు,  ప్రభుత్వ విధానాలు వంటి అనేక అంశాల ఆధారంగా భవిష్యత్ శక్తి ప్రణాళికలు తయారు చేయబడతాయి. అయినప్పటికీ, ప్రపంచంలోని ప్రస్తుత ప్రాథమిక శక్తి సరఫరా 75శాతానికి పైగా శిలాజ ఇంధనాల నుంచి వస్తున్నది.

పెద్ద హైడల్ శక్తి కాకుండా కొత్త పునరుత్పాదక వస్తువుల నుంచి కేవలం 2శాతం మాత్రమే. మొత్తం మీద వివిధ కోణాల నుంచి ఆలోచించినప్పుడు కార్బన్ రహిత శక్తి వనరుల వినియోగం (డీకార్చనైజేషన్​) వైపు మళ్లడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అంత సులువు అయిన మార్గం కాదు. కానీ తప్పదు. వాతావరణ మార్పులు  ప్రకృతి వైపరీత్యాల రూపంలో ముంచుకొస్తున్న తరుణంలో ఈ మార్గంలో తప్పనిసరిగా నడవాల్సిందే.

65 శాతం తగ్గనున్న వాయు కాలుష్యం 

 మొత్తం 600 కోట్లకు పైగా ఉన్న ప్రపంచ జనాభాలో దాదాపు 200 కోట్ల మందికి వాణిజ్య ఇంధన సేవలు అందుబాటులో లేవు.  సమానత్వం, సమన్యాయం ఆధారంగా శక్తి వనరుల ఉపయోగంలో పరివర్తన రావాలి. ఒక దేశం దీర్ఘకాలిక ఇంధన డిమాండ్, ఉద్గారాల పథం మీద ప్రభావం చూపే అంశాలు ఆ దేశం ప్రధానంగా జనాభా, ఆదాయం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, పరిపాలన పట్ల తీసుకునే విధాన నిర్ణయాల బట్టి ఉంటాయి.

జీహెచ్​జీ ఉద్గారాలను తగ్గించే చర్య గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. రవాణా విద్యుద్దీకరణ, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణా విస్తరణ ద్వారా నగరాల్లో వాయు నాణ్యతను గణనీయంగా మెరుగుపరచవచ్చు. యూరోపియన్ యూనియన్ లో జీహెచ్​జీ తగ్గింపులు, గాలి నాణ్యత చర్యల సమ్మిళిత ప్రభావం వల్ల 2005తో పోలిస్తే 2030లో వాయు కాలుష్యం 65 శాతం తగ్గుతుందని అంచనా. ఈ పరిణామాలు మరణాలను కూడా తగ్గిస్తాయని భావిస్తున్నారు. 2030లో సంవత్సరానికి 17 బిలియన్ల వరకు, 2050 లో 38 బిలియన్ల వరకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. 

కాప్​ 26 సదస్సులో పంచామృత లక్ష్యాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లాస్గో నగరంలో జరిగిన  కాప్​26 సదస్సులో  పంచామృత లక్ష్యాలు ప్రకటించారు. 2030 నాటికి పునరుత్పాదక శక్తి సామర్థ్యం 500 గిగావాట్లకు పెంచుతామని, అప్పటికి 50 శాతం విద్యుత్ అవసరాలు పునరుత్పాదక శక్తి వనరుల నుంచి వాడుకుంటామని, 2070 నాటికి కాలుష్య ఉద్గారాలు తటస్థ స్థితికి తెస్తామని అన్నారు. విద్యుత్ పరివర్తన ప్రణాళిక నీతి ఆయోగ్ తయారు చేసింది కూడా. అయితే, సమాంతరంగా థర్మల్ విద్యుత్ సామర్థ్యం మరో 64 గిగావాట్లకు పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది.

థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా, వేగంగా ముగింపు పలికే నిర్ణయాలు తీసుకోవడానికి భారతదేశం సహా ప్రపంచ దేశాలేవీ సిద్ధంగా లేవు.  ఈ ఏడు కాప్​28 సదస్సులో శిలాజ ఇంధనాల ఉపయోగానికి ముగింపు పలికే నిర్ణయం వెలువడే అవకాశాలు పెరిగినాయి. థర్మల్ విద్యుత్ మీద ఆధారపడిన రంగాల మీద భారం పడకుండా, ఆయా రంగాల వృద్ధిని కొనసాగించే విధంగా విద్యుత్​ ఉత్పత్తి విధానంలో మార్పు తీసుకురావడం పెద్ద సవాలు.

పునరుత్పాదక శక్తి వనరులు (సౌర శక్తితో సహా) వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు, వాణిజ్య డిమాండ్ వంటి ప్రధాన వినియోగ రంగాలను సుస్థిర ఇంధన వినియోగం వైపు మళ్ళించడం అవసరం. ఇంధన అవసరాలు అన్నీ  విద్యుత్ ద్వారా తీర్చుకుంటే ఉపయుక్తమని అధ్యయనాలు చెబుతున్న తరుణంలో  విద్యుత్ వాహనాల ఉపయోగం అవసరమని కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

పెరగనున్న ఇంధన డిమాండ్​

మొత్తం ప్రపంచ ప్రాథమిక ఇంధన డిమాండ్​లో భారతదేశం వాటా 2040 నాటికి 6 నుంచి11శాతానికి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు, భారతీయ ప్రస్తుత శక్తి వనరుల మిశ్రమం ఎక్కువగా శిలాజ ఇంధనాలైన  బొగ్గు, ఆయిల్ మీద ఆధారపడి ఉంది. ప్రపంచవ్యాప్త వాతావరణ ఆందోళనల నేపథ్యంలో భారతదేశం తన శక్తి వనరుల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? భారతదేశ ప్రస్తుత సగటు తలసరి ఇంధన వినియోగం ప్రపంచంలో పావు వంతు.

అయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ, శక్తి వినియోగం పెరుగుతుంది. అందువలన భారత దేశం విధానాలు, కార్బన్ రహిత శక్తి వనరుల వినియోగం, మార్పు ప్రణాళికలు ప్రపంచానికి కీలకం. భారత ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. థర్మల్ విద్యుత్ తగ్గిస్తూ ఇతర పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం పెంచడానికి వ్యూహ రచన చేయడం అత్యంతవసరం. 

-డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్